జగమంత కుటుంబం.. ఏకాకి జీవితం… ఈ పాటా, ఈ పదాలూ తలుచుకుని నిర్లిప్తంగా నవ్వుకోని పెదాలుండవేమో… 🙂
బ్రహ్మాంఢమంత ప్రపంచంలో ఓ అణువుగా మూలన ముడుచుకుపోవడమూ మనకు తెలుసు.. మనమే బ్రహ్మాంఢంగా మిడిసిపడడమూ తెలుసు!
ప్రపంచంలో ఆనందాన్ని వెదుక్కోవాలా, మనలో ఆనందాన్ని వెదుక్కోవాలో తెలీక ప్రతీ క్షణమూ గందరగోళమే..
ఆ గందరగోళం నుండే ప్రపంచం మన ఆనందాన్ని ఆస్వాదించట్లేదన్పిస్తుంది.. బాధలు పంచుకోట్లేదన్పిస్తుంది.. ఒంటరి భావన వస్తుంది… సిరివెన్నెల "జగమంత కుటుంబమూ.. ఏకాకి జీవితమూ" గుర్తొస్తుంది..
మనం అనుకునే మన వాళ్లయిన మనుషుల చిన్న ప్రపంచం మన ఊహల్లో, ఆలోచనల్లో బంధీ అవ్వదు..
"నా ఆనందాన్ని నువ్వూ ఆస్వాదించు" అంటే మన మనిషే అయినా కాసేపు ఆనందం మొహంపై పులుముకుని.. మనల్ని మాయచేసేసి.. మరుక్షణం తమ పనిలో మునిగిపోతారు… మారాం చేస్తే తల్లి మాయ చేసి సముదాయించి వెళ్లిపోతే బిక్కమొహం వేసుకుని చూసే పసి పిల్లాడికీ మనకూ తేడా ఉండదా క్షణం.
మన వాళ్లపై, మనదైన ప్రపంచంపై మన అంచనాలు చాలా పెద్దవి.. అందరూ మన చుట్టూ తిరుగుతుండాలి.. అన్నీ మనతో పంచుకోవాలి.. ప్రతీ పనిలో మన ప్రమేయం ఉండాలి.. మన ఆనందాల్నీ, బాధల్నీ మన కంటే గాఢంగా అనుభవించాలి… అప్పుడే మన మనస్సుకి ఊరటా.. మనం సమూహంలో ఉన్నామన్న భరోసా… లేదా ఏకాకి జీవితమే గుర్తొస్తుంది.. 🙂
ఓచోట అందరూ నవ్వుతుంటారు.. సెలబ్రేట్ చేసుకుంటూ ఉంటారు… మనమూ హాపీగా వెళతాం… హడావుడి చేసేస్తాం… పక్కకు వచ్చి అంతే డిటాచ్డ్గా మనస్సుని అంతర్ముఖం చేసుకుని మనతో మనం సంతోషంలో మునిగి తేలే నేర్పు మనకు కావాలి..
అంతే తప్ప ఆ నవ్వులూ, ఆ హడావుడినే నమ్ముకుంటే.. అదే ఆనందం అనుకుంటే.. అక్కడ ఆనందంగా గడిపిన పదిమందీ అలా అందరూ కలిసే క్షణం వరకూ ఏడుస్తూనే ఉన్నారు తమ స్వంత జీవితాల్లో.. ఆ కలయిక అయిపోయాక మిగిలేది మళ్లీ వాళ్లకు ఏడుపులే.. ఇక్కడ రెండు విషయాలు స్పష్టం…
1. అందరూ కలవడం ద్వారానే ఆనందం అక్కడ సృష్టించబడింది.. ప్రపంచపు ఆ ఆనందాన్ని జీవితాంతం మనం ఆస్వాదించాలంటే ఆ పదిమందినీ వారి పనులు, వ్యక్తిగత విచారాలూ వదులుకోమని చెప్పి కలిపి ఉంచలేం
2. పక్కకెళ్తే మళ్లీ రొటీన్ టెన్షన్లతో అందరూ ఎవరి ఏడుపు వాళ్లు మొదలెట్టేవాళ్లే..
ఈ ఎగ్జాంపుల్కి కంక్లూజన్ ఏంటంటే అందరూ కలిసి ఉన్న కొన్ని క్షణాల ఆనందం మనకు జీవితాంతం దొరకదు. ఇకపోతే ఆ కాసేపు హాపీగా మజా చేసి మళ్లీ మనం ఏడుపు మొదలెట్టడమే లైఫ్ అయితే మనతో మనం ఉండడం చేతకానట్లే.
………………………………..
ఇక్కడ నేను ఫాలో అయ్యే ఓ ఫార్ములా చూడండి…
1. ఈ క్షణంలో నా చుట్టూ ఉన్న నా చిన్న యావత్ ప్రపంచం నాది…
2. మరుక్షణంలో ఏ ప్రపంచమూ నాకు లేదు.. నాలో నేను తప్ప!
పాయింట్ 1లో యావత్ ప్రపంచం నాదనుకున్నప్పుడు నా గురించి నాకెలాంటి స్వార్థమూ లేదు.. అందరి శ్రేయస్సుపై ఆలోచన తప్ప!
పాయింట్ 2లో నాకు నేనే అనుకునేటప్పుడూ.. నాకు ఈ ప్రపంచంపై ఎలాంటి కంప్లయింట్లు లేవు…
అంటే అర్థం.. ఈ ప్రపంచం నుండి ఆనందాన్నో, స్పందనలో, ఇంకేదో ఆశించి.. భంగపడడం వల్ల కలిగిన ఫీలింగ్ కాదు "నాలో నేను" ఉండాలనుకునేది. నాకు నేనూ హాపీనే, ప్రపంచంలో నేనూ హాపీనే!
ఈ ఒక్క ఫార్ములా నన్ను వ్యక్తిగతంగా చాలాకాలం నుండి సంతోషంగా ఉంచుతోంది.. ఎవరైనా ప్రయత్నించాలనుకుంటే ప్రయత్నించవచ్చు.
ధన్యవాదాలు
గమనిక: ఇది ఎవరికైనా పనికొస్తుంది అన్పిస్తే ఇతరులకూ షేర్ చెయ్యగలరు.
– నల్లమోతు శ్రీధర్
ఎడిటర్
కంప్యూటర్ ఎరా తెలుగు మేగజైన్
http://computerera.co.in
http://youtube.com/nallamothu
http://nallamothusridhar.com
Leave a Reply