మన లైఫ్‌లో ఏం జరిగినా దానికి కారణాలు విపరీతంగా అన్వేషిస్తాం.. ఏ కారణమూ సంతృప్తికరంగా అన్పించకపోతే.. “విధి రాత” అని సరిపెట్టుకుంటాం. ఏదో ఒకటి అనుకుని శాటిస్ఫై కావాలి కాబట్టి.. మనస్సుని స్థిమితపరుచుకోవాలి కాబట్టి.. ఎక్కువ ఆలోచించలేక బుర్ర వేడెక్కిపోతుంది కాబట్టి.. “అంతా విధిరాత” అనేసుకుని కళ్లు మూసుకుంటే కొంత స్వాంతన దొరుకుతుంది.
ఈ “విధి”ని నమ్ముకోవడమే జీవితాల్ని చాలా నిస్సహాయంగా చేస్తోంది. ఓ పరిస్థితిని ఎదుర్కోలేక సత్తువంతా హరించుకుపోయి కూర్చుండిపోతే “మనం చెయ్యగలిగిందంతా చేశాం.. మన చేతిలో ఏదీ లేదు.. విధిరాత ఎలా ఉందో అలా జరిగిపోతోంది” అనే కంక్లూజన్‌కి వచ్చేస్తున్నాం. నిస్సహాయత నుండి వస్తున్న మాటలు అవి. ఇంకాస్త ఫిజికల్, మెంటల్ రిసోర్సెస్ మిగిలి ఉంటే మనం ఇంకా ఫైట్ చేసే వాళ్లమే.. కానీ మన సత్తువ అయిపోయింది కాబట్టి ఇలా ఆగిపోతున్నాం.
నాకు అవగాహన ఏర్పడిన మేరకు “విధి” అనేది ఏదీ మనకు భగవంతుడు నిర్దేశించలేదు… నుదుటన రాయలేదు. అలాగని భగవత్శక్తి లేదనీ కాదు. భగవంతుడు ఉన్నాడు.
ఇక్కడ పరిస్థితి ఎలా తయారైందంటే.. మనకు భగవంతుడిపై నమ్మకం ఉంది కాబట్టి… ఓ మతమూ, దానికి బలం చేకూర్చే రామాయణ, మహాభారతాల లాంటి ఇతిహాసాలూ.. ఆచార వ్యవహారాలూ, పూజలు, ఆలయ దర్శనం వంటివన్నీ పాటిస్తున్నాం. అలాగే కర్మలూ, వాటి ఫలితాలూ, విధీ, దాని క్రూరత్వం వంటివన్నీ కూడా నమ్మేస్తున్నాం. నిరంతరం లౌకిక జీవితంలో కొట్టుకుపోయే మనల్ని భగవంతునితో అనుసంధానం చెయ్యడానికి ఉద్దేశించబడి ఏర్పాట్లివి. వీటి ప్రధానమైన ఉద్దేశం ఏమాత్రం ఆధ్యాత్మిక జ్ఞానం లేని వ్యక్తినైనా భగవంతునికి చేరువ చెయ్యడం. బట్ ఈ తతంగం అంతా ఈరోజు భక్తి పేరిట మూఢత్వంలో మగ్గిపోయేలా చేస్తోంది. యెస్.. భగవంతునితో ఎవరికీ మానసికమైన అనుబంధం లేదు. రకరకాల భౌతిక వ్యామోహాల్లో కొట్టుకుపోతూ ఏ గుడికో వెళ్లి, ఏ వ్రతమో చేసి.. పాప ప్రక్షాళనా, పుణ్య సముపార్జనా చేసుకునే ఓ తరహా మూర్ఖత్వమే మిగిలిపోయింది.
మంచి ఉద్దేశంతో ఏర్పాటు చెయ్యబడిన ఈ మతమూ, ఇతరత్రా అంశాలన్నీ ఇలా అసలైన ఉద్దేశాల్ని కోల్పోయి పైపై ఆర్భాటాలుగానే మిగిలిపోయిన రోజుల్లో.. మనకు జీవితంలో ఏర్పడే ప్రతీ కష్టానికీ తగిన కారణం దొరకనప్పుడు నిందించడానికి మనకు మనం చేసుకున్న ఏర్పాటు “విధి” అనే మాట. “విధి” అనేది ఏదీ లేదు అని ఇప్పుడు నేను అంటున్న మాటలతో చాలామంది విభేధించే అవకాశముంది. “విధి” అనేది ఉందని వాదించడానికీ వందల examples కూడా రెడీగా ఉంటాయి ప్రతీ ఒక్కరి లైఫ్‌లో! ఇంతగా “విధి” అనేది ఉందని మనం నమ్మడానికి కారణం తరాల తరబడి అది మన ఆలోచనావిధానంలో బలంగా నాటుకుపోవడం!
భగవంతుడు నిజంగానే మనకంటూ కొన్ని తలరాతలు రాయలేదు. స్వేచ్ఛగా జీవించడానికి మనం ఈ లైఫ్‌లోకి వచ్చాం. కిచెన్‌లో ఒక రోజు వంట బాగా కుదురుతుంది… మరో రోజు వంట దరిద్రంగా ఉంటుంది. అదే విధంగా లైఫ్‌లోకి వచ్చిన కొన్ని కోట్ల మందికి రకరకాల కాంబినేషన్లలో రకరకాల జీవితానుభవాలు ఏర్పడుతూ ఉన్నాయి. వాటికి ప్రామాణికమైన కారణాలున్నాయి.. కొద్దిగా ఓ deep వేవ్‌లెంగ్త్‌తో పరిశీలించగలిగితే! అయితే మనుషుల ఆలోచన ఫ్రీక్వెన్సీ బయట సోషల్ పొల్యూషన్లో పదును కోల్పోయి ఉండడం వల్ల ఓ స్థాయికి మించి చొచ్చుకుపోలేదు. దాంతో మనకు చాలా విషయాలకు కారణాలు అర్థం కావు. సో విధిని నమ్మేస్తాం.
ఒక్కసారి ఆలోచించండి.. మీకంటూ భగవంతుడు చాలా అద్భుతమైన మానవ జన్మని ఇచ్చాడు… మీకు ఎలాంటి నుదటి రాతలూ రాయలేదు.. మీ జీవితంలో ఏం జరుగుతున్నా మీ చేతిలోనే, మీ చేతలతోనే జరుగుతోంది. ఉన్నదల్లా పాజిటివ్, నెగిటివ్ వైబ్రేషన్లు మాత్రమే. ఓ అల ఎగిసిపడుతుందీ, విరిగిపడుతుందీ..
ఈ రెండు phases మాత్రమే మనం ప్రతీ క్షణం ఎదుర్కొంటున్న మానసిక స్థితి. ఆ మానసిక స్థితి నుండే సంఘటనలు జరుగుతున్నాయి.. ఆ సంఘటనల్లో మనం ఒక్కోసారి ఒక్కోలా ప్రవర్తిస్తున్నాం, వాటికి మరికొన్ని ప్రతిస్పందనలు వస్తున్నాయి. సో ఈ మొత్తం వ్యవహారంలో మనకు కన్ఫ్యూజన్ వచ్చినప్పుడల్లా మనం “విధి” అనే దాన్ని గుర్తు చేసుకోవడం ఆపేసి.. కాసేపు మనస్సుని ప్రశాంతంగా ఉంచుకుని.. మనస్సులోకి తొంగి చూసుకుని.. సెల్ఫ్ ప్యూరిఫై చేసుకుని.. నిశితంగా గమనిస్తే ప్రతీ సంఘటనకూ ఓ సహేతుకమైన కారణం ఖచ్చితంగా గోచరిస్తుంది.
పూర్వ జన్మ కర్మలూ, వాటి ఫలితాలూ, ఆ ఫలితాల ఆధారంగా ప్రస్తుతం మనం జీవిస్తున్న జీవితమూ “విధి”లా లిఖించబడిందన్న ఆలోచనా, ఈ జన్మలో చేసే కర్మల ద్వారా భవిష్యత్ ఆధారపడి ఉంటుంది అనే భావజాలమూ నేనూ చాలా బలంగా నమ్మాను.. కానీ మెల్లగా జీవితం స్పష్టపడుతూ వస్తోంది. మనిషి తనను తాను తెలుసుకునే ప్రయత్నంలో ఇలాంటివి ఏదో రూపేణా స్పష్టపడుతూ వస్తుంటాయి. అలాంటి స్పష్టతే నాకూ ఏర్పడుతోంది.
మనం ఈరోజు మంచి చేస్తే స్వర్గానికి వెళతాం.. చెడు చేస్తే నరకానికి వెళతాం.. వంటి నమ్మకాలూ.. ఈ జన్మలో ఎంత మంచి చేసినా ఇన్ని కష్టాలు పడుతున్నామే.. భగవంతుడు మనల్నెందుకు కరుణించట్లేదు.. వచ్చే జన్మలోనైనా ఈ పుణ్యాల ఫలితం ఉంటుందా.. అన్న నిష్టూరాల మధ్య మనం బంధీలమైపోయాం.
నిజమే మంచి చేస్తే మంచే జరుగుతుంది. కారణం మంచి అనేది ఓ పాజిటివ్ వైబ్రేషన్. పాజిటివ్‌గా బ్రెయిన్స్‌ని కదిలిస్తుంది. సో మన చుట్టూ ఓ పాజిటివ్ వలయం ఏర్పడుతుంది.
మన పాప పుణ్యాలను బట్టి విధి ఉండదు. భగవంతుడు శిక్షించబోవట్లేదు. “మరి అలాంటప్పుడు తప్పు చేసే వాళ్లకు శిక్షే లేదా” అని మంచి చేసేవాళ్లంతా వాపోవచ్చు. శిక్ష ఖచ్చితంగా ఉంటుంది. అది విధి వల్ల కాదు. చెడు ఎప్పుడూ ఆ మనిషిని అప్పటికప్పుడే దహిస్తుంది.. ఏదో రూపేణా! చాలామంది ఇతరుల్ని బాధపెట్టే వాళ్లూ, చెడు చేసేవాళ్లూ సంతోషంగా ఉన్నారని మనం భావిస్తున్నాం. వాళ్లు ఎంత దారుణంగా మనఃశాంతిని కోల్పోయారో మనం గమనించం. వాళ్ల ఆరోగ్యాలు మొదలుకుని కుటుంబాల వరకూ రకరకాల సమస్యలతో సతమతం అవుతుంటాయి. అన్నీ బాగున్నాయని మనకు పైకి కన్పిస్తున్నా… వాళ్ల మనస్సులో ఏదో వెలితి దహించి వేస్తూనే ఉంటుంది. ఇది సత్యం. అలాగే ఇది “విధిరాత” వల్ల ఏర్పడే కర్మసిద్ధాంతపు చర్య కాదు. మంచీ చెడూ అనేవి మనం మాట్లాడుకునేటంత సరళమైన పదాలు కాదు. ప్రతీ మంచికీ వందల angles ఉంటాయి, ప్రతీ చెడుకూ వందల angles ఉంటాయి. వాటి వాటి శక్తిని బట్టి అవి ఖచ్చితంగా ప్రతీ ఒక్కరికీ ఏదో రకమైన ప్రభావాన్ని చూపిస్తూనే ఉంటాయి.
సో స్వేచ్ఛగా బ్రతకొచ్చు మనం. ముఖ్యంగా మన మనస్సులకు “విధిరాత” అని వేసుకున్న సంకెళ్లని తెంచుకుంటే.. మనస్సుని స్వచ్ఛంగా పెట్టుకుంటే ఇప్పుడు మనం జీవిస్తున్న జీవితాల కన్నా అద్భుతమైన జీవితాల్ని చవిచూడొచ్చు. మీ జీవితం unconditionalగా మీ చేతిలో ఉంటే దాన్ని ఆనందంలో ముంచెత్తుకుంటారో, బాధల్లో మునిగిపోయేలా చేసుకుంటారో మీరే ఆలోచించుకోండి.
చివరిగా ఒక్క మాట.. “విధి” అనేది లేదు అని నేను అన్నంత మాత్రాన భగవంతుడుని కాదనడం కాదు. భగవంతుడు ఎప్పుడూ ఉంటాడు. కొన్ని విషయాల్ని భగవంతునితో ముడిపెట్టడం సమజసం కాదు.
– నల్లమోతు శ్రీధర్
Leave a Reply