ఫలములపై మమకారాసక్తి లేకుండా మరియు ప్రతిఫలాపేక్ష లేకుండా ఈ కార్యములు చేయబడాలి. ఇదే నా ఖచ్చితమైన మరియు సర్వోత్కృష్ట తీర్పు, ఓ అర్జునా.
వివరణ: శ్రీకృష్ణ భగవానుడు ఇంతకుముందు ప్రస్తావించిన ఉత్తమమైన కర్మలైన తపస్సు, యజ్ఞము, దానము అనే కర్మలను కూడా మిగతా కర్మల వలే ప్రతిఫలాపేక్ష లేకుండా, వచ్చే ఫలితాలపై మమకారాసక్తి లేకుండా నిర్వర్తించాలి. ఓ చిన్న ఉదాహరణ చూసి తర్వాతి శ్లోకంలోకి వెళదాం.
తపస్సు, ధ్యానం వంటి కర్మలను చిత్తశుద్ధిచే చేసేటప్పుడు మనస్సుకి పట్టిన మాయలు తొలగిపోయి యూనివర్శల్ ఎనర్జీ ఫీల్డ్‌లోకి మన సోల్‌కి యాక్సెస్ లభించినప్పుడు మన మనస్సుకి అర్థం కాని అనేక చిత్ర విచిత్రమైన భావనలు వస్తుంటాయి. కొన్నిసార్లు కొన్ని మిరాకిల్స్ కూడా జరుగుతూ ఉంటాయి. మన అంతర్దృష్టి (intuition) మెరుగుపడి మన మనస్సులో అనుకున్న విషయాలు ఉన్న ఫళంగా మేనిఫెస్ట్ అయి (రూపం సంతరించుకుని) భౌతిక ప్రపంచంలో జరగడం లాంటి ఎన్నో అనుభవాలు ఎదురవుతాయి. తపస్సు, ధ్యానం చేసే వ్యక్తి వాటిని ఎలాంటి భావోద్వేగాలూ, “నాకు శక్తులు సమకూరుతున్నాయి, నేను వేరే స్థాయికి చేరుకున్నాను” అనే మనస్సు చేత కప్పబడే మరో మాయ లేకుండా వాటిని కేవలం సాక్షీ భూతంగా, తాను నిమిత్తమాత్రుడిగా స్వీకరించాలి. అప్పుడే ఇలాంటి ఎన్నో దశలు దాటి అతని ఆత్మ పరమాత్మతో ఏకమవుతుంది. ఇది చదివిన వెంటనే ధ్యానం వంటివి అభ్యాసం చేసే వ్యక్తికి మరో కోరిక పుట్టొచ్చు. “తన ఆత్మని పరమాత్మతో ఏకం చేసుకోవడం” అనే దాన్ని ఓ లక్ష్యంగా తీసుకోవడం! ఏ లక్ష్యమైనా ఓ కోరికే. ఆ కోరిక పట్ల పైన భగవానుడు వద్దన్న మమకారం ఏర్పడుతుంది. ప్రతీ కోరికా దాన్ని సాధించబడడానికి ఓ ప్రక్రియను అనుసరిస్తుంది. ఉదా.కి.. కారు కొనాలన్న కోరిక లోన్ అప్లికేషన్ పెట్టడం, కార్ షోరూమ్‌కి వెళ్లడం, నచ్చిన కలర్‌ని ఎంచుకోవడం, దానికి ఎగ్స్ట్రా ఫిటింగ్స్ చేయించుకోవడం.. వంటి వివిధ ప్రాసెస్లుగా విభజించబడుతుంది కదా! ఇలా ఆత్మని పరమాత్మతో ఏకం చేసుకోవడం అనే వాక్యాన్ని కేవలం రిఫరెన్స్‌గా, మైండ్ లెవల్లో అర్థం కావడానికి రాయడం జరుగుతుంది తప్పించి.. దాన్ని బయట బాహ్య ప్రపంచంలో సాధించినట్లు కొన్ని కోరికలుగా స్వీకరించి స్నానం చేశాక మెడిటేషన్, మెడిటేషన్ చేసేటప్పుడు ఆల్ఫా బ్రెయిన్ వేవ్స్లోకి వెళ్లడం, ఆ తర్వాత పూర్తిగా మైండ్‌ని అధిగమించడం వంటి దీని తర్వాత అది, దాని తర్వాత మరొకటి వంటి స్టెప్ 1, స్టెప్ 2, స్టెప్ 3 వంటివన్నీ ఓ బలవంతపు కోరికకూ, ప్రయత్నానికీ, దాని ద్వారా పుట్టే ఓ సంఘర్షణకీ గురి చేస్తాయి. అందుకే “తన ఆత్మని పరమాత్మతో ఏకం చేసుకోవడం” వంటి అంశాలను కూడా ఓ స్థూల రూపంలో విషయాన్ని అర్థం చేసుకోవడానికి చదవాలి తప్పించి వాటిని ఓ కర్మగా మార్చుకోకూడదు. పట్టుదలతో కూడిన అభ్యాసంలో అన్నీ చాలా సహజసిద్ధంగా అవే అభ్యాసకుడి అనుభవంలోకి వస్తాయి.
7వ శ్లోకం
నియతస్య తు సన్న్యాసః కర్మణో నోపపద్యతే ।
మోహాత్తస్య పరిత్యాగస్తామసః పరికీర్తితః ।। 7 ।।
విధింపబడిన కర్తవ్య కర్మలను ఎన్నటికీ త్యజించరాదు. ఇటువంటి అయోమయ త్యాగము తామసిక త్యాగము అని చెప్పబడును.
వివరణ:
గృహస్థు ధర్మంలో భాగంగా మీకు పెళ్లయింది. పిల్లలు ఉన్నారు. వారి పట్ల బాధ్యతలు ఉన్నాయి. ఆ బాధ్యతల వల్ల కొన్ని చికాకులు, బాధలు, కష్టాలు అనుభవించవలసి వస్తోంది అనుకోండి. “నాకు ఈ బాధ్యతలు, జంజాటాలూ ఏమీ వద్దు, నేను హిమాలయాలకు వెళ్లి తపస్సు చేసుకుంటాను” అని మీరు బాధ్యతగా చెయ్యవలసిన కర్మలను పూర్తిగా త్యజించవద్దని భగవానుడు చెబుతున్నారు. మనం నిర్వర్తించే ప్రతీ బాధ్యతా మనం ఈ విశ్వం ద్వారా పొందిన శక్తికి మనం తీర్చుకునే రుణమే. ఉదా.కి.. కూర్చోబెట్టి పిల్లలను చదివిస్తున్నారు అనుకోండి. చిన్నప్పుడు మీ తల్లిదండ్రులు మిమ్మలను చదివించిన ఎనర్జీనీ, మీ గురువులు మీకు చేసిన విద్యా బోధనలను మీరు ఇప్పుడు ఈ భూమ్మీదకు వచ్చిన మరికొన్ని సోల్స్కి అన్ కండిషనల్ లవ్ అనే భావనతో అందిస్తున్నారు. కొన్నిసార్లు మనకు ఏర్పడే కష్టాలు కూడా మనం ఎక్కడో, దేన్నో కష్టపెట్టిన అంశం, క్వాంటమ్ ఫీల్డ్‌లోకి వెళ్లిన నెగిటివ్ ఎనర్జీ కొత్త రూపం సంతరించుకుని ఓ కష్టంగా మళ్లీ మన ముందుకు వచ్చి నిలుస్తుంది. అంటే “శక్తి అనేది నాశనం కానిది, అది రూపాలు మాత్రమే మార్చుకుంటుంది” అనే భౌతిక శాస్త్ర నియమాల ప్రకారం ప్రతీ కర్మా ప్రతీ సోల్నీ జీవిత కాలంలో ఎప్పుడోసారి ఏదో రూపంలో వెంటాడుతుంది. ఆ కర్మలు బాధ్యతల రూపంలో ఉండొచ్చు, బాధల రూపంలో ఉండొచ్చు. మరి జీవితంలో ఒక దశలోనో, పూర్వ జన్మలోనో (సోల్ యొక్క మునుపటి రూపం) కొన్ని కర్మలు చేసి, వాటి ఎనర్జీని విశ్వంలోకి వెదజల్లి.. “ఇప్పుడు వాటి పరిణామాలు నాకు వద్దు, నేను భగవంతుడిని తెలుసుకోవాలి, అన్ని పనులూ మానేసి కళ్లు మూసుకుని ధ్యానం చేసుకుంటూ కూర్చుంటాను” అనుకుంటే ఎలా కుదురుతుంది? దీనినే తామసిక త్యాగం అని భగవానుడు చెబుతున్నారు.
అలాగే పెళ్లి చేసుకోవడం, సంతానం కలిగి ఉండడం, లేదా సంతానం లేకపోయి ఉండడం వంటివన్నీ నిషిద్ధ కర్మలేమీ కావు. విశ్వంలో ప్రతీ జీవి తన సృష్టిని ముందుకు సాగించుకోవడానికి విశ్వ శక్తి నుండి ఏర్పడే హార్మొనీనే ఇవన్నీ! భౌతిక రూపాల్లోకి కొన్ని సోల్స్ అకామిడేట్ చెయ్యబడడానికి ప్రతీ గృహస్ధు చేయాల్సిన కర్మలు ఇవన్నీ! సంభోగం సమయంలో భార్యాభర్తల రూట్ చక్ర (మూలాధార చక్ర)లో భారీ మొత్తంలో క్రియేటివ్ ఎనర్జీ ప్రోగుపడి అది అండంగానూ, వీర్యంగానూ కలయిల జరిగి ఓ సృష్టికి బీజం పడడం కూడా ఎనర్జీ తన రూపాన్ని సంతరించుకోవడమే. ఎంత నాణ్యమైన అండం ఉత్పత్తి అవ్వాలి, వీర్యం నాణ్యత, సంభోగ సమయంలో ఇరువురి భావోద్వేగాలు, అకామిడేట్ చెయ్యబడే సోల్‌కి (పుట్టబోయే జీవుడికి) సంబంధించిన పూర్వ జన్మ కర్మలను బట్టి ఓ ప్లాట్ఫారం సృష్టించబడి మనిషి పుట్టుక జరుగుతుంది. ఆ సోల్ తన కాన్షియస్‌నెస్‌ని బట్టి ఈ జన్మలో తాను చెయ్యాల్సిన కర్మలు, ఎదుర్కోవలసిన పరిస్థితులు తాను ఎదుర్కొంటూ ఉంటారు. అలాగే DNAలో తల్లిదండ్రుల నుండి వచ్చే అతి కొద్ది లక్షణాలు తర్వాత జీవుడు తన ఎన్విరాన్మెంట్కి తగ్గట్లు తాను స్పందించే గుణాన్ని మార్చుకోవడం ద్వారా ఏకంగా DNA యొక్క కాపీ అయిన RNAని మార్చుకోవడం కూడా ఇందులో భాగమే.
మనిషి తన భౌతిక జీవితంలో చేయాల్సిన కర్మలను, బాధ్యతలను పూర్తి చేసుకుంటూ వాటి ద్వారా భావోద్వేగాలను, భౌతిక, మానసిక అశాంతికి లోనవుతూ ముందుకు సాగేకొద్దీ అతనికి ప్రాప్తం వచ్చినప్పుడు మాత్రమే ఆత్మజ్ఞానం బోధపడుతుంది. అప్పటి వరకూ ఎన్ని భగవద్గీతలు చదివినా, ఎన్ని పురాణ వ్యాఖ్యానాలు చదివినా తలకెక్కదు. ప్రాప్తం అనేది బ్యాలెన్స్ షీట్ సరిగ్గా సరిపోయాకే లభిస్తుంది. “నేను అందరి మీదా కోప్పడతాను, నన్ను ఎవరూ కోపగించుకోకూడదు” అనేది ఎలా నడుస్తుంది? నువ్వు అందరి మీదా కోప్పడినప్పుడు క్వాంటమ్ ఫీల్డ్‌లోకి ప్రతీ కోపంతోనూ నువ్వు వెదజల్లే ఎనర్జీ కాస్తా ఏదో ఒక రూపంలో మళ్లీ నిన్ను చేరుకుని ఆ భావోద్వేగాన్నో, అశాంతినో నువ్వు అనుభవించినప్పుడు మాత్రమే కదా, లెక్క సరిగ్గా సరిపోయేది. అందుకే ఆత్మ జ్ఞానం మనలో భాగమయ్యే స్థితికి రావాలంటే బాధ్యతలు, బాధలు అనే కొన్ని అనుభవించవలసిన కర్మలను బుద్ధిగా చేసుకుంటూ వెళితే సమయం రావలసి వచ్చినప్పుడు, మన కాన్షియస్నెస్ బ్యాలెన్స్ షీట్ పూర్తయి స్వచ్ఛమైన స్థితికి చేరుకున్నప్పుడు దానంతట అదే సహజసిద్ధంగా భగవంతుడు అంటే ఏంటి, ఒక మనిషిగా మనమేంటి, రెండింటికీ మధ్య అనుసంధానం ఏంటి, రెండూ వేర్వేరు అనే భావనలు ఎలా తొలగిపోయి భగవంతుడితో నువ్వు ఎలా ఐక్యమవుతావు అన్నది స్పష్టమవుతూ ఉంటుంంది.
- Sridhar Nallamothu