మనుషులు నిర్ధయగా మాటల గారడీ మధ్య ఇరికించేస్తారు…
మనం మాట్లాడే మాటలు వేరే అర్థాలతో ధ్వనింపజేయబడతాయి.. అస్సలు మనం మాట్లాడనే మాట్లాడని మాటలు కొత్తగానూ సృష్టించబడతాయి…
ఎవరికి అనుకూలంగా వాళ్లు బలమైన platform నిర్మించేసుకుంటారు…. నిలబడడానికి మనకు నేల కూడా మిగలదు….. ఇలాంటి మనుషులతో జీవితం ఎలా అని తెలీని భయమూ వేసేస్తుంది…
ఇది విశ్లేషణ కాదు.. ఎన్నో సందర్భాల్లో నేను స్వయంగా ఎదుర్కొన్న పలు అనుభవాల సారం…
ఏం లేదు…. మనుషులు గెలవాలి అంతే! మాటలు వంపులు తిప్పితే గెలిచిపోతామన్న పిచ్చి నమ్మకం 🙂
పోనీయండి….
మాటలు అనుకూలంగా మలుచుకోబడినంత మాత్రానా…. ఎదుటి వ్యక్తిని దబాయించడానికి మాటలొక్కటే ఆయుధంగా భావించినంత మాత్రానా తప్పు ఒప్పయిపోదు కదా! విచక్షణతో కూడిన మౌనం మాటలతో నెగ్గడం కన్నా బలమైందని అర్థమైతే మరోమారు మాటలతో ఓటించి కొట్టడానికి ఎవరూ ముందుకు రారేమో 🙂
తప్పుని ఒప్పుకోని వాడు పెద్ద గొంతునే నమ్ముకోవడంలో ఆశ్చర్యమేముంది… తల వంచుకుని మౌనంగా నిలబడడం ఎంత గొప్ప విషయమో అందరం అర్థం చేసుకోవాలి…
చాలా సందర్భాల్లో నేను ఓ ప్రేక్షకుడిలా చూస్తూ ఉన్నాను….
ఎన్నాళ్ల నుండి మనస్సుల్లో తుప్పు పట్టించుకుని దాపెట్టుకున్న కత్తుల్ని ఒకరిపై ఒకరు దూసుకోవడం…. ఆ కత్తులు ప్రతీ మనస్సునీ ఎంతెంత గాయాలు చేస్తున్నాయో ఒక్కరికీ పట్టదే? నాకొకటే అన్పిస్తుంది… ఇలాంటివి చూసినప్పుడల్లా….!!
"చంపుకోండి… ఇలా మాటలతో చంపుకోవడం కన్నా ఒకరి తలలు మరొకరు నరుక్కుని చావడం చాలా నయం" అని!
మనిషిని మనిషితో కలిపి ఉంచలేని ఈ చదువులు ఎందుకు.. ఈ తెలివితేటలెందుకు….సిగ్గేస్తోంది మనుషుల్ని చూస్తుంటే!! నిజ్జంగా ఇది మనసులో కలుక్కుమని అన్పించి రాస్తున్నా…. నేను చూసిన ఎన్నో సంఘటనలకు స్పందనగా రాస్తున్నా!!
40-50 ఏళ్లు ఒకర్నొకరు గౌరవించుకుంటూ బ్రతకడం కూడా చేతకాదు… ఏం చేసుకోను మనందరికి ఈ జీవితం?
ప్రతీ ఒక్కరికీ రోషాలూ, పౌరుషాలూ, పట్టింపులూ, ప్రతీకారాలూ!! తోటి మనిషితో మాట పట్టింపు వస్తే చాలు… "చచ్చినా వెనక్కి తగ్గేది లేదని" సవాళ్లు!! ఇలాంటి సవాళ్లకు నిజంగా శక్తే ఉంటే… ఎలా వెనక్కి తగ్గలేమో అంతుచూసి కానీ వదలవు… అప్పుడు అన్పిస్తుంది… సవాళ్ల కన్నా చావు భయంకరమైనదని… చచ్చినా మళ్లీ సవాళ్లకు చావు అనే పదాన్ని వాడుకోకూడదని!!
కాస్తో కూస్తో చుట్టూతా మంచి మనుషులే ఉన్నారు కదా….. ఏదో చావలేక బ్రతుకుతున్నట్లు ప్రతీ క్షణం ఏడుపులెందుకు?
మనిషిని కలుపుకుపోతే ఏం పోతుందని?
కొందరికి ఉమ్మేయడం అలవాటు…. అలా వేసిన వారినీ క్షమించి కలుపుకుపోతే మనస్సులో ఇంకేం బాధ మిలుగుతుంది?
చివరిగా ఒక్కమాట దేన్ని ఎంతవరకూ ఎలా తీసుకోవాలో తెలీక చాలా జీవితాలు వేదనలో, బాధల్లో, కష్టాల్లో, ఎడతెరిపి లేని ఆలోచనల్లో కృంగి కృశించిపోతున్నాయి…
బాధ ఎక్కడో లేదు…. మన మనస్సులో తయారయ్యేది తప్పింది బాహ్యమైనది కాదు!!
గమనిక: ఇది ఎవరికైనా పనికొస్తుంది అన్పిస్తే ఇతరులకూ షేర్ చెయ్యగలరు.
ధన్యవాదాలు
– నల్లమోతు శ్రీధర్
ఎడిటర్
కంప్యూటర్ ఎరా తెలుగు మేగజైన్
http://computerera.co.in
http://youtube.com/nallamothu
http://nallamothusridhar.com
ఆదిపత్యం ప్రదర్శించడానికి కొంతమంది మాటలతో రెచ్చిపోయినప్పుడు …నేనే ఆశ్రయించేది మౌనాన్నే…………