జ్ఞానమట.. పరిపక్వతట.. జీవన్ముక్తట…
అష్ణావక్రపు ఆలోచనలతో నిర్జీవమైన దేహంలోంచి వెలుగుని కళ్లల్లోకి ఉబికి తెచ్చుకుని ఒక్క క్షణం జ్ఞానినైపోయినట్లు భ్రమించాను.. ఎంత హాయిగా ఉందీ.. నేను జ్ఞానినే, ఆ వెలుగుని చూసి ఈ ప్రపంచం ఒప్పుకుని తీరాలి… నా ఆత్మలో జ్ఞానం ప్రతిష్టించబడకపోయినా.. శూన్యంగానే వెక్కిరిస్తున్నా!
ఎదుటి వ్యక్తి అజ్ఞానం ముందు గెలుపు సాధిస్తే నాకు అది జ్ఞానంగానే కన్పిస్తోంది.. నాపై నాకు గెలుపు కదా… నిజమైన జ్ఞానానికి కావలసింది?
ఈ లౌకిక ప్రపంచంలో పరపతి పొందడానికి వాడాల్సిన విద్యలన్నీ అయిపోయాయి… ఇప్పుడు అంతీంద్రియ శక్తులూ, తల వెనుక భ్రమణం చేసే జ్ఞానచక్రాలే మిగిలాయి.. వాటినీ ఊహల్లోనో, మాటల్లోనో స్వంతం చేసుకుంటే పోలా.. ఎటూ భక్తి పుస్తకాలు జ్ఞానసాగరమధనం చేస్తూ బోధపరుస్తూనే ఉన్నాయి కదా… అవేంటో తెలీకపోయినా వాటి సారాన్ని అర్థం చేసుకుని మనల్ని ఆ జ్ఞానుల కోవలోకి చేర్చేసుకుంటే ఎంత గొప్పదనం ఆపాదించబడుతుందో కదా…
సత్యం హృదయాన్ని కాల్చేస్తుంది.. నువ్వేంటో నీకు ప్రస్ఫుటంగా గోచరింపజేస్తుంది. నీ జ్ఞానతృష్ణ ఆ జ్ఞానం మూలంగా ఏర్పడే ప్రత్యేకమైన ట్రీట్మెంట్ కోసమే అయితే అజ్ఞానిగానే మిగిలిపో.. నువ్వు జ్ఞానివి కావలసిన అవసరం ప్రపంచానికి ఏమాత్రం లేదు.. నీ బ్రతుకు పరమార్థం నీకు ఎరుకపడడానికే ఏ జ్ఞానమైనా!!
ప్రేమ… అతి చులకనైపోయిన పదం.. విపరీతంగా వాడబడేయడంచే!
మేధావీ అంతే.. ఇప్పుడు మేధావులు కానిదెవ్వరు?
రేపు జ్ఞానులూ అంతే.. జ్ఞానం టెర్మినాలజీ బైహాట్ చేసేస్తున్నాం కదా… విచ్చలవిడిగా వాడేసి జ్ఞానుల కోవలోకి చేరిపోవడమే! జ్ఞానుల సంఘాలూ వెలుస్తాయేమో!
జ్ఞానమంటే ప్రయత్నించి దక్కించుకునే వస్తువు కాదు.. పంచేంద్రియాలచే నిరంతరం హృదయంలో జరిగే సంఘర్షణ స్థిమితపడి జీవితంలో ఏ దశలోనో దానంతట అదే హృదయంలో ప్రజ్వలించేది!!
జ్ఞానం మాటల్లో ప్రకటించుకోలేనిది.. ఆత్మకే తెలుస్తుంది దాని సాంద్రత.
అందుకే నకిలీ జ్ఞానివిగా చలామణి అవ్వాలని ప్రయత్నించకు… అలా ప్రయత్నించినంత కాలం అజ్ఞానిగానే మిగిలిపోతావు.. తనకి ప్రపంచం ఇచ్చే గౌరవానికి నకిలీ జ్ఞాని విర్రవీగుతాడు.. నిజమైన జ్ఞానికి ఎలాంటి గౌరవం దక్కినా ఆ జ్ఞానం ముందు ఆ గౌరవం ఎలాంటి చిత్తచాంచల్యాలనూ కలిగించలేదు.
ప్రాప్తం ఉంటే, హృదయంలో స్వచ్ఛంగా ఉంటే నువ్వు ప్రయత్నం చేయాల్సిన పనిలేదు… జ్ఞానం అదే వెదుక్కుంటూ వస్తుంది.
– నల్లమోతు శ్రీధర్
Leave a Reply