‘అనుభవించడానికి తప్ప ఎందుకీ జీవితం’ అనే నైజం పెద్దల నుండి పిల్లల వరకూ ఆక్రమించుకు పోయింది. అనుభవించడమంటే బాధ్యతలు మర్చిపోయి చేయాల్సిన పనులు గాలికొదిలేసి ఎంచక్కా ఏ సినిమాల గురించో, రాజకీయాల గురించో మాట్లాడుకుంటూ, ఫ్రెండ్స్‌తో షికార్లూ, పార్టీలు చేసుకుంటూ, అసలు ఆఫీసుకి ఈరోజు సెలవుంటే ఎంత బాగుణ్ణు అని సణుక్కుంటూ, ఫ్రెండ్స్‌తో ఫోన్లలో గంటల తరబడి బాతాఖానీ వేస్తూ గడపడమే సగటు మనిషి జీవితమైపోయింది. ఓ నాలుగు రాళ్లు సంపాదిస్తూ వాటిని ఖర్చుపెట్టుకుంటూ అదే జీవితమని భ్రమించడం, డబ్బుతో లభించే ఆ కొద్దిపాటి ఆనందాలనే జీవితంలో ఎంజాయ్మెంట్ అని సంకుచిత పరిధుల్లో బ్రతికేయడం ఎంత దయనీయమైన స్థితో మనకు అర్థం కావట్లేదు. మన జీవితాలకు ఓ అర్థముంది. మనమంటూ ఈ ప్రపంచంలో చేయాల్సిన బాధ్యతలు ఎన్నో ఉన్నాయి. పొట్టకూటి కోసం మనం చేస్తున్న పనులు అర్థ రహితమైనవి. అవి మన పొట్టనింపగలవు తప్ప మన బాధ్యతలను సక్రమంగా నిర్వర్తించడానికి ఉపయోగపడవు.
ఈ ప్రపంచంలో మనం మాత్రమే చేయగలం అని గర్వంగా చెప్పుకోగలిగేలా ఏదైనా చేయాలన్న తపన ఎంతమందిలో ఉంది? ‘ఎముకలు కుళ్లిన, వయస్సు మళ్లిన సోమరులారా చావండి’ అని శ్రీశ్రీ అన్న మాటలు ప్రతీ ఒక్కరికీ వర్తిస్తాయి. మనదైన సృష్టిని మనం ప్రపంచంలో చేయలేనప్పుడు మనకు సత్తువెందుకూ, దేహమెందుకు, ఊపిరెందుకు? ఖరీదైన బైకులూ, సెల్ఫోన్లూ, కార్లూ, బంగ్లాలూ, మందీమార్భలం, హోదాతో వచ్చిన తలపొగరూ.. ఇదే వెనక్కి తిరిగి చూసుకుంటే మనకు కన్పించే మన జీవితమైతే ఇంత దౌర్భాగ్యకరమైన జీవితాన్ని గడిపి దాన్ని గర్వంగా చెప్పుకుంటున్నందుకు మనం సిగ్గుపడాలి. అసలు ఈ ప్రపంచానికి ఏమి అందించామని మనం ఇలాంటి జీవన సరళితో ఘనకార్యం సాధించినట్లు పొంగిపోతున్నాం?
కొంతవరకూ మన కోసం మనం బ్రతకడం తప్పదు.. అలాగని ఉన్న ఆయుష్షునంతా మనకోసమే బ్రతికేసి అదే జీవితమని ఆఖరి ఘడియ వరకూ భ్రమపడడం.. ఇలా ఒకర్ని చూసి మరొకరు మరిన్ని రాళ్లు వెనుకేసుకుంటూ అదో ఆదర్శవంతమైన జీవితం అన్నట్లు చూసి నేర్చుకుంటూ పోవడం వల్ల సమాజానికి ఒరుగుతున్నదేమిటి? ప్రతీ మనిషిలోనూ అపారమైన శక్తియుక్తులు ఉన్నాయని మనమే చెప్పుకుంటూ ఉంటాం. కానీ వాటిని ఎప్పుడూ ఉపయోగించం.. ఉపయోగించినా నలుగురికి పనికొచ్చే ఒక్క పనికోసమైనా వెచ్చించము. మన తెలివితేటలైనా, మన సమయమైనా మన జీవితమైనా మన ఒక్కళ్లకే అని గిరిగీసుకుని బ్రతికేస్తున్నప్పుడు మరి ప్రపంచం నుండి సాయం అర్థించడమెందుకు? ఎవరైనా ఏమైనా మనకు చిన్నపాటి సహకారం ఇవ్వకపోతే నిష్టూరాలు పోవడమెందుకు? ప్రతీ జీవితానికీ భగవంతుడు ఓ అర్థాన్ని కల్పించాడు. అది గ్రహించకుండానే మనం ఆయుష్షునంతా గడిపేస్తున్నాం. ఈ ప్రపంచంలో మనదైన ముద్రని మిగిల్చి, ప్రపంచానికి మనకు చేతనైనంత చేసి నిరాడంబరంగా జీవితం నుండి వైదొలగడానికి చాలా మానసికమైన పరిపక్వత కావాలి. మనం తనువు చాలించాలంటేనే ఆడంబరంగా వెళ్లిపోదాం అన్న తలంపుతో జీవించేస్తున్నాం.. ఇక చేయాల్సిన సామాజిక బాధ్యతలు అన్నీ చేసేసి నిరాడంబరంగా ఉండగలిగిన నైజం ఎప్పుడు అలవడాలి? కర్మజీవిగా, నిగర్విగా, నిరాడంబరంగా జీవితాన్ని సఫలీకృతం చేసుకోవడంలో లభించినంత ఆనందం మెటీరియలిస్టిక్ పనులతో, ఎంజాయ్మెంట్లతో పది జన్మలెత్తినా లభించదు.
మీ
నల్లమోతు శ్రీధర్
An inspiring article Sridhar… Sharing it in my Facebook..!!
మీరు చెప్పింది అక్షరాలా నిజం….ప్రస్తుత సమాజంలో అందరూ అదే ధోరణిలో బతికేస్తున్నారు…ఈ వయసులో కాకపోతే ముసలాడయ్యాక అనుభవిస్తామా అంటూ వారు చెయ్యవలసిన పనులను మానేసి…అక్కరలేని డాంబికాలను ఒలకబోస్తూ వారి జీవితాన్ని వారే నాశనం చేసుకుంటున్నారన్న విషయాన్ని మరిచిపోతున్నారు… చాలా బాగా రాశారు……
నేనూ అప్పుడప్పుడు ఇలా ఆలోచిస్తానుగానీ, మరుసటి రోజు లేచాక షరా మామూలే! 🙁 అంటే మీ మొదటి పేరాలో చెప్పినట్లుగాదుగానీ తినడం, పనిలోకెళ్లడం, వచ్చి పడుకోవడం.