ఏటిట్యూడ్ అని ఒకటి ఉంటుంది.. మనం మన పట్లా, తోటి మనుషుల పట్లా, సమాజం పట్లా కలిగి ఉండే దృక్పధం!
మన పట్ల మనకు కాన్ఫిడెన్స్ ఉండదు.. మనమేమీ చెయ్యం.. అసలు కష్టపడం.. సో మనమంటే మనకు చులకన.. మన వల్ల ఏదీ కాదు అనే నిర్లిప్తత.
తోటి మనిషి విషయానికి వస్తే ఏదీ భరించలేం.. వాడు ఎదుగుతుంటే తట్టుకోలేం… పట్టించుకోనట్లూ, మనకేమీ తెలీనట్లూ ignore చేసినట్లూ బిల్డప్పులు ఇస్తాం.. కానీ లోపల కుళ్లిపోతుంటాం.. ఓర్వలేం..
సమాజం పట్ల ఎప్పుడూ నెగిటివ్ దృక్పధమే.. ఎందుకూ పనికిరాని సొసైటీ ఇదనీ.. ఈ సొసైటీలో బ్రతకాల్సి రావడం మన దురదృష్టమనీ.. ఇలాగన్నమాట.
సో మనకు మనం నచ్చం.. మనకు పక్కవాడు నచ్చడు.. మనకు సొసైటీ నచ్చదు? ఇంకెందుకు బతకడం? హాపీగా ఇష్టం లేని ఈ జీవితం నుండి సూయిసైడ్ చేసుకుని చనిపోవచ్చు కదా… (ఐ మీన్ సూయిసైడ్ చేసుకోమని కాదు.. చిన్న లాజిక్ అంతే) మనకు అలా ఇష్టముండదు. బ్రతికే ఉండాలి.. మన ప్రతికూల దృక్పధంతో రగిలిపోవాలి, అన్నింటి గురించి నెగిటివ్ ఎమోషన్లని కుమ్మరించాలి.. ఒళ్లొంచకుండా తిని తొంగోవాలి.. ఇదీ చాలామందికి నచ్చే జీవితం.
—————————
మన నెగిటివ్ దృక్పధం వల్ల దేన్నో అడ్డుకుంటున్నామని భావిస్తాం.. ఏదీ ఆగదు. ఆఫ్టరాల్ మనం ఒక మామూలు మనిషిమి. ప్రపంచంలో జరిగేవన్నీ మన అనుమతి తీసుకోవాల్సిన పనిలేదు. మనం ఔనన్నా కాదన్నా అవి జరిగిపోతూనే ఉంటాయి. జస్ట్ మనం ఓ పక్క ఓర్వలేక మూలుగులు మూలుగుతూ ఉంటాం అంతే.
ఏ పనీ చెయ్యని వాడికీ.. ఏ గమ్యం లేని వాడికీ.. జీవితం పట్ల గౌరవం లేని వాడికీ.. తోటి వ్యక్తి పట్ల కనీస మర్యాద లేని వాడికీ మాత్రమే జీవితం నరకంగా ఉంటుంది. ఇలాంటి నెగిటివ్ దృక్పధంలో పీకల్లోతు మునిగిపోతాడు. తన పనేదో తాను బుద్ధిగా తలొంచుకుని చేసేవాడు ఎవరికీ అర్థం కానంత సంతోషాన్ని అనుభవిస్తూనే ఉంటాడు. అందుకే సమాజాన్ని మార్చాలని చూడడం మానేసి మన దృక్పధాన్ని మార్చుకోవడం మీద మొదట దృష్టి పెట్టాలి.
– నల్లమోతు శ్రీధర్
Leave a Reply