న ద్వేష్ట్యకుశలం కర్మ కుశలే నానుషజ్జతే ।
త్యాగీ సత్త్వసమావిష్టో మేధావీ ఛిన్నసంశయః ।। 10 ।।
నచ్చని పనులు తప్పించుకోటానికి యత్నించకుండా లేదా ఇష్టమైన/అనుకూలమైన పనుల కోసం ఆశించకుండా ఉండే వారు నిజమైన త్యాగులు. వారు సత్త్వగుణ సంపన్నులు మరియు వారు ఎటువంటి సంశయములు లేనివారు.
వివరణ: ఇంతకుముందు శ్లోకంలో చెప్పుకున్నట్లుగానే ఇష్టా ఇష్టాలకు అతీతంగా తాము నిర్వర్తించవలసిన కర్మలను చిత్తశుద్ధితో చేసే వారు నిజమైన త్యాగులని కృష్ణ భగవానుడు చెబుతున్నారు. పై శ్లోకంలో “సత్త్వసమానిష్టో” అనే ప్రస్తావన గురించి మనం తెలుసుకోవాలి. లేదంటే అర్థం తెలీకుండా ముందుకు సాగలేం.
త్రిగుణాలు – సత్వగుణం, రజోగుణం, తమో గుణం
ఈ మూడింటిని ప్రకృతి గుణాలు అని భగవద్గీత చెబుతుంది. సృష్టిలోని ప్రతీ జీవిలోనూ , పదార్థంలోనూ ఈ గుణాలు ఆయా జీవుల, పదార్థాల నిర్మాణాన్ని బట్టి వివిధ పాళ్లలో నిక్షిప్తమై ఉంటాయి. సైంటిఫిక్ పరిభాషలో చెప్పుకోవాలంటే ఎలక్ట్రాన్స్, ఫోటాన్స్, న్యూట్రాన్స్ కలగలిసి విభిన్నమైన లక్షణాలు కలిగిన వివిధ భౌతిక పదార్థాలకు రూపం ఏర్పరిచినట్లే ఈ మూడు గుణాల పరస్పర కలయికతో వివిధ జీవరాశులు ఉద్భవిస్తుంటాయి.
మొదట అన్నింటికన్నా తక్కువదైన రజోగుణం గురించి చూద్దాం. చాలామంది ఊరికూరికే కోపంతో ఊగిపోతుంటారు. లేదా ఏడుస్తుంటారు, ఇతరుల పట్ల అసూయ, లేదా నేనే గొప్ప అనే అహంకారం.. ఇలా అనేక లక్షణాలతో ఉన్న వాళ్లు మన చుట్టూ కనిపిస్తుంటారు. ఇవన్నీ రజోగుణ లక్షణాలు. ఒక మనిషి తన ఆత్మని తెలుసుకునే అవకాశం లేకుండా ఈ భౌతిక ప్రపంచంలో చుట్టూ మనుషులు, వాటి పట్ల తమ రెస్పాన్స్ అనే ఓ మాయ ఏర్పడుతుంది కదా, ఆ మాయని చాలా సులభంగా కొట్టుకుపోయే వారు ఈ రజోగుణం కలిగిన వారు. మనం తీసుకునే ఆహారం కూడా రజో గుణాన్ని ప్రేరేపిస్తుంది. ఎక్కువగా ఉప్పూ, కారం, పులుపు, చేదు, మసాలాలు, ఉద్రేకాన్ని కలిగించే ఇతర ఆహార పదార్థాలు (కేంద్రీయ నాఢీ వ్యవస్థను ప్రేరేపించే, అస్థిమితపరిచే తరచూ టీ తాగడం, కాఫీ తాగడం, తాగుడు, సిగిరెట్ వంటివన్నీ) ఒక మనిషిలో ఈ రజోగుణ లక్షణానికి కారణం అవుతాయి.
రజోగుణం కలిగిన వారు తమకు ఏదైనా లాభం ఉంటేనే ఒక పని చేస్తారు, లేదంటే తమని తాము ఆడంబరంగా చూపించుకోవడానికి మాత్రమే పనులు చేస్తారు.
రెండవది తమో గుణం. తమోగుణంలో ప్రధానంగా నాలుగు లక్షణాలుంటాయి.
- ఆవరణ శక్తి – ఉన్న దాన్ని లేదనుకునే అజ్ఞానం. (ఈ లక్షణం చేతే చాలామంది సత్యాన్ని శోధించలేరు. ప్రతీ అంశంలోనూ లోతులకు వెళ్లి సత్యాన్ని తెలుసుకునే అవకాశమున్నా “నాకు తెలిసిందే నిజం” అని ఉన్న కొద్దిపాటి అవగాహనతో కొనసాగే నైజం)
- విక్షేప శక్తి – లేని దాన్ని ఉంది అనుకునే స్వభావం (తన అజ్ఞానాన్ని కూడా తన మైండ్ చేత బలమైన లాజిక్ సృష్టించుకుని లేనిది ఉంది అని నమ్మే స్వభావం)
3, అభావన (పరమాత్మ, సూపర్ పవర్ అనేది అస్సలు లేనే లేదు అనే స్వభావం)
- విప్రతిపత్తి (కొన్నిసార్లు ప్రతీ అంశంపై ఇది ఉందా, లేదా అనే సంశయ స్థితి. సంశయం ద్వారా మేధస్సు పెరుగుతుందని భావిస్తారు, కానీ సంశయం వీలైనంత త్వరగా సత్యం వైపు సాగాలి. లేదంటే అటూ ఇటూ గానీ నైజం మానసిక గందరగోళానికి దారి తీస్తుంది, జీవుడిని బలహీనుడిని చేస్తుంది)
తమో గుణం కలిగిన వారు బద్ధకస్తులుగా, ఏ పనీ చెయ్యబుద్ధి కాకుండా, ఏదైనా పనిచేసేటప్పుడు వేరే దాన్ని ఆలోచిస్తూ పరధ్యానం కలిగి ఉంటారు. ఈ గుణం ప్రధాన లక్షణం అజ్ఞానం. నాన్ వెజిటేరియన్, గుడ్లు, మందు, పొగాకు ఉత్పత్తుల్లో ఈ తామసిక లక్షణం ఎక్కువగా ఉంటుంది. చల్లారిపోయిన ఆహార పదార్థాల్లో శక్తి మందగించిపోయి ఉంటుంది కాబట్టి ఇలాంటి ఆహారం తీసుకునే వారు శక్తి హరించుకుపోయి బద్ధకంతో తామసిక లక్షణాన్ని కలిగి ఉంటారు. సరిగా మగ్గని ఆహారం తీసుకోవడం, కెమికల్స్ చల్లిన ఆహారం కూడా ఈ లక్షణాన్ని పెంచుతుంది. ఒక పండు పూర్తిగా పక్వమైనప్పుడే దానిలో పోషక విలువలు సిద్ధమవుతాయి. లేదంటే అది శక్తిని ఇవ్వకపోగా ఉన్న శక్తిని హరిస్తుంది.
నాన్-వెజిటేరియన్ లాంటి ఏ ఆహారమైతే జీర్ణం కావడానికి అధిక సమయం పడుతుందో ఆ ఆహారం వల్ల బ్రెయిన్‌కి సరిపడా బ్లడ్ అందక అధికశాతం రక్తం జీర్ణ ప్రక్రియ కోసం ఉపయోగించబడాల్సి వచ్చి మనిషిలో తామస గుణమైన బద్ధకాన్ని పెంచుతుంది. మెదడు చురుకుగా పనిచెయ్యనప్పుడు సత్యాన్ని తెలుసుకునే ఆసక్తీ, ఆలోచనల్లో స్పష్టత కొరవడి పరధ్యానంగా సాగుతుంటారు.
ఇక భగవద్గీతలో భగవానుడు చెప్పే అత్యంత ఉత్తమమైన సత్వ గుణం గురించి చూద్దాం. నిరంతరం హృదయంలో సంతోషాన్ని కలిగి ఉండే వారు, అందరూ బాగుండాలని లోకక్షేమం కోరుకునే వారు, ఉన్న దాంతో తృప్తి చెందే వారు, పరమాత్మని తెలిసికొని పరమాత్మ, ప్రకృతి పట్ల సరెండర్నెస్ కలిగి ఉండే వారు, చేసే పని పట్ల శ్రద్ధ కలిగిన వారు, ఏదీ ఆశించని, లోభత్వం లేని ప్రేమని అందరికీ పంచే వారు సత్వ గుణాన్ని కలిగి ఉన్నట్లు భావించాలి. సత్వగుణం అధికంగా ఉన్న వారికి జ్ఞానం స్వేచ్ఛగా ప్రవహిస్తుంది. ఎక్కువ ప్రొటీన్ కలిగి ఉండి అధిక సమయం పాటు ఆకలిని కలుగజేయని మొలకలు, డ్రై ఫ్రూట్స్, పళ్లు, కూరగాయలు, తేనె, గోధుమలు, పెరుగు, వెన్న, నెయ్యి వంటివి ఈ సత్త్వ గుణాన్ని పెంపొందిస్తాయి.
అయితే ఈ గుణాలు స్టాటిక్ కాదు, డైనమిక్స్. పరిస్థితులను బట్టి ఒక్కో గుణం మొత్తం సృష్టిలోనూ, లేదా ఒక్కో జీవిలోనూ ఆధిక్యంలో ఉంటాయి. నిశితంగా చూస్తే మనం చేసే ప్రతీ పనిలోనూ, చేసే ప్రతీ ఆలోచనలోనూ ఏదో ఒక గుణం కన్పిస్తుంది. ఇతరుల పట్ల ద్వేషం కలిగి ఉంటే అన్నింటి కన్నా నాసిరకమైనదైన రజో గుణం, అందరూ నావాళ్లే అని ప్రేమతో ఉంటే సత్త్వ గుణమూ, బద్ధకం ఆవరిస్తే, సత్యాన్ని తెలుసుకోవాలన్న కుతూహలం లేకపోతే తమో గుణమూ.. ఇలా వెంటాడుతూనే ఉంటాయి. వీలైనంత సత్త్వ గుణం ప్రధానమైన ఆహారం తీసుకోవడం, ఆలోచనలు చేయడం, తన బుద్ధిని కాన్షియస్గా మెడిటేషన్ వంటి ప్రక్రియల ద్వారా సత్త్వ గుణ ప్రధానంగా మార్చుకోవడం మన ధర్మం.
- Sridhar Nallamothu