“నాకేం చెప్పకు.. నాకంతా తెలుసు.. మనుషులంతా ఇంతే.. i know.. చాలా స్టడీ చేశాను.. మనుషుల్ని చూస్తుంటే అసహ్యం వేస్తోందీ..” – ఈ డైలాగ్ చాలాసార్లు చాలామంది నుండి విన్నాను. చెప్పిందే చెప్పి చంపేస్తారు.. వాళ్లు అనుకున్నదే కరెక్ట్ అని!
అసలు ఏం తెలుసని మనుషుల గురించి? ఆఫ్టరాల్ ఏవో నాలుగు కష్టాలు రాగానే, ఓ నలుగురు లైఫ్‌లో హ్యాండ్ ఇవ్వగానే ఏదో పెద్ద హ్యూమన్ రేస్ సైకాలజీ మొత్తం ఒంట పట్టేసినట్లు బుర్రకు తాళాలు వేసుకుంటూ కూర్చునే జనాల్ని ఏమనాలో అర్థం కాదు.
ప్రతీ మనిషీ ఎదుటి వ్యక్తి తప్పునే 400% జూమ్ చేసి తాము ఏం చెయ్యకపోయినా జనాలు తమ పట్ల నిర్థయగా ఉన్నారని వెధవ ఫోజులు కొడుతుంటారు. ఎదుటి వాడిని point out చెయ్యడం కాదు… అసలు నువ్వేం తప్పు చేశావో అనలైజ్ చేసుకుంటే, కాస్త ఇగోలు పక్కనపెడితే అన్ని రిలేషన్లూ బాగుంటాయి.
ఒకరిద్దరు నాతో అంటుంటారు… “క్షమించడం మా ఇంటా వంటా లేదు.. నేను ఇప్పటివరకూ ఎవరికీ సారీలు చెప్పలేదు” అని! “సారీ” చెప్పడానికి చాలా పెద్ద మనస్సు కావాలి. తప్పులన్నీ చేస్తూ కూడా సారీ చెప్పడానికి కూడా అంత ఇగోయిస్టిక్‌గా ఉంటే ఎవరు లోపల్లోపల కాలిపోయేది మీరే. “ఎవరికీ సారీ చెప్పకుండా ఉండడం” గొప్ప కాదు. అది నీ లోపం క్రింద లెక్క.
మనిషిని ప్రేమించడం, అభిమానించడం చాలా గొప్ప నేచర్. ఆ మైండ్‌సెట్‌లో నుండి చూస్తే చుట్టూ అందరూ ఎంత ఎఫెక్షనేట్‌గా ఉండే వాళ్లు కన్పిస్తారో! కానీ తెల్లారిలేస్తే మనం ఆలోచించేదంతా నెగిటివ్ థింకింగ్.. మనుషులపై నమ్మకం ఉండదు.. “మనుషులంతా స్వార్థపరులు.. మనమొక్కళ్లమే పుణ్యాత్ములం” అనే బోడి ఫీలింగులు.. ఇలాంటి సంకుచిత భావజాలం మధ్య అసలు మనిషిలో దైవం ఏం కన్పిస్తుంది?
మనిషి భగవంతుడితో సమానం. ఈ మాట నేను కొన్ని వందలసార్లు రాసి ఉంటాను. నిజంగా చాలామంది మనుషుల్లో నాకు భగవంతుడు కన్పిస్తాడు.. నా లైఫ్‌లో నేను ప్రతీ మనిషి పట్లా పాజిటివ్‌గా థింక్ చెయ్యడం వల్ల నాకందరూ దేవుళ్లలాంటి మనుషులే కన్పించారు. అదేంటో మరి ఈ జనాభాకి మనుషుల్లో దెయ్యాలు మాత్రమే కన్పిస్తాయెందుకో అర్థం కాదు.
మనుషుల్ని నమ్మండి, మనుషులకు మంచి చేయండి.. మనుషుల్ని గుండెల్లో పెట్టుకోండి.. మాటల ద్వారా కూడా ఏ మనిషి గురించీ తప్పుగా మాట్లాడకండి.. మనుషుల గురించి తప్పుగా మాట్లాడితే, ఆలోచిస్తే దేవుళ్లని దెయ్యాలుగా మనం మార్చేస్తున్నట్లు లెక్క. ఆ దెయ్యాలు మీ చుట్టూ తిరిగి మిమ్మల్ని గాక ఎవర్ని వేధిస్తాయి?
అందుకే మనిషిలో భగవంతుడిని మాత్రమే చూద్దాం.. మీరు గమనిస్తూనే ఉన్నారు.. నేను నా పోస్టుల ద్వారా చాలా తరచుగా పలువురు వ్యక్తుల గురించి రాస్తుంటాను… అంత గొప్ప వ్యక్తులు నాకు దొరకడానికి కారణం వాళ్ల పట్ల నేను గౌరవం కలిగి ఉండడం! మనుషుల పట్ల గౌరవం కోల్పోయి గొప్ప వ్యక్తులు మనుషుల్లో దొరకాలంటే ఎలా దొరుకుతారు? ఈ లాజిక్ అర్థం కావడానికి కొంతమందికి జీవితకాలం పట్టొచ్చు.
– నల్లమోతు శ్రీధర్
హస్తినాప్రంలో వెతికి తీసుకురమ్మంటే ధర్మరాజుకు ఒక్కచెడ్దవాడు కనపడలేదట అలగే ధిర్యోధనునికి ఒక్కమంచి వాడు కూడా దొరకలెదట ….ఎలాచూస్తే అలా కనపడుతుంది లోకం