ముక్త సంగోఽనహంవాదీ ధృత్యుత్సాహసమన్వితః ।
సిద్ద్యసిద్ధ్యోర్నిర్వికారః కర్తా సాత్విక ఉచ్యతే ।। 26 ।।
అహంకారము మరియు ప్రాపంచిక విషయాల పట్ల ఆసక్తి లేని వారు, మరియు ఉత్సాహము, ధృడసంకల్పము కలవారు, జయాపజయముల పట్ల ఉదాసీనముగా ఉన్నవారు సత్త్వగుణ కర్తలు అని చెప్పబడ్డారు.
వివరణ: భగవద్గీత ఈ 18వ అధ్యాయంలో ఓసారి వెనక్కి వెళ్లి 19వ శ్లోకాన్ని చూస్తే.. కృష్ణ భగవానుడు “జ్ఞానము, కర్మ, కర్త” ఈ మూడింటి చేత ఒక కార్యం నడుస్తుందని ప్రస్తావించిన విషయం తెలిసిందే. ఇందులో జ్ఞానంలోని సత్త్వ, రాజస, తామసిక జ్ఞానం గురించీ, ఆయా కర్మల గురించి ఇప్పటి వరకూ తర్వాతి శ్లోకాల్లో భగవానుడు వివరించారు. ఇప్పుడు ఈ శ్లోకం నుండి ఒక కర్మ పూర్తి చెయ్యడానికి అన్నింటికన్నా ముఖ్యమైన విషయం ఆ కర్మని చేసే “కర్త” కాబట్టి ఆ కర్త యొక్క స్వభావాల గురించి చెబుతున్నారు.
కర్తల్లో కూడా (అంటే పని చేసే వాళ్లలో) “సత్త్వ గుణ కర్తలు” ఉంటారు. వారు అందరికన్నా ఉన్నతులు.
వారి ప్రధాన గుణం, ప్రాపంచిక విషయాల పట్ల ఆసక్తి లేకపోవడం! వాస్తవానికి జ్ఞానేంద్రియాలైన కన్ను, ముక్కు, చెవి, స్పర్శ వంటి వాటిని ఉపయోగించుకుని మన మనస్సు (మైండ్) ఎల్లప్పుడూ బయటి విషయాల గురించి సమాచారం సేకరిస్తుంటుంది. మంచి కారుని కళ్లు చూస్తే.. ఆ సమాచారం ఆప్టిక్ నెర్వ్ ద్వారా బ్రెయిన్‌లోకి రాగానే మన మైండ్ అనే సాఫ్ట్వేర్ “ఈ కారు భలే ఉందే, నాకు ఉంటే బాగుండేది” అని ఆశ్చర్యమూ, ఉత్సుకత, “నాకు లేదు” అనే అసంతృప్తీ, కోరికా, “ఎవరిని అన్యాయం చేసి ఇలాంటి కాస్ట్లీ కారు కొన్నాడో ఆ ఓనర్” అనే జడ్జ్‌మెంట్‌ని మనకు తెలీకుండానే చాలా వేగంగా చేసేస్తుంది. అంతటితో ఆగదు.. ఆ కారులో మనం కూర్చుంటే ఎలా ఉంటుందో ఓ సీన్లా తనకున్న ఊహాశక్తితో ఊహిస్తుంది కూడా! ఊహకీ, వాస్తవానికీ మధ్య వ్యత్యాసాన్ని మన సబ్ కాన్షియస్ మైండ్ గుర్తించలేదు. కాబట్టి ఆ ఊహ నిజమేననుకుని ఆహ్లాదకరమైన హార్మోన్స్ అయిన ఎండార్ఫిన్స్, డోపమైన్, ఆక్సిటోసిన్ వంటివి శరీరంలో విడుదల అయ్యేలా చేస్తుంది.
అంటే కారుని కన్ను అనే ఓ జ్ఞానేంద్రియం చూస్తే, దానికి సంబంధించిన జడ్జ్మెంట్లు, మనకీ, ఆ కారు యజమానికీ మధ్య ఆర్థిక అసమానతలను మన మైండ్ విశ్లేషిస్తే, అదే మైండ్ ఆ కారులో మనం కూర్చున్నాం అనే ఊహని సృష్టిస్తే దానికి సంబంధించిన ఫీలింగ్, ఎమోషన్ శరీరంలో రిజిస్టర్ అయ్యేలా మన బ్రెయిన్ కేంద్రీయ నాడీ వ్యవస్థ (CNS) ద్వారా పూర్తి చేస్తే.. చివరకు అది మన వైబ్రేషన్గా విశ్వంలోని క్వాంటమ్ ఫీల్డ్కి చేరుకుంటుంది.
గతంలో ఓసారి చెప్పుకున్నాం.. మనం చేసే ఆలోచన అనేది ఎలక్ట్రిక్ ఇంపల్స్ అయితే, ఆ ఆలోచనకు తగ్గట్లు శరీరంలో ఏర్పడే ఫీలింగ్/ఎమోషన్ మాగ్నిటిక్ స్వభావాన్ని కలిగి ఉంటుంది. ఈ రెండూ కలిసి అంటే ఎలక్ట్రో మాగ్నటిక్ తరంగాలు ఆ క్షణం మనం కలిగి ఉన్న వైబ్రేషన్గా విశ్వంలోకి ప్రసరించబడతాయి. ఆ వైబ్రేషన్ ఎలా ఉంటే దానికి తగిన ఫలితాలను విశ్వం మనకు తిరిగి అందించే ఏర్పాటు చేస్తుంది. ఆ వైబ్రేషన్ ద్వేషాన్ని కలిగి ఉంటే ద్వేషం ఏదో రూపంలో టైమ్, స్పేస్ అనే పరిమితులను దాటి ఏదో ఒక రోజో, సంవత్సరంలోనో, జన్మలోనో (సోల్ కొత్త బాడీ రూపం) వెంటాడుతుంది. ఆ వైబ్రేషన్ సంతోషంతో కూడినదైతే అదీ తిరిగి అందించబడుతుంది.
పై శ్లోకంలో కృష్ణ భగవానుడు “ప్రాపంచిక విషయాల పట్ల ఆసక్తి లేని వారు సత్త్వ గుణ కర్తలు” అని ఎందుకు చెప్పారంటే, సత్త్వ గుణం మాత్రమే జీవన్ముక్తికి మార్గం సుగమం చేసేది. సత్త్వ గుణాన్ని పొందాలంటే సత్త్వ గుణ జ్ఞానం కలిగి ఉండాలి. సత్త్వ గుణ స్వభావాన్ని కర్త కలిగి ఉండాలి. ఆ స్వభావంతో సత్త్వ గుణ కర్మలు చేయాలి.
“ఇన్ఫర్మేషన్ ఓవర్‌లోడ్” అనే పదం ఈ మధ్య తరచూ వింటున్నాం. ఇబ్బది ముబ్బడిగా యూట్యూబ్, ఫేస్బుక్, మనుషుల మాటల మధ్యా “అది తెలుసా, ఇది తెలుసా” వంటి అనేక బాహ్య విషయాల గురించి తెలుసుకోవడం చేస్తూ ఉండే కొద్దీ మన జ్ఞానేంద్రియాల ప్లగ్‌లు మన చెవుల ద్వారా కళ్ల ద్వారా ఆ సమాచారాన్ని సేకరిస్తూ దాన్ని మైండ్‌కి అందిస్తూ, ఆ మైండ్ ప్రాసెసింగ్ పూర్తయ్యాక “వాడికేం తెలుసు వాడి బొంద”, “ఆ హీరోయిన్ ఎన్ని అడ్డదారులు తొక్కి ఎదిగిందో” ఇలా రకరకాల ఇన్నర్ టాక్‌లు మనస్సులోనో, బయటకో మాట్లాడుకుని వాటికి సంబంధించిన ఎమోషన్లు, హార్మోన్స్ అనే కెమికల్స్‌ని మన శరీరంలో విడుదల చేసుకుని మన శరీరాన్ని కెమికల్ ఫ్యాక్టరీగా తయారు చేసుకుంటూ ఉంటాం.
ఈ నేపధ్యంలో “మనకు ఏది అవసరం” అని గుర్తించి అంత వరకే మన మైండ్ పనిచేసేలా మన మైండ్‌ని మన అదుపులోకి తీసుకోవడం ద్వారా.. సమాచారాన్ని వినియోగించుకోవడం తగ్గించుకోవడం ద్వారా మెల్లగా మన ఎనర్జీ మన ఆలోచనలను విశ్లేషించుకోవడం, మనల్ని మనం మెరుగుపరుచుకోవడం, సోల్‌కి రీచ్ అవడానికి ఉపయోగపడుతుంది. అప్పుడు సత్త్వ గుణ కర్తగా మిగులుతాం.
అలాగే సత్త్వ గుణ కర్తలు తమకు వచ్చిన విజయాలకు పొంగిపోరు, అపజయాలకు కుంగిపోరు. జరిగే ప్రతీదాన్నీ “It’s OK” అని ముందుకు సాగుతూ ఉంటారు. పనిచేసేటప్పుడు మొత్తం ప్రపంచాన్ని మర్చిపోయి దానిలో మునిగిపోయే వ్యక్తి ఆ పని జరిగే విధానంలోనే అద్భుతమైన సంతృప్తిని పొందుతుంటాడు. సంతృప్తి అనేది అత్యంత శక్తివంతమైన ఎక్కువ కాన్షియస్నెస్ స్కేల్ కలిగిన ఎనర్జీ. మనం పని మొదలు పెట్టినప్పటి నుండి పని పూర్తయ్యే వరకూ రోజులు, సంవత్సరాల పాటు ఆ సంతృప్తిని ప్రతీ దశలో ఆస్వాదిస్తూ ఉండొచ్చు. అది కర్మ యోగం. కానీ మన దృష్టి ఎప్పుడెప్పుడు పని ముగించేసి వేరే ఇష్టమైన దానిలోకి వెళదామా అనే ఆలోచనలో ఉంటే యాంగ్జయిటీ, స్ట్రెస్ పెరుగుతాయి. అవి ఎనర్జీ మొత్తాన్నీ హరించే ఎమోషన్స్. ఉదాహరణకు ఈ భగవద్గీత వ్యాఖ్యానం రాసేటప్పుడు “ఎప్పుడెప్పుడు ఏదో ఒకటి రాసేసి ముగిద్దామా” అని హడావుడి పడితే తరాల తరబడి కృష్ణ భగవానుడు నుండి వచ్చిన జ్ఞానానికి న్యాయం చేయలేను. అలాగే రాయబడే తాత్పర్యాల్లో హృదయం ఉండదు. అలా కాకుండా రాసే ప్రతీ పదమూ అపురూపంగా, అద్భుతమైన జ్ఞానం పట్ల పూర్తి గౌరవంతో, యూనివర్శ్ నుండి జ్ఞానం అనే ఎనర్జీ ఫ్లోని ఆహ్వానిస్తూ, దాన్ని అక్షరాల్లోకి పొందికగా వచ్చేలా చూస్తుంటే కలిగే సంతృప్తి ముందు ఏ జయమూ, ఏ అపజయమూ నిలవదు.
సత్త్వ గుణ కర్తలు పై శ్లోకంలో చెప్పినట్లు అనుకున్న పని పూర్తయ్యే వరకూ విశ్రమించని ధృడ సంకల్పం కలిగి ఉంటారు. అంటే వారి ఎనర్జీ మొత్తం అనవసరమైన విషయాల పట్ల కాకుండా తమ సంకల్పాల వైపు కేంద్రీకృతమై ఉంటుంది. చాలా ఉత్సాహంగా అన్నీ చక్కబెడుతూ ఉంటారు. ఇలాంటి లక్షణాలు అలవర్చుకోవడానికి ప్రయత్నిస్తే జీవితం పట్ల చాలా స్పష్టత వస్తుంది.
- Sridhar Nallamothu