విపరీతంగా వర్షాలట.. మా అమ్మ సుమతీదేవికి నొప్పులు వస్తే ఊరికి ఓ చివర్న ఉండే ఓ ఎలిమెంటరీ స్కూల్ ఆవరణలో తాత్కాలికంగా నడిచే హాస్పిటల్‌కి తీసుకెళ్లారట. ఆ వర్షాల్లో ఆదివారం రోజు పుట్టానట. నాకు కొన్ని విషయాల్లో పట్టింపులు ఉన్నాయి, అందుకే తేదీ ఇతర వివరాలు ఇక్కడ పంచుకోవట్లేదు.
బాపట్లకి ఏడు కిలోమీటర్ల దూరంలో ఉండే చెరువు జమ్ములపాలెం గ్రామం మాది. మా అమ్మ గారి నాన్న, నాకు చాలా ఇష్టమైన తాతయ్య కొమ్మినేని సుబ్బయ్య గారు చుట్టరికం కలిసే సంబంధంతో మా అమ్మకి పెళ్లి చేశారు. అప్పట్లో బంధువుల ప్రమేయం ప్రతీ కుటుంబంలో ఎక్కువగా ఉండేది. మా బంధువుల్లో కాస్తో కూస్తో చదువుకుని పలు వ్యవహారాలు చక్కబెట్టే ఓ పెద్దాయన, ఇంకో ఒకరిద్దరు కలిసి చక్రం తిప్పి నేను కడుపులో ఉండగా చిచ్చుపెట్టారు. అదే సమయంలో మా నాన్న గారు రెండో పెళ్లి చేసుకున్నారట. సో నేను పుట్టడమే తాతయ్య, అమ్మమ్మ, అమ్మ సంరక్షణ తప్పించి వేరే ఏమీ లేకుండా పుట్టాను.
మా అమ్మ మానసికంగా చాలా దెబ్బతింది. నాకు నాలుగైదేళ్ల వయస్సు వచ్చి, కాస్త ఊహ తెలిసే సమయానికి ఆమె మెంటల్ పేషెంట్ అయింది. ఆ స్థితిలోనూ నేనంటే చాలా ప్రేమ. “శ్రీధర్ బాబూ” అంటూ పలవరించేది. ఓసారి తాను మానసిక స్థిమితాన్ని కోల్పోయినప్పుడు ఎందుకో తెలీదు నా గొంతు గట్టిగా పట్టుకుంది. అక్కడే ఉన్న మా పెద్దక్క తన శక్తినంతా ఉపయోగించి రక్షించబట్టి సరిపోయింది.
అలాగే అమ్మ నా మాట తప్పించి ఎవరి మాటా వినేది కాదు. తను మానసికంగా ఇబ్బందిపడి, ఎక్కడికి వెళుతోందో స్పృహ లేకుండా అలా రోడ్ వెంట కిలోమీటర్లు నడుచుకుంటూ వెళ్లేది. అమ్మ కన్పించడం లేదని, వెళ్లి వెదుకు అని అమ్మమ్మో, తాతయ్యో ఎవరైనా చెబితే.. అలా వెదుక్కుంటూ వెళ్లేవాడిని. అప్పటికే కిలోమీటర్ దూరం వెళ్లేది. తనని బ్రతిమిలాడి వెనక్కి తీసుకు వస్తుంటే మా ఊళ్లో అందరూ నవ్వుకుంటూ చూసేవాళ్లు. ఆ దృశ్యం ఇప్పటికీ నా కళ్ల ముందు ఉంది. సరిగ్గా ఆ చిన్న వయస్సులో ఈ సమాజం ఎలాంటిదో అర్థమైంది. ఈరోజు నేను ఎవడినీ లెక్కచెయ్యకుండా నాకు నచ్చినట్లు మాట్లాడడానికీ, ధైర్యంగా ఉండడానికీ బీజం అప్పుడు పడింది. ఈ సమాజం అంటే నాకు అసహ్యం. ఆ అసహ్యం నుండి తర్వాత ప్రేమగా ఎలా మారిందో తర్వాత ప్రస్తావిస్తాను.
మా తాతయ్య, అమ్మమ్మ మమ్మల్ని తల్లిదండ్రుల కన్నా ఎక్కువ చూసుకున్నారు. నిజానికి వారికి మా మీద ప్రేమని పంచడానికి సమయం ఉండేది కాదు.. తెల్లారి లేస్తే పశువుల సంరక్షణ చూసుకోవడం, పొలం వెళ్లి మోకాలి లోతు నీళ్లల్లో కాళ్లు నానిపోయి పుండ్లు పడేలా ఇద్దరూ రోజంతా కష్టపడి పనిచేసి మా భవిష్యత్ గురించి ఆలోచించడమే సరిపోయేది. అమ్మమ్మ పొలం నుండి వచ్చి కట్టెల పొయ్యి మీద ఏదో ఒకటి పడేసి గొట్టంతో గాలి ఊదమంటే అలా ఆ వేడిలో, ఆ పొగకి దగ్గు వస్తుంటే, కళ్లు మంటలు పుడుతుంటే ఊదే వాడిని. అప్పుడే కళ్లు తెరిచిన నాకే అలా ఉంటే జీవితం మొత్తం ఆ కట్టెల పొయ్యి మీద వంట చేసుకుని బ్రతికేసిన వాళ్ల కష్టం గురించి చెప్పాల్సిన పనిలేదు.
చాలాసార్లు వేడి వేడి అన్నం ఎరగారం పచ్చడో, పండు మిరపకాయల గోంగూర పచ్చడో ఉండేది. ఎప్పుడైనా తుఫాన్లు వచ్చి, అమ్మమ్మ తాతయ్యలు ఇంటి పట్టునే ఉంటే పొలంలో పండిన మినుములని వేయించి చిరుతిళ్లుగా పెట్టే వారు. గవిసిగెడ్డల బండి ఊళ్లోకొస్తే వాటిని ఉడకబెట్టుకుని.. “ఇవి తింటే బలం” అని వాళ్లు చెబుతుంటే చాలా శక్తి వచ్చినట్లు నమ్ముతూ తినేవాళ్లం. స్కూలు లేకపోతే వెంటబెట్టుకుని పొలం తీసుకెళ్లే వాడు తాతయ్య. పొలానికి నీళ్లు పెట్టడానికి కాలువలు సరిచెయ్యడం, నాట్లు వేస్తుంటే నారు కట్టలు అందించడం, పవర్ స్ఫ్రేతో పురుగు మందులు చల్లుతుంటే ట్యాంక్‌లో ఆ మందు కలపడం, వడ్ల నూర్పిళ్లప్పుడు ఉదయం నుండి ఇంటికి పంట చేరే వరకూ దగ్గరుండి చిన్న చిన్న పనులు చెయ్యడం, వడ్ల పురుల కోసం తాళ్లు పేనడం, పురి బద్దెలు చుట్టడం ఇలా వ్యవసాయంలో అన్ని పనులూ చేశాను.
కొండయ్య అని ఓ పని అతను ఉండే వారు. అప్పుడప్పుడు మేం పొలంలో ఉండగా అటు వస్తే మా తాతయ్య, తను కబుర్లు చెప్పుకునే వాళ్లు. ఎప్పుడైనా సరిగా పనిచెయ్యకపోతే.. “నువ్వు చదువుకోకపోతే ఇదే పనిచేయాలి. నేర్చుకో” అని సున్నితంగా హెచ్చరించే వాడు మా తాతయ్య. నాకు పొలంలో ఆకుపచ్చ రంగులో ఉండే పసిరిక పాములంటే భయం, ఉండలుగా చుట్టుకుని ఉండే పురుగులంటే ఒళ్లు జలదరిస్తుంది. ఆ రెండింటినీ తప్పించుకోవడానికే చచ్చినా పొలం చెయ్యకూడదు అనుకునే వాడిని.
మా తాతయ్య, అమ్మమ్మలు మాకు దేవుళ్లు లాంటి వాళ్లు. వాళ్లు బ్రతికి ఉండగా, నాకూ సరైన ఊహ తెలీకపోవడం వల్ల వారి విలువ పూర్తిగా తెలీలేదు గానీ నేను జీవితాన్నీ, కష్టాన్నీ, అనుకున్న పనిని ఎంత చిత్తశుద్ధిగా చేయాలో వారి నుండి నేర్చుకున్నాను. ఇప్పటికీ ఏరోజూ విశ్రమించకుండా, “నాకు మూడ్ బాలేదు, నాకు ఆరోగ్యం బాలేదు” అని సాకులు చెప్పకుండా పనిచేస్తున్నానంటే వారే స్పూర్ఫి. వారు పడిన కష్టం ముందు మనదెంత! ఎండాకాలం వస్తే ఇంట్లో ఫ్యాన్ కూడా లేకుండా ఎర్రటి అగ్గికి చెమటలు దిగగారిపోతుంటే అలాగే గడిపేవాళ్లం. ఇప్పుడు ఏసీలు ఉన్నా తృప్తి లేదు మనకి!
నా పదేళ్లప్పుడు మిత్రుడు నరేష్‌తో షటిల్ ఆడుతుంటే, నరేష్ వాళ్ల తాతయ్య కోటేశ్వరరావు గారు పిలిచి,
“ఈయనెవరో నీకు తెలుసారా” అని అడిగాడు.
ఓ కొత్త వ్యక్తి కన్పించారు. ఆయన్ని ఎప్పుడూ చూడలేదు.
“తెలీదు” అన్నాను.”
“ఈయన మీ నాన్న” అన్నారు.
నాకెలాంటి ప్రత్యేకమైన భావనా కలగలేదు. కారణం నాకు తాతయ్యే ప్రపంచం అవడం వల్ల!
ఆయన దగ్గరకు తీసుకుని “బాగా చదువుతున్నావా” అన్నారు. “ఊ” కొట్టి కొద్దిసేపుండి మళ్లీ వెళ్లి ఆడుకున్నాను. అప్పుడు చూడడం తర్వాత మళ్లీ నేను డిగ్రీ పూర్తి చేసే వరకూ ఆయన్ని నేను చూడలేదు.
ఇక్కడ ఓ విషయం స్పష్టంగా చెప్పాలి. ఇదంతా చదివాక మా నాన్న మీద, నా కుటుంబ పరిస్థితుల మీద ఎవరైనా తప్పుగా భావిస్తే దయచేసి అలా అలోచించకండి. ఏ మనిషైనా ఒక సందర్భంలో ఒకలా ప్రవర్తించడానికి వారికుండే అభిప్రాయాలూ, ఆలోచనలు వారికుంటాయి. ఆయన జీవితం అది, ఆయన జీవితంపై ఆయనకి పూర్తి ఛాయిస్ ఉంది. ఈ విషయం ఇంత స్పష్టంగా కాకపోయినా, ఆ వయస్సుకి తగ్గట్లు నా చిన్నప్పుడే అర్థమైంది. అందువల్ల ఆయనపై ఎలాంటి ద్వేషం లేదు, అలాగే ప్రత్యేకమైన మమకారం లేదు. ఓ ప్రేక్షకుడిలా మనుషుల్ని చూడడం అప్పటి నుండే అలవాటైంది. ఇప్పటికీ నా దృష్టిలో నా జీవితంలో ఉన్న ఏ వ్యక్తీ గొప్పా కాదు, తక్కువా కాదు. జీవితంలో ఫార్ములాలు అలా సెట్ అయి ఉంటాయంతే. ఉన్నదాన్ని అంగీకరించి ముందకు సాగడమే.
మరింత వివరంగా మరో పోస్టులో రాస్తాను.
- Sridhar Nallamothu