మన బ్రెయిన్ పరిమాణం మనకు ఎలా శత్రువైందో చెబుతాను.
ఏడు మిలియన్ సంవత్సరాలకు ముందు మనిషి మెదడులో కేవలం హైపోథాల్మస్, సెరిబెలం, లింబిక్ సిస్టమ్, హిప్పోకాంపస్ అనే ప్రదేశాలు మాత్రమే ఉండేవి. ఆ తర్వాతి కాలంలో ముఖ్యంగా గత రెండు మిలియన్ సంవత్సరాలుగా మనిషి మెదడు పరిమాణం బాగా పెరిగింది. దానికి ప్రధాన కారణం అప్పటివరకు ఉన్న మెదడు భాగాలకు పైన పరిణామక్రమంలో నియోకార్టక్స్ అనే ప్రదేశం విస్తరణ మొదలు కావడం! అప్పటివరకు కేవలం జ్ఞానేంద్రియాల నుండి సమాచారాన్ని స్వీకరించి, దానిని డీకోడ్ చేయటం వరకే పరిమితమైన నియోకార్టక్స్ తర్వాతి కాలంలో మరింత శక్తివంతంగా తయారయింది. పూర్తి లోతుల్లోకి వెళ్లకుండా అసలు విషయం లోకి వస్తాను.
ఇప్పుడు ఆధునిక యుగంలో మన మెదడులో ఉన్న నియోకార్టక్స్ని ఆలోచనలు సృష్టించే బ్రెయిన్‌గా పరిగణించవచ్చు. అంటే మైండ్ లో ఆలోచనలు సృష్టించబడినప్పుడు ఈ ప్రదేశంలో ప్రధానంగా న్యూరల్ యాక్టివిటీ జరుగుతుంది. మనం చేసే ఆలోచనకు సరిసమానమైన ఎమోషన్ సృష్టించబడుతుంది. అలాగే ఆ ఎమోషన్ని ఏ మేరకు నియంత్రించాలి అన్నది బ్రెయిన్లోనే మరో భాగమైన అమిగ్డాలా చూసుకుంటుంది. కేవలం ఆలోచన సృష్టించడం మాత్రమే కాకుండా, నిర్ణయాలు తీసుకోవడం, విషయాలను విశ్లేషించడం లాంటివి కూడా నియోకార్టక్స్ చూసుకుంటుంది.
ఉదాహరణకు ఈ ఆర్టికల్ నేను విశ్లేషణాత్మకంగా రాస్తున్నప్పుడు నా బ్రెయిన్లో నియోకార్టక్స్ ప్రదేశంలో న్యూారాన్లకి మధ్య ఫైరింగ్ జరుగుతుంది. దాంతో నా విశ్లేషణ మెరుగుపడుతుంది.
నిశితంగా గమనిస్తే పరిణామక్రమంలో మనిషి నియోకార్టక్స్ అభివృద్ది చెందడం మొదలుపెట్టాక అతనికి ప్రకృతితో సంబంధం తెగిపోయింది. ఎందుకో ఇదంతా చదివాక మీకు అర్థమవుతుంది.
ఒక మనిషిలో ఇగో ఏర్పడానికి నియోకార్టక్స్ ప్రధానమైన భూమిక పోషిస్తుంది. తాను వేరు, విశ్వం వేరు అనే భావనని ఈ లాజికల్, థింకింగ్ బ్రెయిన్ సృష్టించడం మొదలు పెడుతుంది. అందుకే ప్రకృతి లో మిగతా అన్ని జీవులు ప్రకృతికి సమీపంగా బ్రతుకుతుంటే మనిషి మాత్రం ప్రకృతికి దూరంగా జరిగిపోవడం మొదలుపెట్టాడు. భౌతిక జీవితంలో సౌకర్యాలు కల్పించుకోవడం, ఉద్యోగాలు చేయడం, అవకాశాలు సృష్టించుకోవడం, తన “ఇగో” అనే ఉనికిని నిలబెట్టుకోవడానికి విశ్లేషణలు చేయడం, నిర్ణయాలు తీసుకోవడం, ఏది మంచి ఏది చెడు అనే వ్యత్యాసాలు పెట్టుకోవడం, ప్రశ్నించడం, ప్రశ్నించడం అనే చర్య ద్వారా విశ్లేషణా శక్తిని పెంచుకుంటూ వాదనాపటిమని మెరుగుపరుచుకుంటూ నియోకార్టక్స్లో గ్రే మేటర్ పరిమాణాన్ని పెంచుకుంటూ మనిషి మేధోజీవిగా అభివృద్ధి చెందటం మొదలుపెట్టాడు.
సైన్స్, విశ్లేషణ, ప్రశ్న, ఆధారాలు వంటివి నియోకార్టక్స్ ఉత్పత్తి చేసే చర్యలు. విషయ జ్ఞానాన్ని పెంచుకోవటానికి, దాన్ని విశ్లేషించుకోవడానికి అది బాగా ఉపయోగపడుతుంది. అయితే దురదృష్టవశాత్తు ఈ నియోకార్టక్స్ రోజురోజుకీ మన ఆలోచనాపటిమతో, వాదనా పటిమతో, విషయ జ్ఞానం తో పరిమాణంలో పెరుగుతూ వచ్చాక, మనిషికి విపరీతంగా ఆలోచనలు మొదలయ్యాయి. జ్ఞానేంద్రియాల ద్వారా స్వీకరించిన ప్రతీదాన్నీ విశ్లేషించడం, దాని గురించి అదే పనిగా ఆలోచించడం, తన ఇగో అనే ఉనికికి ఎక్కడ ప్రమాదం వాటిల్లుతుందో అని భయపడడం, విశ్లేషించటం, ఆలోచించడం అనే ప్రక్రియ తన మానసిక ప్రశాంతతను దూరం చేసే స్థాయిలో ఆలోచించడం దీనివల్లనే జరుగుతుంది. అందుకే అతిగా ఆలోచించే వ్యక్తి ఇంట్లో ఉండే దేవుడి మండపం ముందు కూర్చుని, తనని తాను దేవుడు అనే ఓ నమ్మకానికి అర్పించుకుని దణ్ణం పెట్టుకునే ఓ మామూలు మనిషి పొందినంత ప్రశాంతతను కూడా ఆస్వాదించలేడు. కారణం అతనికి అతని ఆలోచనే శత్రువు. తమ ఆలోచనలను నియంత్రించుకోగలిగే వాళ్లు కొద్దిగా మెరుగ్గా ఉంటారు. కానీ పూర్తిస్థాయి ప్రశాంతత కావాలంటే థింకింగ్ మైండ్‌ని నిలిపివేసి ప్రకృతికి సరెండర్ కావాల్సిందే. ప్రకృతి అంటే దేవుడు కావచ్చు, ఓ సూపర్ పవర్ కావచ్చు. ఎవరి నమ్మకాలను బట్టి వారి స్వేచ్ఛ అది. మళ్లీ దీంట్లో “దేవుడు అని Nallamothu Sridhar అంటున్నాడు, అతన టెక్నాలజీ నిపుణులు అయి ఉండి దేవుడిని ఎలా నమ్ముతాడు” అని లాజిక్‌లు తీస్తే థింకింగ్ మైండ్‌కి పనిచెప్పినట్లే! అప్పుడు ప్రశాంతత, ప్రకృతి అనే అంశాలకు దూరంగా జరిగినట్లే!
ఇప్పుడు మెయిన్ పాయింట్ కి వస్తాను. మనిషి 5-7 సంవత్సరాల వయస్సు వరకూ ప్రకృతికి దగ్గరగా ఉంటాడు. వారు కళ్లు, చెవులు, ముక్కు వంటి జ్ఞానేంద్రియాలకు తెలీని విషయాలు కూడా వారికి తెలుస్తాయి. కారణం వారిలో మామూలు ఫ్రీక్వెన్సీల లో అర్థం కాని విషయాలను వారి బ్రెయిన్ స్వీకరించగలుగుతుంది. మంచం మీద పడుకున్న ఓ నెలల బాబు కొన్నిసార్లు ఏదో దిక్కుగా చూస్తూ అదే పనిగా ఏడుస్తుంటాడు. వాళ్ల తల్లికి ఏం జరిగిందో అర్థం కాదు. కొద్దిసేపటికి నెగిటివ్ మైండ్‌సెట్‌తో భార్య మీద అరుస్తూ ఆ గదిలోకి ఆమె భర్త రావచ్చు. ఇది చిన్న ఉదాహరణ మాత్రమే. వైబ్రేషన్ తెలుసుకునే సామర్థ్యం చిన్నపిల్లలకు ఉంటుంది. అందుకే చిన్నపిల్లల్ని దేవుడితో పోలుస్తారు.
7 సంవత్సరాల తర్వాత మెల్లగా బ్రెయిన్లో నియోకార్టక్స్ అభివృద్ధి మొదలవుతుంది. అది మొదలయ్యాక ఏది మంచి, ఏది చెడు అని సమాజం నేర్పించే మంచిచెడులు మెల్లమెల్లగా అర్థం కావడం మొదలు పెడతాయి. “గొడవ చెయ్యకు” అని మరీ చిన్నపిల్లలకి చెబితే వారు అర్థం చేసుకో లేకపోవడానికి కారణం ఇదే. ఎందుకంటే గొడవ చేస్తే ఇతరులకు ఇబ్బంది అవుతుంది అనే బ్రెయిన్లోని నియోకార్టక్స్ చెప్పే మంచి చెడులు వారికి తెలీవు. స్వేచ్ఛా జీవులుగా ప్రకృతికి దగ్గరగా, విశ్వాన్ని పూర్తిగా అనుభూతి చెందుతూ బ్రతుకుతుంటారు. 7 ఏళ్లు మొదలుకుని 20 ఏళ్ల తర్వాత ప్రపంచం చెప్పే మంచి చెడులు వారికి తెలియడం మొదలెడతాయి. కానీ అప్పటికే వారు ప్రకృతికి దూరంగా జరిగిపోతారు.
నియోకార్టక్స్ అభివృద్ధి చెందుతూ ఉండే కొద్దీ.. ఇగో మొదలవుతుంది. ఇది నాది, అది నాకు నచ్చదు, ఇది నా కులం, ఇది నా కులం కాదు, ఈ హీరో నాకు ఇష్టం, ఈ హీరో ఇష్టం కాదు అనే అభిప్రాయాలు మొదలవుతాయి. “ఇది నేను” అనే భావన వస్తే మరి చుట్టూ ప్రపంచం, ఈ విశ్వంలో ఉన్న సకల జీవులూ ఎవరు? “వారు వేరు” అనే కదా! అంటే అక్కడ నుండే వేరు భావన మొదలవుతుంది.
ఈ ప్రపంచంలో నువ్వు ప్రత్యేకం అనే భావన వచ్చిన వెంటనే.. ఆ ఇగో పతనాన్ని మొదలుపెడుతుంది, సంఘర్షణని మొదలుపెడుతుంది. నువ్వు నీ కంటూ ఒక ప్రత్యేకమైన భవనాన్ని నీ ఆలోచనల్లో సృష్టించుకుని.. ఈ వస్తువు నాది, ఈ అవకాశం నాది, సైకాలజిస్టుని కాబట్టి నేనే సైకాలజీ గురించి మాట్లాడాలి, నేను డాక్టర్ని కాబట్టి నేనే మెడిసిన్ గురించి చెప్పాలి, నేను జర్నలిస్టుని కాబట్టి నేనే విశ్లేషించాలి, నేను టెక్నాలజీ నిపుణుడిని కాబట్టి టెక్నాలజీ గురించి నేనే చెప్పాలి వంటి సంకుచిత ఆలోచనలు మొదలుకుని నా అభిప్రాయాలే నిజమైనవి అనే మొండి వాదనల వరకూ ఒకదాని తర్వాత ఒకటి పొరలు పొరలుగా ఏర్పడతాయి.
ఈ పొరలు తొలగించుకుని తిరిగి సోల్ లెవల్‌కి వెళ్లడానికి కొందరికి జీవిత కాలం పడుతుంది, మరికొందరు బ్రతికి ఉండగా దాన్ని తెలుసుకోలేరు. మరి కొద్ది గంటల్లో చనిపోయే ముసలమ్మ కూడా సణుగుతూ ఉంటుంది.. “ఏమే ఆ చిన్న కూతురు రాలేదా, దానికి నేనంటే ఇష్టం లేదు” అనే నిరాశ భావన ఆమె కళ్లల్లో కన్పిస్తుంది. అంటే “నేను” అనే అహాన్ని ఆమె చనిపోబోతూ కూడా వీడలేకపోయింది అన్నమాట.
“నేను” అనే ఇగోని సృష్టించుకున్న వెంటనే నిరంతరం మైండ్ లెవల్ థింకింగ్ జరుగుతూనే ఉంటుంది. తనని తాను సెంటర్ పాయింట్‌గా పెట్టుకుని మిగతా ప్రపంచాన్ని జడ్జ్ చెయ్యడం, కొందరిని దగ్గరగా తీసుకోవడం, కొందరిని దూరంగా పెట్టడం మొదలవుతాయి. ఎందుకు దగ్గరగా తీసుకుంటున్నారో, ఎందుకు దూరంగా పెడుతున్నారో నియోకార్టక్స్లో న్యూయల్ యాక్టివిటీ ద్వారా విశ్లేషణ ఏర్పడి లాజిక్ సృష్టించబడుతుంది.
దీంతో అందర్నీ, అన్ని జీవులనూ unconditional గా ప్రేమించవలసిన వాళ్లం కాస్తా “నా కులం వాళ్లనే నేను ఇష్టపడతాను, నా మతం వాళ్లనే నేను ఇష్టపడతాను, నేను కలిగి ఉన్న అభిప్రాయాలు కలిగిన వాళ్లనే ఇష్టపడతాను” అనే స్థాయికి మన దృక్పధం దిగజారిపోతుంది. దీంతో “నేను వేరు”, నా కులం వాళ్లంతా వేరు, నేను వేరు, నా దేశం వాళ్లంతా వేరు, నేను వేరు, పులులు వేరు, సింహాలు వేరు, నేను వేరు ఈ పంచభూతాలు వేరు అనే అన్ని స్థాయిల్లో వేరు భావనలు మొదలవుతాయి. ఇక్కడ నుండి మనిషికి బాధలు మొదలవుతాయి. “నేను వేరు” అనుకుంటే “నువ్వూ, మిగతా ప్రపంచం నా మీద దాడి చేసే ప్రమాదం ఉంది కదా” అనే ఇన్ సెక్యూరిటీ మొదలవుతుంది. “నా మతం గొప్పది” అనుకుంటే మిగతా మతాల నుండి దాడి జరుగుతుంది కదా అనే భావనా మొదలవుతుంది. ఇలా తన మనస్సనే అంతర్గత ప్రపంచంలో అన్నింటి నుండి దూరం జరుగుతూ మనిషి బిక్కుబిక్కుమంటూ భయపడుతూ బ్రతకడం మొదలుపెడతాడు.
వాస్తవానికి అన్ని మతాలూ “నువ్వు అందర్నీ ప్రేమిస్తూ అన్ కండిషనల్ లవ్‌తో బ్రతుకు” అని ప్రబోధిస్తుంటే ఆయా మతాల వారుసులం అయిన మనం అందర్నీ వేరుచేసుకుంటూ, అందర్నీ దూరం పెడుతూ ఇన్ సెక్యూరిటీతో బ్రతుకుని ఛిద్రం చేసుకుంటూ ఉంటాం.
మనిషి నియోకార్టక్స్, థింకింగ్ మైండ్‌కి బానిసగా మారినంత కాలం విషయ జ్ఞానం మాత్రమే పెరుగుతుంది, ఆలోచన శక్తి మాత్రమే పెరుగుతుంది. జిమ్ కెళ్లి బైసెప్స్కి ఎక్సర్సైజ్లు చేస్తే ఎలాగైతే కండలు పెరుగుతాయో అలా విపరీతంగా ఆలోచించే కొద్దీ ఒక విషయాన్ని వంద కోణాల్లో ఆలోచించే నేర్పు పెరుగుతుంది. కానీ ఆ ఆలోచనా శక్తిని, ఆ నియో కార్టక్స్ పవర్‌ని అవసరమైన విషయాలకు ఉపయోగించుకోవడానికి బదులు మేధస్సు మేధస్సు అని ప్రతీ అడ్డమైన చెత్తనీ తెలుసుకోవడం, తన సోల్ మీద ఫోకస్ పెట్టాల్సింది, సకల జీవ జాతులకు సమీపంగా వెళ్లాల్సింది పోయి దూరమవుతూ జీవించి ఉండగానే నరకాన్ని చూడడానికి మనకు మనమే కారణం అవుతాం.
నువ్వు దేవుడివి అంతే.. నీ చుట్టూ ఉన్న మనుషుల్ని, ఇతర జీవ జాతుల్ని థింకింగ్ మైండ్‌తో కాకుండా, విశ్వజనీయమైన ప్రేమతో దగ్గరకు తీసుకో.. విశ్వం నిన్ను తనకి అక్కున చేర్చుకుంటుంది. నేనేం చేశానని ఇంతమంది మిత్రులు నన్ను ఇష్టపడుతున్నారు? నేను వారికి ఓ ముద్ద అన్నం పెట్టలేదు, ఓ పది రూపాయలు డబ్బులు ఇవ్వలేదు.. కేవలం ఇదే రకమైన అన్ కండిషనల్ ప్రేమతో వారికి ప్రకృతి గురించి, జీవితం గురించి చెబుతున్నాను. నాలో ఉన్న ప్రేమ వాళ్లు నన్ను తమ కుటుంబ సభ్యుడిగా స్వంతం చేసుకునేలా చేస్తోంది. ఇదీ జీవన విధానం. సపరేట్ అవకు, మిగతా ప్రపంచాన్ని సపరేట్ చేసుకోకు. అందరూ నీవాళ్లే, అందరి బాధ్యతా నీదే, అందర్నీ ప్రేమించు, వారి ఎదుగుదలని హర్షించు. విశ్వమనే దైవిక శక్తిని తెలుసుకునే మార్గం ఇదే!
నువ్వెందుకు ప్రశాంతంగా ఉండలేకపోతున్నావో తెలుసా.. నువ్వునుకుంటున్న నీ నాయకుడిని ఎవరైనా ఏమైనా అంటారేమోనని కాపలా కాస్తూ ఉన్నావు.
నువ్వెందుకు ప్రశాంతంగా ఉండలేకపోతున్నావో తెలుసా.. నువ్వునుకుంటున్న నీ మతాన్ని ఎవరైనా ఏమైనా అంటారేమోనని కాపలా కాస్తూ ఉన్నావు.
నువ్వెందుకు ప్రశాంతంగా ఉండలేకపోతున్నావో తెలుసా.. నువ్వునుకుంటున్న నీ ప్రాంతాన్ని ఎవరైనా ఏమైనా అంటారేమోనని కాపలా కాస్తూ ఉన్నావు.
నువ్వెందుకు ప్రశాంతంగా ఉండలేకపోతున్నావో తెలుసా.. నీ థింకింగ్ మైండ్ సృష్టించిన నీ అభిప్రాయాలను మొండిగా సమర్థించుకుంటూ వాటిపై దాడి జరగకుండా కాపాడుకుంటున్నావు!
ఇలా కాపలా కాస్తున్నంత సేపూ, బిక్కుబిక్కుమంటూ భయంతో బ్రతుకున్నంత సేపూ నువ్వు అందర్నీ అక్కున చేసుకునే దేవుడివి, క్రియేటర్వి ఎలా అవుతావు?
మరో భాగంలో మళ్లీ కలుస్తాను.
- Sridhar Nallamothu