సినిమా ఇండస్ట్రీ వైభవం ఇప్పుడు మిగిలున్న కొద్దిమాత్రం కాదు..
తెలుగు సినిమా ఓ వెలుగు వెలిగింది.. సినిమా తారలన్నా, టెక్నీషియన్లన్నా ఇప్పుడున్న దానికి పదింతల అభిమానం జనాలకుండేది..
ఈరోజు దాసరి మాట్లాడిన మాటలు దాదాపు పదిహేనేళ్ల క్రితం "ఒసేయ్ రాములమ్మ" టైమ్‌లో దాసరి అనేక ప్రెస్ మీట్లకు వెళ్లిన రోజులు గుర్తుచేశాయి.
చెన్నైలో ఆయన ఇంట్లోనే ఎక్కువ ప్రెస్ మీట్లు జరిగేవి.. అందరు సినిమా రిపోర్టర్లం కలిపినా 10 మందికి మించి ఉండేవాళ్ళం కాదు… పసుపులేటి రామారావు, జగన్, ఉమామహేశ్వరరావు వంటి సీనియర్ జర్నలిస్టులే ఆయన ముందు భయపడేవాళ్లు… నేనూ, మణిగోపాల్ (హ్యాపీ డేస్ అరెరె.. సాంగ్ రచయిత వనమాలి) వంటి వాళ్లమైతే చాలా సైలెంట్‌గా కూర్చుని ఆయన చెప్పేది రాసుకునే వాళ్లం.
ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే దాసరి నారాయణరావుకి ఉన్న సినిమా అనుభవం అపారమైనది.. ఆయన చాలాసార్లు క్రిందపడ్డారు.. చాలాసార్లు పైకీ లేచారు…
ఆయన ఈరోజు మాట్లాడిన ఓ మాట చాలా సత్యం. ఆయన కొత్త వాళ్లకెందరికో అవకాశాలు ఇచ్చారు…
తెలుగు సినిమా పరిశ్రమ ప్రస్తుత స్థితిగతుల గురించి దాసరి వ్యాఖ్యలు నేటి తరానికి అర్థం కాకపోవచ్చు… ఈ కొత్త హీరోలూ, హీరోయిన్లూ, మనం అభిమానించే పెద్ద పెద్ద స్టార్ల గురించి ఈయనెవరు కామెంట్ చేయడానికి అన్పించవచ్చు.
ఇదే పెద్ద స్టార్లు నిలదొక్కుకోవడానికి NTR, దాసరి, రాఘవేంద్రరావు వంటి ఎందరో సహకరించారు.. అనేక షూటింగుల్లో, కధాచర్చల్లో, కాస్టింగ్ కూర్పు గురించి జరిగే సంభాషణల్ని దగ్గరగా గమనించడం ద్వారానూ, అప్పటి సీనియర్ పాత్రికేయులు షేర్ చేసుకున్న అనేక ఆఫ్ ది రికార్డ్ అనుభవాల ద్వారానూ ఆ విషయాలు నాకు అర్థమయ్యాయి. ఆ తరానికి ముందు విక్టరీ మధుసూదనరావు, నాగిరెడ్డి, చక్రపాణి వంటి వాళ్ల గురించి నాకంతగా తెలీదు.
వంద రోజుల సినిమా నుండి 3 రోజుల సినిమాకి దిగజారే ప్రతీ స్టెప్నీ నేను కళ్లారా చూశాను…
నేను సినిమా ఇండస్ట్రీలో ఉండగా చివరిసారి అటెండ్ అయిన 100 రోజుల ఫంక్షన్లు హిట్లర్ (ఒంగోలులో), పెద్దన్నయ్య. నిజంగా అవి 100 రోజులు ఆడాయి.. ఆడించబడలేదు.
ఇప్పుడు నెలరోజులు ఆడితే గొప్ప సినిమా అయిపోతోంది. అదేమంటే పైరసీ అని వంద సాకులు చెప్తున్నారు.. 🙂 సినిమా రంగంలోని లోపాలు, లోపల జరిగే భజనలు టాలెంట్ నీ, మంచి సినిమాల్నీ ఇండస్ట్రీకి ఎంత దూరం చేస్తున్నాయో చాలా నిశితంగా గమనిస్తున్నాను.
పోయిన తరాలు ఎటూ పోయాయి.. కనీసం కళ్లెదురు బ్రతికున్న దాసరి, రాఘవేంద్రరావు, కోదండరామిరెడ్డి, కోడి రామకృష్ణ వంటి సీనిర్ల నుండి ఇండస్ట్రీ గ్రహించవలసిందీ, నేర్చుకోవలసిందీ చాలా ఉంది.
ఏ డిసిప్లెయిన్తో అయితే నిర్మాతకు బడ్జెట్ తగ్గుతుందో ఆ డిసిప్లెయినే ఇప్పుడు ఇండస్ట్రీలో లోపించింది. కొత్తగా మేకప్పు వేసుకునే ప్రతీ ఒక్కరూ రాజభోగాలు వెలగబెట్టేవారే… అలాగే టెక్నీషియన్లకి ఒళ్లొంచి పనిచేయడం తెలీదు.
మనకు మగధీర, ఈగ వంటి భారీ బడ్జెస్ట్ సినిమాలే పెద్ద హిట్ లుగా కన్పిస్తాయి. వంద సినిమాల్లో ఓ నాలుగైదో హిట్లే కన్పిస్తాయి.. మరి మిగతా నిర్మాతల, సినిమా ల పరిస్థితి ఏమిటి? సినిమా ఇండస్ట్రీ గత 15 ఏళ్లల్లో ఎంతో పతనం అవడానికి దారితీసిన నాకు తెలిసిన ఇంకొన్ని కారణాలు వివాదాస్పదం అయ్యే అవకాశం ఉన్నందున ప్రస్తావించట్లేదు.
బట్ ఒక్కటి మాత్రం నిజం.. ఫంక్షన్లలో భజనలు మానేసి దాసరిలా నిఖార్సుగా మాట్లాడే అనుభవజ్ఞులు కావాలి.. సినిమా ఇండస్ట్రీ తన లోపాలపై కొద్దిగానైనా దృష్టి సారించడానికి.. లేదంటే లైట్ బోయ్ దగ్గర్నుండి డైరెక్టర్ వరకూ అందరూ "అంతా బ్రహ్మాంఢం అనేస్తారు… చివరకు బ్రహ్మాంఢం కాదు బూడిద మిగులుగుతూ ఉంటుంది" నిర్మాతకు!!
దీనిలో చాలా విషయాలు రాయలేకపోయాను. బట్ సినిమా రంగంలో పనిచేసేవాళ్లకి చాలామందికి అవేంటో తెలిసే ఉంటాయి… లోపాల్ని కప్పిపుచ్చుకుని బ్రతక్కపోతే!!
ధన్యవాదాలు
– నల్లమోతు శ్రీధర్
ఎడిటర్
కంప్యూటర్ ఎరా తెలుగు మేగజైన్
Leave a Reply