ఆ సందులో పెద్దమ్మ గుడి.. ఆగి వెళ్లే టైమ్ కుదరట్లేదు గానీ.. అటు వైపు ఎప్పుడెళ్లినా ఆ సందుని తనివితీరా తొంగి చూడడం, కొన్ని జ్ఞాపకాల్ని తట్టిలేపడమూ అవుతోంది.. హైదరాబాద్ వచ్చిన కొత్తలో అనుకుంటా 2000 టైమ్‌లో.. మధురానగర్ నుండి 50 రూపాయలకు ఆటో మాట్లాడుకుని పెద్దమ్మ గుడికెళ్లి అటు నుండి అటు శిల్పారామం వెళ్లిన రోజులు..
శ్రీనగర్ కాలనీ.. ఆంధ్రాబ్యాంక్ ATM.. సరదాగా సాయంత్రం యూసఫ్‌గూడ బస్తీ నుండి నడిచి అక్కడదాకా వెళ్లే రోజులు.. బాపట్ల రధం బజార్.. తెలిసిన ప్రతీ షాపులో కాసేపు ఆగి ముచ్చట్లు పెట్టి దర్జాగా ముందుకు కదిలే రోజులు.. ఇలా ఊహ తెలిశాక కళ్ల ముందు కదలాడిన ప్రతీ ప్రదేశమూ ఎవరికీ అర్థం కాని ఓ మధురానుభూతిని తట్టిలేపుతుంది.
అవి జీవం లేని రోడ్లే.. ఎప్పుడూ చూసే షాపులే.. పెద్ద పెద్ద బిల్డింగులే.. కానీ కాలం వాటితో తెలీకుండానే ఓ అటాచ్మెంట్ ఏర్పరుస్తుంది. ఎక్కడికెళ్లినా ఆ ప్రదేశం గతంలో ఎలాగుందన్నది పాత జ్ఞాపకాల్ని ఓసారి రీకాల్ చేసుకుని, ఇప్పుడు కళ్లెదుట కన్పిస్తున్న రూపురేఖల్ని జీర్ణించుకోలేకా.. ఎంత అనూహ్యమైన మార్పు వచ్చేసిందో అబ్బురపడుతూ.. కాసేపు పరధ్యానంలోకి వెళ్లిపోవడం ఏ మనిషికైనా సహజం. ఆ పరధ్యానంలో రోడ్లు, బిల్డింగులు, రూపురేఖలు కేవలం active subject మాత్రమే.. పాసివ్ సబ్జెక్ట్ అంతకన్నా బలీమైనది ఉంటుంది.. ఏదీ certain కాదన్న, ఇవ్వాళ ఉన్నది ఏదీ రేపు ఉండబోదన్న uncertanity. ఆ uncertanityనే మన లైఫ్ పట్ల కూడా ఓ రకమైన ఇన్సెక్యూరిటీని క్రియేట్ చేసి.. మళ్లీ ఉలిక్కి పడ్డట్లు వాస్తవంలోకి వచ్చేలా చేస్తుంది.
మా ఊరి రైలుగేటుని చూస్తే.. అక్కడ గంటల తరబడి వెయిట్ చేసిన జ్ఞాపకాలు గుర్తొస్తాయి. ఇక్కడ రైలు గేటు అప్పుడూ మారలేదు, ఇప్పుడూ మారలేదు.. మహా అయితే పాడైతే కొత్తది మార్చి ఉంటారేమో. కానీ ఆ పరిసరాల్లోకి వెళ్లగానే మెమరీ archivesలోంచి బ్రెయిన్ జ్ఞాపకాల్ని రిట్రీవ్ చేసి… ఆ జ్ఞాపకాలతో పాటు స్టోర్ అయిన ఉన్న లైఫ్ ఫ్రాగ్నెన్స్ని కూడా లాక్కొచ్చి కాసేపు ఆ రోజులకు తీసుకెళుతుంది. ఇది ఓ చిన్న ఎగ్జాంపుల్.. ఇలా మీ లైఫ్‌లో చాలానే ఉంటాయి. మీ ఊరి బస్టాఫ్, అక్కడ మొదటిసారి మీవైపు చూసి నవ్విన అమ్మాయీ, పొద్దున్నే విస్తరాకులో ముసలమ్మ చిరునవ్వుతోనో, చిరాకు పడుతూనో పెట్టి ఇచ్చిన ఇడ్లీ, వాటిని ఆవురావురుమంటూ తిన్న రోజులూ, శ్రీరామ నవమికి గుడిలో వడపప్పు, పానకం కోసం స్వామి వారి కళ్యాణం అయ్యే వరకూ ఉగ్గబట్టుకుని పానకం తాగుతూ కొరపోవడం.. పొద్దున్నే నిద్రపోనీకుండా చిరాకుపెట్టే పక్కింటి కోడి కూతా.. ఆ వెంటనే గుడి మైకు నుండి “రారా క్రిష్ణయ్యా.. రారా క్రిష్ణయ్యా.. దీనులను కాపాడా రారా క్రిష్ణయ్యా” అంటూ వరుసబెట్టి విన్పించే భక్తి పాటలూ… జస్ట్ రోజుకి కాసేపు వేగంగా పరిగెత్తడం ఆపేసి తీరిగ్గా కూర్చుని గుర్తు తెచ్చుకోండి.. మీకు ఊహ వచ్చినప్పటి నుండి ఎన్ని చిన్ని చిన్ని జ్ఞాపకాలో? అవన్నీ hibernate స్టేట్లోకి మెమరీలో పడేశాం కాబట్టే ఈరోజు లైఫ్ చాలా మెకానికల్‌గా అన్పిస్తోంది.
మార్పు సహజం… ఏ మార్పునీ ఆపలేం.. మార్పుకి తగ్గట్లు పరిగెత్తాల్సిందే. జీవితం మారిపోయిందనీ, అసలు గడిచిన రోజులు మళ్లీ రావనీ దిగులు చెందడం ఎంత అర్థరహితమో.. వేగంలో పడిపోయి అసలు జీవితంలో చవిచూసిన మధురానుభూతుల్ని అన్పింటినీ సమూలంగా మర్చిపోవడమూ అర్థరహితమే. ఈరోజు అల్జీమర్స్ వంటి మతిమరుపు జబ్బులు రావడానికి ఇది ఓ పరోక్ష కారణం, దాదాపు బ్రెయిన్ డెడ్ స్టోరేజ్‌లోకి వెళ్లిపోతున్న జ్ఞాపకాల్ని తట్టిలేపాలి. బలవంతంగానైనా గుర్తు తెచ్చుకుని జీవితంపై ఓ ఫ్రెష్ ఫీల్‌ని ఆస్వాదించాలి.
ప్రతీ వస్తువూ, ప్రతీ ప్రదేశం, ప్రతీ మనిషీ, ప్రతీ అనుభవం, ప్రతీ ఎమోషన్.. మన జీవితాన్ని represent చేస్తుంది. ఎవరైనా మీ లైఫ్ ఏంటని అడిగితే మిగిలినవి ఇవే. ఈరోజు వెలగబెడుతున్న డబ్బూ, హోదాలు కాదు మనమేంటన్నది చెప్పుకోవడానికి! అంతకన్నా గొప్ప లైఫ్, బ్యూటిఫుల్ లైఫ్ మనం చూసొచ్చాం. ఒక్కసారి గుర్తు తెచ్చుకోండి. గర్వంగా ఎంతో చెప్పుకోవచ్చు.. అదీ లైఫ్ అంటే!!
– నల్లమోతు శ్రీధర్
real feelings , it seems , SRIDHAR garu
sreedhargaru you are very special person.your topics are good.i am inspiration to you