దుఃఖమిత్యేవ యత్కర్మ కాయక్లేశభయాత్యజేత్ ।
స కృత్వా రాజసం త్యాగం నైవ త్యాగఫలం లభేత్ ।। 8 ।।
తప్పనిసరిగా చేయాల్సిన కర్తవ్యాలను, కర్మలను అవి కష్టంగా ఉన్నాయని, శరీరానికి అసౌకర్యంగా ఉన్నాయని భావించి వాటిని చెయ్యకుండా, త్యాగం చేస్తే దాన్ని రజో గుణ త్యాగం అంటారు. అటువంటి రజోగుణ త్యాగం ఏమాత్రం శ్రేయస్కరం కాదు, అది ఆధ్యాత్మిక ఉన్నతికి దోహదపడదు.
వివరణ:
ప్లే గ్రౌండ్ ఉంటేనే క్రికెట్ ఆడగలం కదా.. అలాగే సమస్యలు, కష్టాలు, అసౌకర్యాలు, జీవితంలో సంక్లిష్టత ఉన్నప్పుడే అవేమీ మన ఆత్మకి అంటకుండా తామరాకు మీద నీటి బొట్టుగా స్థిమితంగా, ప్రశాంతంగా ఉండేలా మనల్ని మనం సంస్కరించుకోవడానికి సాధ్యపడుతుంది. “పెళ్లాం పిల్లల వల్ల నాకు కష్టాలెక్కువయ్యాయి, నేను వీటిని భరించలేను, జాబ్‌లో టెన్షన్స్ ఎక్కువయ్యాయి, జాబ్ మానేసి ఇంట్లో భగవన్నామ స్మరణ చేసుకుంటూ కూర్చుంటాను..” ఇలా ఒక అసౌకర్యం నుండి పారిపోయే దాన్ని రజోగుణ త్యాగం అని భగవద్గీతలో కృష్ణ భగవానుడు పేర్కొన్నారు.
అంతెందుకు అర్జునుడికి కృష్ణ పరమాత్మ భగవద్గీతను బోధించిన సందర్భాన్నే గుర్తు తెచ్చుకోండి. “యుద్ధభూమిలో యుద్ధం చెయ్యడం తనకి ఇష్టంగా లేదని, తన ధర్మం నుండి పారిపోవాలని” సంకల్పించిన అర్జునుడికి భగవంతుడు చెప్పినదే కదా గీత? అంటే భగవద్గీత ద్వారా అర్జునుడిలో ఎలాంటి మార్పు తెచ్చాడు అంటే.. సమస్యల నుండి, చేయాల్సిన కర్మల నుండి పారిపోయే నైజం నుండి ఆయా కర్మలను పూర్తి చేస్తూనే వాటికి స్పందించని ఊరికే మొరాయించే మనస్సుని స్థిమితపరుచుకునే మెళకువలను శ్రీకృష్ణుడు చెప్పారు. ఈరోజు చాలాచోట్ల పర్సనాలిటీ డెవలప్మెంట్ పేరిట, సాఫ్ట్ స్కిల్స్ పేరిట “దేనికీ రియాక్ట్ కావద్దు, రెస్పాండ్ మాత్రమే అవండి” అంటూ అతి గొప్పగా సెలవిచ్చే సూత్రం భగవద్గీతలో ఎప్పుడో చెప్పబడింది. తరాల తరబడి గీతా సారాన్ని గ్రహించిన వారు తమ జీవితాలను ప్రశాంతంగా గడిపారు. భగవద్గీత ఏం చెప్పిందో తెలియని వారు భావోద్వేగాల్లో కొట్టుకుపోయారు.
ఈ శ్లోకాన్ని నిశితంగా చూస్తే ఒక విషయం స్పష్టంగా గ్రహించవచ్చు. “నాకు ఈ పని చెయ్యడం ఇష్టం, ఈ పని చెయ్యడం ఇష్టం లేదు” అనే ఇష్టాఇష్టాలను ఎవరు డిసైడ్ చేస్తున్నారు? ఆలోచించండి. ఎవరంటే, మన మైండ్ (మనస్సు) మాత్రమే. మైండ్ చేత సృష్టించబడే మరో మాయ ఈ ఇష్టా ఇష్టాలు. పూర్వ జన్మ కర్మలను బ్యాలెన్స్ చేసుకోవడానికి గానీ, కార్యా కారణ సిద్ధాంతంలో భాగంగా మన బాధ్యతలను నెరవేర్చాల్సి వచ్చినప్పుడు ఆ కర్మ ఫలితం ఇతరులకి అందాల్సి వచ్చినప్పుడు గానీ దాని నుండి మైండ్‌కి ఇష్టం లేదని తప్పించుకోవడం సమంజసం కాదు కదా! చిన్న ఉదాహరణ చూద్దాం. ఓ పెళ్లయి, పిల్లలున్న వ్యక్తికి పిల్లలంటే ఇష్టం లేదు అనుకుందాం. పిల్లలను ప్రేమగా దగ్గరగా తీసుకోవడానికీ తన మనస్సుకి అన్పించే చికాకు అనే భావన వల్ల దగ్గరకు తీసుకోకపోతే.. ప్రాకృతిక ధర్మంగా ఆ పిల్లలకు అందాల్సిన ప్రేమని అందివ్వలేనట్లే కదా! అంటే తెలీకుండానే మన ఇష్టా ఇష్టాల మూలంగా మరొకరి ప్రాప్తాన్ని ప్రభావితం చేస్తున్నప్పుడు.. మనం చేయాల్సిన కర్మని పూర్తి చెయ్యకుండా, మరో దుష్కర్మని మూటగట్టుకుంటున్నట్లే!
అందరికీ తెలిసిన మరో ఉదాహరణ చూద్దాం. చాలామంది ఐ.టి. ఉద్యోగులు, ఇతరులు ఈ మధ్య కాలంలో “నాకు ఇంత ప్యాకేజ్ వస్తేనే ఇంత పని చేస్తాను” అని మెటీరియల్ రిజల్ట్కీ, తాను చేసే పనికీ ముడి పెడుతూ ఉంటారు. ఇంత ఫలితం రావాలి అనే పంతం కొద్దీ చేసే ఏ కర్మయినా వేదనకు గురి చేస్తుంది. దాని గురించి భగవద్గీతలోని 9వ శ్లోకాన్ని చెప్పుకున్న తర్వాత తెలుసుకుందాం.
భగవద్గీత 18వ అధ్యాయం – మోక్ష సన్యాస యోగం – 9వ శ్లోకం
కార్యమిత్యేవ యత్కర్మ నియతం క్రియతేఽర్జున ।
సంగం త్యక్త్వా ఫలం చైవ స త్యాగః సాత్త్వికో మతః ।। 9 ।।
అర్జునా, కర్తవ్యమునకు అనుగుణముగా ఎప్పుడైతే కర్మలు చేయబడుతాయో, మరియు ఫలాపేక్ష త్యజించబడుతుందో, దానిని సత్త్వగుణ త్యాగము అంటారు.
భగవంతుడు ఏం చెప్పాడు పైన? “కర్తవ్యములకి అనుగుణంగా ఎప్పుడైతే కర్మలు చెయ్యబడతాయో..” ఈ వాక్యాన్ని చూద్దాం. ఏది కర్తవ్యం అంటే మనకు ఉద్యోగం ఇచ్చిన సంస్థ అభివృద్ధి కోసం చిత్తశుద్ధిగా పనిచెయ్యడం అనేది కర్తవ్యం.
“మరియు ఫలాపేక్ష త్యజించబడుతుందో,” – ఈ వాక్యాన్ని చూస్తే “నాకు ఇంత డబ్బు వస్తేనే ఈ పని చేస్తాను” అనేది ఫలాపేక్ష.
“పనిచేసినప్పుడు డబ్బులు రాకుండా ఎలా.. ఫ్రీగా చెయ్యాలా” అని వెంటనే మనల్ని ఓ భావోద్వేగం వెంటాడుతుంది. అది వివరించబోయే ముందు దీని వెనుక ఉన్న ఓ హేతువుని (కారణాన్ని) చూద్దాం.
మీరు హైటెక్ సిటీ వైపు డ్రైవ్ చేసుకుంటూ వెళ్లేటప్పుడు ఓ పెద్ద ప్రకటన కన్పిస్తుంది. ఓ ఆకర్షణీయమైన కారుదో, లేదా ఇంకో దాని గురించో యాడ్. అవసరాలు వేరు, విలాసాలు వేరు. ఏ మనిషైతే భౌతికపరమైన అవసరాల నుండి విలాసాల వైపు వెళ్లడం మొదలుపెట్టాడో అతనిలో “నాకు అది లేదు, ఇది లేదు” అనే లోభ గుణం, “అన్నీ నాకే స్వంతం కావాలి” అనే స్వార్థం, దురాశ మొదలయ్యాయి. దాంతో పైన భగవానుడు చెప్పినట్లు “ఫలాపేక్ష” విపరీతంగా పెరిగిపోయింది. “నా టైమ్ చాలా విలువైనది, నేను ఐదు నిముషాలు ఒక మనిషితో మాట్లాడితే నాకు ఏమొచ్చింది” వంటి స్వార్థం వరకూ ఇది విస్తరించింది.
దీంతో ప్రతీ క్షణం చేసే కర్మా.. దానికి వచ్చేఫలితమూ రెండూ సరిగ్గా ఉన్నాయా లేదా అనే సరిపోల్చి చూసుకోవడంతోనే మనిషిలో అశాంతి మొదలైంది. ఆ అశాంతి నుండే “నేను ఇంత పని చేస్తున్నాను, నాకు మా కంపెనీ ఇంతే ఇస్తోంది, నేను దోపిడీకి గురవుతున్నాను” అనే అసహనమూ మొదలవుతుంది. మెటీరియల్ ప్రపంచంలో ఇలాంటి అసహనానికి ఒకటే పరిష్కారం చెబుతారు. “మరో కంపెనీ మారిపో.. మరింత ఎక్కువ ప్యాకేజ్ వస్తుంది” అంటూ! నిజమే మారిపోతాం సరే.. మరి కొన్నాళ్లకి అదే సమస్య రిపీట్ అవుతుంది కదా కొత్త కంపెనీలో కూడా! మరి చేసే పని ప్రశాంతతని ఎప్పుడు ఇస్తుంది?
ఏమీ లేని కొంతమంది ఎప్పుడూ ఎంతో సంతోషంగా ఎలా ఉంటారో ఆలోచించండి. మరి అన్నీ ఉన్న మనం ఎందుకు ఎప్పుడూ అశాంతితో ఉంటున్నాం? కారణం ఒక్కటే సంతోషం వస్తువుల్లో లేదు.. మన సోల్లో ఉంది. దాన్ని గుర్తించడమే కర్మ యోగ!
ఒక కర్మని చేసేటప్పుడు దృష్టంతా లేజర్ ఫోకస్‌గా ఆ పని మీదనే ఉండాలి.. దాని ఫలితం మీద కాదు. “మన అర్హతలకు తగ్గట్లు ప్యాకేజ్ దానంతట అదే వస్తుంది, రానప్పుడు కంపెనీ కూడా మారిపోవచ్చు” కానీ గ్రహించాల్సిన విషయం.. బయట కన్పించే ప్రకటనలకు, లేదా విలాసాలకు అలవాటు పడి అన్నీ దక్కించుకోవాలనే తపనతో మన ఎనర్జీ మొత్తం ప్యాకేజ్ మీదనే ఉంటే.. అటు డబ్బూ వస్తుంది, ఇటు నచ్చిన ప్రతీ వస్తువూ వస్తుంది కానీ పోయేది మాత్రం మనశ్శాంతే. ప్రాసెస్‌ని ఎంజాయ్ చేయాలి. చేసే పనిలో నైపుణ్యతను ఎంజాయ్ చేయాలి. అది మన మూలాధార మరియు స్వాధిష్టాన చక్రలలో ఉండే ఎనర్జీని, క్రియేటివిటీని మెరుగుపరిచి సృష్టి జరిగేలా చేస్తుంది. విశ్వానికి తన కంట్రిబ్యూషన్ అందించే వాడు మాత్రమే సృష్టికర్త అయిన భగవంతుడితో ఐక్యం కాగలుగుతాడు.. తాను చేసే సృష్టి యొక్క ఫలితం పట్ల మోహంతో కొట్టుకుపోతే “కోరిక, అది తీరకపోతే డిజప్పాయింట్మెంట్, అది తీరితే మరో కోరిక” అనే మాయలో తన సోల్‌కి దూరంగా జరుగుతూ భగవంతుడికి దూరమవుతాడు.
- Sridhar Nallamothu