ముందు ఓ చిన్న ఉదాహరణ చెప్తాను. మనం ఓ ఛాయిస్ ఎంచుకోవలసి వచ్చిందనుకుందాం. అది మనకు మనమైనా ఎంచుకోవచ్చు, లేదా మన కోసం వేరొకరైనా ఎంచుకోవచ్చనుకుందాం. ఛాయిస్ మనదైనా, ఇతరులదైనా రిజల్ట్ మాత్రం ఒకే విధంగా ఉంటుందనుకుంటే..
ఛాయిస్ ని మీరంతట మీరే ఎంచుకుంటారా..
లేక..
ఇతరులకు వదిలేస్తారా..?
చాలావరకూ ఛాయిస్ మనదే అయి ఉండాలని కోరుకుంటాం కదా!
మనమే deciding factor అవడం వల్ల ఫలితం మనకు అనుకూలంగా రాదు అని స్పష్టంగా తెలిసినా నిర్ణయం మన చేతిలో నుండి బయటకు వెళ్లడానికి మనసు ఒప్పుకోదు. దీనికి ఒకటే కారణం, మనం ఏదోలా ఫలితాన్ని ప్రభావితం చేయగలుగుతాం అని బలంగా నమ్ముతుంటాం. ఛాయిస్ మనదే అయితే ఫలితం మనకు కావలసిందే వస్తుందన్న గుడ్డి నమ్మకం.
మన జీవితంలో మన ప్రమేయం లేకుండా జరిగే ప్రతీ సంఘటనా మనకు అనుకూలంగా మలుచుకోవడానికే తాపత్రయపడతాం, మన ఆరాటం వల్ల ఒరిగేదేమీ లేకపోయినప్పటికీ! ఫలితం మనం కోరుకున్నట్లు రాకపోతే నిలువెల్లా నిరుత్సాహపడిపోతాం. ఒక్కోసారి మన నిర్ణయాల వల్ల వచ్చిన ఫలితాలకు మనం ఏ మేరకు బాధ్యత వహించాలన్నది కూడా అర్థం కాదు.
జీర్ణించుకోవడం కష్టమైనా.. జీవితమే కలగాపులం. మనం కోరుకున్నది ఒకటి వచ్చే ఫలితం ఒకటి. నిర్ణయాల్లో, ఆలోచనల్లో మన బలవంతపు ప్రమేయం వల్ల ఫలితం మనం కోరుకున్నట్లు వచ్చే అవకాశాలు చాలా అరుదు. మన జీవితంలో తలెత్తే ప్రతీ సంఘటనా మన స్వీయనియంత్రణలో ఉందని భ్రమించి, ఫలితం మనకు అనుకూలంగా వస్తుందని ఆశలు పెంచుకోవడానికి బదులు.. ఫలితం ఎలా ఉన్నా మెరుగైన పద్ధతిలో ఎలా స్వీకరించాలి అన్న దానిపై దృష్టి పెడితే ఫలితం మనల్ని బాధించదు.
– నల్లమోతు శ్రీధర్
ఎడిటర్
కంప్యూటర్ ఎరా తెలుగు మేగజైన్
Leave a Reply