తినే ప్రతీ గింజ మీదా మన పేరు రాసి ఉంటుందని ఒకప్పుడు నమ్మేవాళ్లం..
ఇప్పుడు ఏ కోశానా అలాంటి నమ్మకాలు ఎవరికీ లేవు… “లాక్కుని తినే ప్రతీ గింజా మనదే” నైజం అలవడిపోయింది.
కరప్షన్ కరప్షన్ అని కాకుల్లా అరస్తున్నాం గానీ.. ఎవరి స్థాయిలో వాళ్లం కరప్ట్ అవుతూనే ఉన్నాం…
పైసా పని చేసి వంద రూపాయలు ఆశించడం కరప్టెడ్ మైండ్‌సైట్ క్రిందకు రాక “బ్రతకనేర్చడం క్రిందకు ఎలా వస్తుందో” నాకు ఇప్పటికీ అర్థం కాదు.
ప్రతోడూ ప్రతోడీనీ దోచుకునే వాడే అయిన కాడికి.. ఇలాంటి సమాజంలో అమెరికా పని మనిషి శ్రమ దోపిడీ అంతర్జాతీయ సమస్య అవుతుంది… కొన్ని కాలం, ఖర్మం కలిసొచ్చి ఇలా వెలుగు చూస్తాయి.. కొన్ని గమ్మున సాగిపోతుంటాయి.
ఎవరి దోపిడీ వారికి అర్థం కాదు… దోచుకోబడే వాడి నీలుగుళ్లల్లో సమాధైపోవడం తప్పించి!!
ఆటో వాడు మీటర్ వేయనంటాడు…. సినిమా థియేటర్ వాడు బ్లాక్ టిక్కెట్లు అమ్ముతుంటాడు… ఆధార్ సెంటర్ వాడు 200 తీసుకుని 10 నిముషాల్లో enroll చేస్తాడు.. ఇవన్నీ మన దృష్టిలో standard మోసాలు.. వీటిని అస్సలు సహించం…
అదే మనం, ఆఫీస్‌కెళ్లి పావలా పని కూడా చేయకుండానే, చాలాసార్లు ఏదో చేసేస్తున్నట్లు బిల్డప్‌లు ఇస్తూనే.. ప్యాకేజీలు పెరగట్లేదని చిరాకు ఫేస్‌తో తిరుగుతుంటాం.
——————-
దోపిడీ పెద్ద అంటు వ్యాధి… ఒకడు దోచుకుంటుంటే రెండో వాడికి బలం వస్తుంది… “వాడేం పనిచేయకపోయినా టాలెంట్ లేకపోయినా వాడికి జీతం పెరుగుతోందీ..” వంటి ఆక్రందనల మాటున… “నాకూ సంస్థను దోచుకునే అవకాశం దక్కట్లేదే” అన్న అక్కసుకి మించి ఏమీ ఉండదు.
ఒక దేశం, సమాజం బాగుండాలంటే ప్రొడక్టవిటీ పెరగాలి, నాణ్యత పెరగాలి, ప్రతీ ఒక్కళ్లూ ఒళ్లొంచి కష్టపడాలి..
కానీ మనం సమాజాన్నీ, సంస్థల్నీ, వ్యవస్థల్నీ నిట్టనిలువునా దోచుకుంటూ… మనవేం తప్పులు లేనట్లు పిల్లుల్లా కళ్లు మూసుకుని బ్రతికేస్తుంటే ఏం మార్పు వస్తుంది?
మన అసంతృప్తికి కారణం మన దోపిడీ నైజమే.. పనిని నమ్ముకుని, నాలుగు ముద్దలు నోట్లో వెళ్లడమే కోరుకునే వాడికి ఎప్పుడూ అసంతృప్తి ఉండదు.
చాలా దోచుకోవాలనుకునీ, చేతికి కాస్త కూడా చిక్కని వాడికే చిక్కించుకోలేకపోయానన్న బాధ నిరంతరం!!
——————
ఆరణ్యంలో కాకుల రొదల మధ్య రాబందులు మాంస కళేబరాల్ని తన్నుకుపోతున్నట్లు లేదూ!
– నల్లమోతు శ్రీధర్
Leave a Reply