యత్తు కామేప్సునా కర్మ సాహంకారేణ వా పునః ।
క్రియతే బహుళాయాసం తద్రాజసముదాహృతమ్ ।। 24 ।।
స్వార్ధ కోరికచే ప్రేరేపితమై, అహంకారముచే చేయబడినట్టి, మరియు తీవ్ర ప్రయాసతో కూడిన పని రజోగుణములో ఉన్నదని చెప్పబడును.
వివరణ:
అనేక కోరికలు, వాటిని నెరవేర్చుకోవడానికి స్వార్థమూ, ఆ స్వార్థంతో మానసికంగా, శారీరకంగా అలసిపోతూ చాలా కష్టంతో ఆ కోరికలు తీర్చుకోవడం, మరికొన్ని కోరికల వెంటపడడం వంటివన్నీ “రజో గుణ కర్మ”గా కృష్ణ భగవానుడు చెబుతున్నారు.
అవసరాలు, విలాసాలకు మధ్య వ్యత్యాసం తెలీనప్పుడు ప్రతీదీ అవసరంగా అనిపిస్తుంది. ఫలానా కారు కొంటే బాగుంటుంది, ఫలానా వస్తువు ఎలాగైనా కొనుక్కోవాలి.. ఇలా రకరకాలుగా కోరికలు మొదలవుతాయి. ప్రతీ కోరికా తన వెంట “అది ఇప్పటికే నా దగ్గర లేదు కదా” అనే అసంతృప్తి నుండి మొదలై ఇతరులతో పోల్చుకోవడం, తనని తాను తక్కువ చేసుకోవడం, ఆ కోరిక తీరే వరకూ పైకి కాన్షియస్ మైండ్‌లో కాకపోయినా సబ్-కాన్షియస్ మైండ్‌లో దాని కోసం ఆరాటం.. వంటివన్నీ మనిషి యొక్క స్వాధిష్టాన, మణిపూరక చక్రలలో ఎనర్జీ బ్లాక్స్‌ని సృష్టిస్తాయి.
ఎవరైనా కలిసినప్పుడు “ఈ ఫెసిలిటీ మీ దగ్గర లేదా, ఈ వస్తువు మీ దగ్గర లేదా” అన్నట్లు మాట్లాడితే ప్రాణం చివుక్కుమంటుంది. మైండ్ చేత ఏర్పడే ఇగో మాట్లాడిన వ్యక్తి యొక్క సంస్కారం గురించి ప్రశ్నించడం మొదలుకుని, తాను తక్కువ, ఎవరి చేత మాటలు పడకూడదు, కష్టపడి అన్నీ సమకూర్చుకోవాలి” వంటి అనేక ఆలోచనలను అప్పటికప్పుడు చేసేస్తుంది.
క్రెడిట్ కార్డులు, అవసరం ఉన్నా లేకపోయినా EMIలతో రకరకాల వస్తువుల్ని సమకూర్చుకోవడం, కాసేపు సంతృప్తి పొంది ఆ తర్వాత మరో కోరికను తీర్చుకోవడం వైపు పరుగుపెట్టడం అంతా దీనిలో భాగమే.
“దీంట్లో తప్పేముంది, అందరిలాగే నాకూ కోరికలు ఉన్నాయి, వాటినీ తీర్చుకుంటున్నాను” అని ఇగో మన విచక్షణని డామినేట్ చేస్తుంది.
శ్రీకృష్ణుడు చెప్పినా, గౌతమ బుద్ధుడు చెప్పినా పరిమితిలో లేని కోరికలే మనిషి ఆధ్యాత్మిక ఉన్నతికి ప్రతిబంధకాలు. ఒక టూవీలర్, ఒక కారు, ఒక ఇల్లు.. ఇలాంటివి సమకాలీన సమాజంలో అత్యంత అవసరమైనవి ఉన్నా ఇబ్బంది లేదు.. వాటిని సమకూర్చుకోవడం కోసం పాటు పడాల్సిందే. అవి లేకపోతే మూలాధార చక్రలో ఇన్సెక్యూరిటీ మొదలవుతుంది కాబట్టి ఎనర్జీ బ్లాక్ అవుతుంది. కానీ పాత కారు అమ్మేసి కొత్తగా వచ్చిన ప్రతీ కారూ కొనాలనుకోవడం, సమాజంలో ఇతరులకు ప్రదర్శించుకోవడానికి, స్టేటస్ కోసం పరుగులు పెట్టడం వంటివన్నీ రజోగుణ కర్మ లక్షణాలు.
ప్రదర్శించుకోవడంలో రెండు రకాలుంటాయి. తమ సంతృప్తిని, సంతోషాన్ని ఇతరులతో పంచుకోవడానికి ఒకటైతే.. ఇతరుల ముందు గొప్పగా దర్పాన్ని చూపించుకోవడం మరో రకం.
గొప్పగా ఇతరులకు స్టేటస్‌గా చూపించుకోవాలనుకునేది ప్రతీ దాని వెనుకా “అహం” దాగి ఉంటుంది. మీ అందరికన్నా నేను ప్రత్యేకం అనే భావనని ఎస్టాబ్లిష్ చేయాలన్న ప్రయత్నం ఉంటుంది. ఇలా తోటి సోల్స్‌తో తనకున్న భౌతికమైన డాబూ దర్పాలను ప్రదర్శించుకుని దూరం అవుతూ వెళ్లే కొద్దీ తోటి మనిషీ, మనలోనూ ఒకటే దైవ సమానమైన సోల్ ఉంది అనే భావనకి దూరంగా జరుగుతాం. దీంతో విశ్వంలో భాగంగా, విశ్వంతో కలిసిపోయే ఏకత్వం అనేది గుర్తించడానికి మన మైండ్ అనుకూలించదు.
ఈ వ్యాఖ్యానం రాస్తున్న రచయిత ఈ కోరికల చక్రానికి అతీతుడా.. అనే సందేహం సహజంగా పాఠకులకు కలగొచ్చు. భగవద్గీతలో కృష్ణ భగవానుడుచే చెప్పబడిన ప్రతీ జ్ఞానామూ జీవితంలో ప్రతీ దశలో అనుసరించబట్టే ఇంతటి పవిత్రమైన గ్రంధానికి తాత్పర్యాలు రాసే బాధ్యత ఆ దేవదేవునిచే నాకు అప్పగించబడింది అని భావిస్తాను. రచయిత గురించి తెలీని పాఠకుల కోసం.. 2001 నుండి నుండి 2020 వరకూ ఐదు వేలతో మొదలుపెట్టి గరిష్టంగా కేవలం 20 వేల జీతంతో “నాకు అది లేదు, ఇది లేదు” అనే లోటు భావన లేకుండా సంతృప్తిగా బ్రతికి కోరికలను అధిగమించిన వ్యక్తి ఈ రచయిత.
కృష్ణ భగవానుడిచే రజో గుణ కర్మలుగా చెప్పబడుతున్న కోరికల వెంట, స్వార్థం వెంట పరిగెత్తడం అనేది విపరీతమైన అశాంతిని సృష్టిస్తుంది. ఒక వస్తువు ఇంటికి వచ్చిన వెంటనే కొన్ని గంటలు, కొన్ని రోజులు ఉండే ఆనందం కాస్తా మళ్లీ మూడోరోజుకి ఆవిరైపోవడం అందరికీ అనుభవమే. మరి సంతోషం ఎక్కడ ఉంది? కళ్లు మూసుకుని డీప్ మెడిటేషన్‌లోకి వెళ్లి భావోద్వేగాలను అధిగమించి, మైండ్‌ని అధిగమించి మనలోకి మనం చూసుకుంటే నిశ్చలంగా ఉండే ఆత్మ కనిపిస్తుంది. అక్కడ.. సరిగ్గా అక్కడ.. ఏ కోరికా ఇవ్వలేనంత అనిర్వచనీయమైన సంతృప్తి కనిపిస్తుంది.
————–
25వ శ్లోకం:
అనుబంధం క్షయం హింసామనపేక్ష్య చ పౌరుషమ్ ।
మోహాదారభ్యతే కర్మ యత్తత్తామసముచ్యతే ।। 25 ।।
మోహభ్రాంతి వల్ల ప్రారంభించి, తమ యొక్క స్వ-శక్తి ఏమిటో తెలుసుకోకుండా, మరియు పరిణామాలు, జరిగే నష్టము మరియు ఇతరులకు జరిగే హాని గురించి ఆలోచించకుండా – చేసే కర్మను తామసిక కర్మ అని అంటారు.
వివరణ: కొంతమంది వ్యసనాలకు అలవాటు పడిపోతుంటారు. తాగడం, తిరగడం, బెట్టింగులు… ఇలా తమని తాము మర్చిపోవడానికి చేసే కర్మలు మోహం చేత ఉద్భవిస్తాయి. అలాంటివి చెయ్యడం వల్ల తమ ఆరోగ్యం పాడవుతుందనే స్పృహ ఉండదు. “అందరూ చేస్తున్నారు కాబట్టి దీంట్లో తప్పేం లేదు…” అని డ్రింక్ చేసే వాళ్లు ఎలాగైతే సమర్థించుకుంటారో సరిగ్గా ఒక వ్యసనం పట్ల మోహం ఇలా ఏది మంచి ఏది చెడు అనే విచక్షణని కోల్పోతుంది. ఏ తామసిక కర్మ అయినా మనిషికి మందబుద్ధిని కలుగజేస్తుంది. అంటే వ్యసనం వల్ల బ్రెయిన్లోని ఫ్రాంటల్ లోబ్‌లో సరిగా న్యూరల్ యాక్టివిటీ జరగక, లాజికల్ థింకింగ్ కోల్పోయి, తన శరీరమే మైండ్‌గా మారిపోయి, శరీరం బానిసగా మారిన కెమికల్స్ కోసం శరీరం ఆరాటపడడం, ఆ ఆరాటం కొద్దీ బుద్ధిని కోల్పోయి వ్యసనాలను కొనసాగించడం జరుగుతుంది.
ఇలాంటి తామసిక కర్మలు మనిషిలో బద్ధకాన్ని, ప్రపంచాన్ని, మనుషుల్ని ఉన్నవి ఉన్నట్లుగా మానసిక స్పష్టతతో చూసే గుణాన్ని పోగొడతాయి.
భగవద్గీతలో కృష్ణ పరమాత్మ చెప్పినట్లు తామసిక, రజో గుణ కర్మల నుండి మనిషి సత్త్వగుణ కర్మల వైపు మళ్లే కొద్దీ అతనిలో ఎక్కడా లభించని ప్రశాంతత కనిపిస్తుంది.
– Sridhar Nallamothu