“ఏ పని చేస్తే ఎవరేమనుకుంటారో..” – అందరి బ్రెయిన్స్నీ విపరీతంగా ఆలోచింపజేసే టెన్షన్ ఇది!
మనం చేసే పని కన్నా దాన్ని ఫలానా x, ఫలానా y, ఫలానా z ఎలా రిసీవ్ చేసుకుంటారో అని తెగ ఆలోచించేసి వాళ్లకి నచ్చేలా మనల్ని మనం మార్చేసుకుని మన మనస్సుని చంపేసుకుంటూ ఉంటాం.
ఇక్కడ మనం 100% కరెక్టే. మనమేమీ తప్పు పని చెయ్యట్లేదు. అసలు తప్పుడు పనులు చేసేవాడు కూడా ఇంతగా ఆలోచించడు. వాడు చేసేదేదో ధైర్యంగా చేసేస్తుంటాడు. మనమే ఎవడికో నచ్చాలని మనల్ని మనం తెగ మోడిఫై చేసేసుకుంటాం.
పోనీండి.. జనాల్ని గంగలో దూకేయమనండి.. నష్టమే లేదు. మీ పనులు ఎవరికెలా అర్థమైనా అది అస్సలు మేటరే కాదు. అరే ఇది మీ లైఫ్. ఇలా పక్కలకు దిక్కులు చూసుకుంటూ అందరి మొహాల్లో ఫీలింగ్స్‌ని మోసుకుని తిరుగుతూ బిక్కుబిక్కుమంటూ కూర్చుంటే చచ్చేలోపు సాధించడానికి ఏమీ మిగలదు, ఈ మనుషుల గురించి భయాలూ, ఇన్సెక్యూరిటీలూ తప్ప!
ఒకటే వాస్తవం! నువ్వు ఏదైనా తప్పు చేస్తున్నావా? ఆ తప్పు నిన్నూ, నీ కుటుంబాన్నీ, సమాజాన్నీ ప్రత్యక్షంగానో, పరోక్షంగానో బాధపెట్టేదా? అయితే అది వెంటనే ఆపేయి. ఆ ఒక్క రూల్ తప్పించి మనుషుల గురించి అన్ని భయాలూ అబద్ధమే. ఎవడో ఏదో అనుకుంటాడని నీకు టెన్షనెందుకు.. నీకు ఒప్పయినది వాడికి తప్పులా కన్పించి ఉండొచ్చు. అది అభిప్రాయం బేధం తప్పించి స్టాండర్డ్ రూలేం కాదు కదా? Then ఎందుకు ఊగిసలాట?
మన లైఫ్‌ని ఈ మనుషుల చేతుల్లో పెడితే ఫుట్బాల్లా తలొక మూలకి తన్నేసి గాలి తీసేస్తారు. ఎందుకూ పనికిరాకుండా అయిపోతాం. మన లైఫ్ చచ్చేంత వరకూ మన చేతుల్లోనే ఉండాలి. మనమే డిసైడింగ్ ఫ్యాక్టర్. కర్త, కర్మ, క్రియా అన్నీ మనమే అవ్వాలి. నువ్వెలా ఉండాలో డిసైడ్ చేసే స్వేచ్ఛ ఇంకొకడికి ఇవ్వకు. ఆడేసుకుంటారు. ముఖ్యంగా మనమిచ్చే గౌరవాన్ని తనివితీరా ఎంజాయ్ చేస్తూ ఉచిత సలహాలు ఇచ్చే బాపతు జనాలతో మరీ జాగ్రత్త. ఇంతకుముందే చెప్పినట్లు ఏది తప్పో, ఏది ఒప్పో నీ మనఃసాక్షికి తెలిస్తే చాలు.. ఇక నీ స్టైల్, నీ ఆలోచనలు, నీ బాడీ లాంగ్వేజ్, నీ హెయిర్ స్టైల్, డ్రెస్సింగ్ స్టైల్ అంతా నీ ఇష్టం.
ఇది మన లైఫ్.. మనకు చాలా లక్ష్యాలున్నాయి. అవే కన్పించాలి తప్ప ఇలా ఎప్పుడూ రకరకాల బలహీనతల మధ్య వాళ్లకే క్లారిటీ లేని మనుషుల వైపు చూస్తూ వాళ్లే గొప్పోళ్లు, వాళ్లే మన లైఫ్ డిజైనర్లు అని దేబిరించుకుని చూస్తుంటే జీవితం సంకనాకిపోతుంది. నిజం.. ఈ పదం below averageదై ఉండొచ్చు. కానీ ఇతరుల చేతిలో లైఫ్ పెట్టేసి మనం ఎలా లైఫ్ నాశనం చేసుకుంటున్నామో అర్థం కావాలంటే ఇదే కరెక్ట్ పదం. బ్రతుకు! నీదైన స్వంత జీవితాన్ని తనివితీరా ఏదైనా సాధించడానికీ, ఆస్వాదించడానికీ నరనరానా ఉత్సాహాన్ని నింపుకుని బ్రతికేయి!!
– నల్లమోతు శ్రీధర్
Leave a Reply