అన్నదానం, ఇతర దానాల వెనుక రహస్యం ఇది!
ఎలాంటి కర్మలను త్యాగం చేయాలి ఎలాంటి కర్మలను తప్పనిసరిగా పాటించాలి అన్నది కృష్ణ భగవానుడు చెబుతూ యజ్ఞము, దానము, తపస్సుల గురించి చెప్పారు కదా! యజ్ఞం యొక్క ప్రాధాన్యత ఇప్పటికే తెలుసుకున్నాం. ఇప్పుడు దానం చెయ్యడాన్ని ఆపేయకూడదని కృష్ణ పరమాత్మ ఎందుకు చెప్పారో ఆ కర్మ ప్రాధాన్యతని తెలుసుకోవడం ద్వారా చూద్దాం. “నాకు అది లేదు, ఇది లేదు” అని చాలామంది ఎప్పుడూ లేని వాటి గురించి బాధపడుతూ లోభ గుణానికి గురవుతూ ఉంటారు. లోభ గుణంలో ఉన్న వ్యక్తి మానవ దేహంలో అన్నింటి కన్నా అడుగున ఉండే మూలాధార చక్ర వద్ద ఎనర్జీ బ్లాక్‌ని కలిగి ఉంటాడు. దీనివల్ల అతని శక్తి పై చక్రాల వైపు స్వేచ్ఛగా ప్రవహించక, చివరకు అన్నింటి కంటే పైన తల పై భాగంలో ఉండే ఏడవ చక్ర అయిన సహస్రార చక్ర వరకూ ఎనర్జీ వెళ్లలేక దైవ చింతన, భగవంతుడు, విశ్వంతో ఏకమయ్యే ఆలోచనా శక్తి కోల్పోతాడు.
ఒక మనిషి జీవితంలో అట్టడుగు గుణాలైన కోపమూ, ద్వేషమూ, స్వార్థమూ, అపరాధ భావమూ, భయమూ, ఆత్మన్యూన్యత వంటి క్రింది మూడు చక్రాలకు సంబంధించిన గుణాల నుండి శక్తిని విడుదల చేసి అన్ కండిషనల్ లవ్, విశ్వంలో జరిగే ప్రతీదీ అంగీకరించడమూ, ఎలాంటి జడ్జ్మెంట్స్ లేకుండా యధాతధ దృష్టి, నేను వేరు మిగతా విశ్వం వేరు అనే ద్వైదీ భావం తొలగిపోయి నేనూ, విశ్వమూ, భగవంతుడూ ఒకటే అనే భావనకు చేరుకోవడమూ కలిగించేలా మనిషిని చేయడమే భగవద్గీతలోని శ్రీకృష్ణ పరమాత్ముడిచే చెప్పబడే ప్రతీ శ్లోకంలోని సారాంశం. “దానం” అనే కర్మని ఎందుకు మానేయకూడదు అని పరమాత్మ చెప్పారంటే.. అది లోభమనే లోయర్ ఎనర్జీ బ్లాక్ కలిగిన గుణాన్ని సంహరిస్తుంది కాబట్టి! అప్పుడు మనిషికి మెల్లగా విశ్వంలో ఉన్న ప్రతీ జీవి పట్లా ప్రేమ మొదలవుతుంది కాబట్టి!
గొప్ప దానాలను ప్రస్తావించడానికి తన మరణాన్ని సైతం లెక్కచెయ్యక ఇంద్రుడికి కవచ కుండలాలను దానం చేసిన కర్ణుడిని ఉదాహరణగా చెబుతుంటారు. దానాలలో అనేక రకాల దానాలుంటాయి. అన్నదానం సర్వోతృష్టమైనది అంటారు. దీని వెనుక ఉన్న రహస్యం చూద్దాం. వర్షాలు పడడం ద్వారా మొలకెత్తి సూర్య రశ్మి ద్వారా పొందిన శక్తిని సంగ్రహించుకుని, వివిధ దశలను దాటుకుంటూ బియ్యం గానీ, గోధుమలు గానీ, ఏ ఆహార పంటలైనా శక్తిని గింజల్లో నింపుకుని ఆహారంగా సిద్ధమవుతూ ఉంటాయి. అంటే అవి శక్తి రూపాలు. తాను చేసిన వివిధ పూర్వ జన్మ కర్మల ద్వారా జనన మరణ చక్రంలో జన్మించి భౌతిక రూపం పొందిన ఓ ఆత్మ ఆ దేహంలో కొనసాగాలంటే ఆ దేహానికి కొంత పోషణ జరగాలి. అంటే భూమ్మీద ఉన్న ప్రతీ దేహమూ తన కర్మలు పూర్తి చేసి మరణించి మరో రూపం సంతరించుకునే వరకూ దానికి ఆహారం, నీరు, ఆలోచనలు వంటి వివిధ ఎనర్జీ రూపాల ద్వారా పోషణ అందుతూనే ఉండాలి.
వారు చేసుకున్న కర్మలు పూర్తయ్యే వరకూ ఈ భూమ్మీదే ఉండాల్సిన జీవుడికి.. ఆహారం దొరకని పరిస్థితి ఏర్పడితే ఏంటి.. “అతను కర్మలు పూర్తి చెయ్యకుండా అతను దేహాన్ని వదిలే ప్రమాదం ఉంది కదా”! అందుకే అన్నదానం వంటివి సర్వోతృష్ఠంగా చెప్పబడ్డాయి. ఇవి జీవుడికి శక్తిని ఇస్తాయి. ఆ శక్తి లభించాక పూర్వ జన్మ కర్మలను సరిచేసుకుని ముందుకు సాగుతాడో, లేదా ఈ జన్మలో మరికొన్ని దుష్కర్మలను చేస్తాడో అతని ఇచ్ఛ. (అతని ఛాయిస్)
అలాగే ఒక మనిషికి అన్నం పెట్టేటప్పుడు, ఆ జీవుడు కడుపారా తినేటప్పుడు దానం చేసే వ్యక్తీ, తినే వ్యక్తీ ఇద్దరి వైబ్రేషన్ గమనించండి. మాటలకు వర్ణించలేని ఓ మమకారం కనిపిస్తుంది. అదే అన్ కండిషనల్ లవ్. “అన్నం తింటున్నాను కాబట్టి నేను ప్రేమగా ఉన్నాను” అనే ఓ కండిషనల్ లవ్ గానీ, లేదా “అన్నదానం చేస్తున్నాను కాబట్టి నేను గొప్ప” అనే ఇగోయిస్టిక్ మైండ్ సెట్ గానీ ఇద్దరికీ ఉండవు. రెండు ఆత్మల మధ్య ఏర్పడే అవ్యాజ్యమైన ఎనర్జీ ఫ్లో భౌతికంగా కళ్లకు కన్పించే అన్నం అనే శక్తి రూపకంగా ఒకరి సంకల్పం నుండి మరొకరి ఎనర్జీ రూపమైన దేహానికి పోషణ ఇవ్వడం కోసం, నేను వేరు, నువ్వు వేరు కాదు అనే భావనను బలోపేతం చెయ్యడం కోసం చేరవేయబడుతోంది.
దానం చేసే ధనాన్ని గానీ, ఆహారాన్ని గానీ నీతి, న్యాయ, ధర్మ మార్గాల్లో సంపాదించినప్పుడు మాత్రమే ఏ మనిషైనా దానం చెయ్యడానికి అర్హత సాధిస్తాడు. ఇతరులకు అన్యాయం చేసి, ఇతర సోల్స్ని కష్టపెట్టి అన్యాయంగా, అధర్మంగా సంపాదించిన డబ్బుతో ఎన్ని దానాలు చేసినా అది పుణ్య కార్యం అవదు. తన పేరు ప్రతిష్టలు పెంచుకోవడం కోసం, గొప్పదనం కోసం చేసే దానాలను “ప్రతిష్టాత్మక దానం” అంటారు. దానికి ఎలాంటి విలువా ఉండదు. అది స్వార్థంతో కూడిన దానం. స్వార్థంతో కూడిన ఏ సత్కర్మ అయినా నిరుపయోగమే.
తపస్సు, ధ్యానం ప్రాధాన్యత!
మోక్ష సన్యాస యోగంలో శ్రీ కృష్ణ భగవానుడు త్యజించవద్దు, తప్పనిసరిగా అనుసరించాలి అని చెప్పిన మరో పనే (కర్మ) తపస్సు. వాస్తవానికి తపస్సు అనేది కృత యుగ ధర్మంగా కొనసాగింది. ఆ తపస్సు కాస్తా ఇప్పుడు మనం జీవిస్తున్న కలియుగంలో కలియుగ ధర్మంగా “ధ్యానం” అనే పేరుతో కొనసాగుతోంది. పూర్వ కాలంలో రుషులు తపస్సు చేస్తూ ఉండే వారు. ప్రశాంతంగా కాలంతో సంబంధం లేకుండా కూర్చుని దైవ నామాన్ని స్మరిస్తూ చేసేది తపస్సు. ఇప్పుడు ధ్యానం కూడా దాదాపు అలాంటిదే. దైవ నామం కావచ్చు.. లేదా జ్ఞానేంద్రియాలు అయిన కళ్లు, చెవులు, ముక్కు వంటివి అన్నీ చూస్తూ, అన్నీ వింటూ ఓ మాయా ప్రపంచంలో కొనసాగేలా చేస్తాయి కాబట్టి ఆయా జ్ఞానేంద్రియాల ఇన్‌పుట్‌ని అధిగమించి, నిరంతర సాధన ద్వారా ఓ నిశ్చలమైన స్థితికి చేరుకుని తన సోల్‌ని యాక్సెస్ చేసి, సోల్ ద్వారా విశ్వంతో/భగవానుడితో కలిసిపోయే స్థితికి చేరుకోవడమే ధ్యానం.
“పూర్వ జన్మ కర్మలు చెయ్యడానికి వచ్చిన మనిషి, చేయాల్సిన కర్మలు చెయ్యకుండా ఇలా కళ్లు మూసుకుని ధ్యానం చేసుకుంటూ కూర్చుంటే ఎలా” అని సందేహం రావచ్చు. కొంతమందికి ధ్యానం ఎలా చేయాలో తెలుసు.. అయినా చెయ్యబుద్ధి కాదు. మరికొంత మందికి ధ్యానం ఎలా చేయాలో రాదు, దానిపై నమ్మకం ఉండదు, తెలుసుకోవాలన్న జిజ్ఞాస కూడా ఉండదు.. ఇదంతా ఎందుకు జరుగుతోంది అంటే.. ధ్యానం చెయ్యడం ద్వారా భౌతిక దేహాన్నీ, జ్ఞానేంద్రియాలను, విషయ వాంఛలను అధిగమించి పరమాత్మను చేరుకోవాలన్న సంకల్పం కలగడమూ ఆ మనిషి యొక్క జన్మ సంస్కారాన్ని బట్టి, అతని పూర్వ, ఈ జన్మ కర్మలను బట్టి ఆధారపడి ఉంటుంది. అంతే తప్పించి నేను యూనివర్శల్ ఎనర్జీని, బయట పరిస్థితులతో సంబంధం లేని బ్లిస్ (అలౌకిక ఆనందం)ని ఆస్వాదిస్తాను అని ఎవరికి వాళ్లం థీరిటికల్గా తెలుసుకుని భావిస్తే ఆ స్థితి అందరికీ రాదు. పూజ చెయ్యాలంటే పూజ గది ఎలా శుభ్రంగా ఉండాలో, ధ్యానం చేయాలంటే మొదట జీవుడు తనని తాను అందుకు సిద్ధపరుచుకోవాలి. ఎలాగంటే.. ఇతరుల్ని కష్టపెట్టడం మానేయడం ద్వారా, ఇతరులతో పోల్చుకుని బాధపడడమో, ఇతరుల్ని ద్వేషించడమో ఆపేయడం ద్వారా, వస్తువుల పట్లా, ప్రపంచంలో జరిగే భావోద్వేగాలతో కూడిన విషయాల పట్ల ఆసక్తిని తగ్గించుకుని, యూట్యూబ్, టివి, పేపర్ల వంటి వాటిలో వచ్చే కధనాలకు మన ఎనర్జీ ఫీల్డ్‌ని కలుషితం చేసుకోకుండా కొనసాగడం ద్వారా.. ఒక్క మాటలో చెప్పాలంటే మాయ చేత కప్పబడే ప్రతీ దాన్నీ అధిగమించడం ద్వారా మనిషి ధ్యాన ప్రక్రియ వైపు వెళ్లగలుగుతాడు. దానికి కొంత ప్రాప్తమూ, కొంత ప్రయత్నమూ ఉండాలి.
– Sridhar Nallamothu