మన పనులు భూతద్ధంలో గమనించబడతాయి..
మన మాటలు వ్యంగ్యపు పెదవి విరుపులకు బలవుతాయి..
మన చేతలు సంకుచిత మనస్థత్వాలచే కలతచెంది స్థబ్ధంగా అయిపోనూవచ్చు..
మనం ఎవరికీ శత్రువులం కాదు.. అది మనకు తెలుసు.. కానీ మన కష్టంతో ఏదైనా సాధిస్తున్నామంటే.. కష్టపడడం నచ్చనివాడు మనకు శత్రువుగానే మారతాడు.. పాపం పూర్ ఫెలో!
తాము ఒప్పుకోపోవడాన్నే మానసికంగా మన ఎదుగుదలకి అడ్డుపుల్లగా కూడా వెయ్యజూస్తారు. "మీరేంటి ఒప్పుకునేది నా దారి రాదారి" అని ధిక్కరించి మరీ దర్జాగా వెళ్తుంటే గాయపడతారు.. గాయపరచజూస్తారు.. చివరకు అస్త్రసన్యాసం చేసి ఓ మూలకు ఇరుక్కుపోయి అసూయపడతారు.
ఓ చిన్న ప్రపంచంలో బ్రతికే మనుషులతో ఫైట్ చేయడానికే మనం అష్టకష్టాలూ పడితే పెద్ద లక్ష్యాలనెలా సాధించగలుగుతాం?
మన లక్ష్యం పెద్దది.. మన శ్రమ కొండని పిండి చెయ్యగలిగేది.. మన పట్టుదల సముద్రానికి ఎదురీదగలిగేది.. ఇంకేంటి.. ఆఫ్టరాల్ ఒట్టి మామూలు మనుషులు మనల్ని చేయగలిగేది?
నేను ఎప్పుడూ చెప్పేదే.. ఉన్నది ఒక్కటే జీవితం.. లక్ష్యాల పట్లా, మనుషుల పట్లా, సమాజం పట్లా భయంతో బిక్కుబిక్కుమంటూ బ్రతకాలా.. అనుకున్నదేదో చిత్తశుద్ధిగా చేస్తూ దర్జాగా బ్రతకాలా అన్నది మన స్వంత నిర్ణయం. ఏ నిర్ణయమూ తీసుకోకుండా కాలక్షేపం చేసినా రోజులు గడుస్తాయే తప్ప బ్రతుకులో అండర్లైన్ ఏమీ గీయబడదు.
మనం చేసే పనీ, మాట్లాడే మాటా, రాసే రాతా, చేసే ఆలోచనా.. స్వేచ్ఛగా చేయగలుగుతున్నామా? స్వేచ్ఛ లేని పనిలో ఎంత కృత్రిమత్వం ఉంటుందో ఆలోచించండి.
ఒక మాట మాట్లాడాలంటే ఎవరేం అనుకుంటారో అన్న భయం.. ఎవరూ ఏమీ అనుకోకూడదని నోరు మూసుకుని "మనకు మాటలు వచ్చు" అన్న విషయం కూడా మర్చిపోయి బ్రతికే వాళ్లెందరో 🙁
ఒక పని చేద్దామంటే.. ఎంతమంది అడ్డుపుల్లలు వేస్తారోనన్న భయాలే.. ఆ అడ్డుపుల్లల్ని మన పట్టుదలతో ఫెటీల్మని అవతలి వాళ్ల మొహాలపైకి తిరిగి కొట్టలేని అశక్తులమైతే.. మనకు లక్ష్యాలెందుకు? ఆ పుల్లల మధ్య ఇరుక్కుని బ్రతుకు వెళ్లదీద్దాం.
అవతలి వాడు భగవంతుడి కన్నా గొప్పవాడైనా లెక్క చెయ్యనక్కర్లేదు.. మనం చేసే పనిని నిజాయితీగా చేసుకుంటూ వెళితే.
మన చుట్టూ చాలా అందమైన మొహాలున్నాయి… వాటిలో చాలా కుళ్లిపోయిన మనస్సులు కాటువేయడానికి ఎప్పుడూ సిద్ధంగానే ఉంటాయి.
నాకైతే ఏమనిపిస్తుందో తెలుసా.. వికృత మనస్థత్వాల్ని చూసి భయపడినంతకాలమే అవి మనల్ని భయపెట్టజూసేది. రొమ్ము విరుచుకుని ఎదురు నిలిస్తే గమ్మున తోకముడుచుకుని పారిపోతాయవి! వాటికా మనం జీవితాల్ని త్యాగం చేస్తున్నది?
మన లక్ష్యాలకు ఏ అడ్డంకులూ రాకపోతే ఆశ్చర్యపడాలి గానీ.. అడ్డంకులు వస్తే నీరసపడమేమిటి.. స్టుపిడిటీ కాకపోతే!!
అడుగు ముందుకు వేయనీయకుండా నాగార్జున సిమెంట్‌తో గోడలు కట్టనీయండి.. ఉన్న అడుగు జాగాలోనే లక్ష్యాలు సాధించే నేర్పరితనం సాధించడంలో మజానే వేరు కదా! 🙂 🙂 🙂
గమనిక: ఇది ఎవరికైనా పనికొస్తుందనిపిస్తే ఇతరులతో షేర్ చేసుకోగలరు.
ధన్యవాదాలు
– నల్లమోతు శ్రీధర్
ఎడిటర్
కంప్యూటర్ ఎరా తెలుగు మేగజైన్
Leave a Reply