ఒక వ్యక్తి ఉంటాడు.. వేదాలు, పురాణాలు అన్నీ కంఠతా వచ్చి ఉంటాడు. గంటల తరబడి ఉపన్యాసాలు ఇవ్వగలుగుతాడు. మరో వ్యక్తి ఉంటాడు.. ప్రపంచంలో ఉన్న పెద్ద పెద్ద Self Help బుక్స్, ట్రైనింగ్ సెషన్లకి అటెండ్ అయి ఉంటాడు. సో ప్రతీ కాన్సెప్ట్ అతనికి తెలిసి ఉంటుంది.
బట్ ఆ కాన్సెప్టులు మన జీవితానికి ఉపయోగ పడడంలో చాలాసార్లు ఫెయిల్ అవుతాయి. కారణం “అవి కాన్సెప్టులు మాత్రమే” అవడం వల్ల!
కారు టైర్ పంక్చర్ అయింది అనుకోండి. వెంటనే గుర్తొచ్చే విషయం ఏంటి.. డిక్కీలో స్టెప్నీ తీసి, జాకీ తీసి మార్చాలని! సో ఒక సమస్య ఏర్పడ్డప్పుడు మనకు దానికి సంబంధించిన టూల్స్, పరిష్కారం వాటంతట అవే గుర్తొస్తాయి. ఇది లౌకిక జ్ఞానం. బానే వర్కవుట్ అవుతుంది. బట్ మనం ఎక్కడ ఫెయిల్ అవుతామంటే ఆత్మ జ్ఞానాని కూడా ఇలాగే కాన్సెప్టులు తీసుకొచ్చి అతికించాలని ప్రయత్నిస్తాం. ఫలానా సమస్య వస్తే, ఫలానా బుక్‌లోనో, ఫలానా ఆయన చెప్పిన పరిష్కారం గుర్తు తెచ్చుకుందామని మనం మెమరీ డేటాబేస్‌లో నుండి వెదికి అలా గతంలో ఎక్కడో చదివిన, విన్న కాన్సెప్ట్‌ని తీసుకొచ్చి ఇప్పుడున్న పరిస్థితికి అతికించడానికి ప్రయత్నిస్తాం. కానీ అది అతకదు.
“అందర్నీ ప్రేమించమని” చిన్నప్పటి నుండి చదువుకున్నాను. మీరూ చదువుకుని ఉంటారు. కానీ మహా అయితే ఏదో అవసరంలో ఉంటే చిన్న సాయం ఏదో చేస్తాం గానీ స్వంత మనుషుల పట్ల వచ్చినంత ప్రేమ లోపలి నుండి తన్నుకు రాదు. ఎందుకంటే మనకు కాన్సెప్ట్ మాత్రమే తెలుసు. కాన్సెప్టులు లాజికల్ మైండ్‌కి సంబంధించినవి. ఒక కాన్సెప్ట్‌ని చదివేటప్పుడే “ఇది ఎలా సాధ్యం, మరి నాకు హాని చేసే వాళ్లని కూడా నేనెలా ప్రేమించగలను, అందర్నీ ప్రేమిస్తూ పోతే ఈ ప్రపంచంలో బ్రతకడం కష్టం” వంటి వంద లాజిక్‌లు, అభిప్రాయాలను మన మైండ్ ఏర్పరుస్తుంది.
సో ఇప్పుడేం జరిగింది.. “అందర్నీ ప్రేమించాలి” అనే ఓ గ్రంధంలోని కాన్సెప్ట్ చదివారు, లేదా గరికపాటి గారో, చాగంటి గారో చెప్పిన ప్రవచనం విన్నారు. విన్నంత సేపు హాయిగా ఉంది. తర్వాత ఇంప్లిమెంటేషన్‌కి వచ్చేసరికి “అందర్నీ ప్రేమిస్తూ పోతే నేను ఇంకా బ్రతికినట్లే” అని మీ లాజికల్ మైండ్ ఆ కాన్సెప్ట్ చుట్టూ ఓ నెగిటివ్ ఎమోషన్ అసోసియేట్ చేస్తుంది. సో అలా ప్రీఫ్రాంటల్ కార్టక్స్ స్థాయిలో లాజికల్ మైండ్‌తో ఫిల్టర్ పెట్టుకున్నాక అది లోతుగా సబ్ కాన్షియస్లోకి రిజిస్టర్ అవదు. మీ కాన్షియస్ మైండ్ ఇష్టపడని కాన్సెప్ట్‌ని మీ సబ్ కాన్షియస్ కన్విన్స్ అవదు. సో అది ఇక దాన్ని ఎగ్జిక్యూట్ చెయ్యడానికి వెనుకాడుతుంది. మనుషులు కనిపిస్తే ప్రేమగా నవ్వడానికి కూడా పెదాలు విప్పారవు. సో కాన్సెప్టువల్ నాలెడ్జ్ మన కాన్షియస్ మైండ్చే ఫిల్టర్ చెయ్యబడుతుంది, పోస్ట్ మార్టం చెయ్యబడుతుంది. అది లోపలికి వెళ్లడానికి వ్యక్తికి తన పట్ల తనకు చాలా అవగాహన, సబ్ కాన్షియస్ని కన్విన్స్ చేసే నేర్పూ కావాలి.
అలాగే కాన్సెప్ట్ అనేది వెర్బల్‌గా చదువుకునేది, మనకు మనం సెల్ఫ్ టాక్‌లో మళ్లీ మళ్లీ చెప్పుకునేది. సో దానికి ఎమోషనల్ అసోసియేషన్ లేనంత కాలం అది వర్కవుట్ అవదు. ఉదా.కి.. బిర్యానీ అనే పదం పలకగానే అది గుర్తొచ్చి, దాని చుట్టూ మీకున్న ఇష్టం, అసోసియేషన్ బ్రెయిన్లోని న్యూరల్ నెట్‌వర్క్స్‌లో ఫైరింగ్ జరిగి వెలికి తీయబడ్డప్పుడు మాత్రమే బిర్యానీ అనే పదం వెనక్కెళ్లిపోయి దానితో అసోసియేట్ అయిన ఎమోషన్ డామినేటెడ్ పొజిషన్లోకి వస్తుంది. లేదంటే రోజుకు వందసార్లు బిర్యానీ అని జపం చేసినా ఎలాంటి ఫీలింగ్, ఎమోషన్ కలగదు.
సరిగ్గా అలాగే “అందర్నీ ప్రేమించు” అని ఎక్కడైనా చదువుకున్నది గుర్తొస్తే అది వెర్బల్ కమ్యూనికేషన్ మాత్రమే. దానితోపాటు అందరితో ప్రేమగా ఉన్నప్పుడు కలిగే ఎమోషన్, ఫీలింగ్, మొహంలో ఓ గ్రేస్ కొట్టొచ్చినట్లు రాకపోతే ఆ పదాన్ని వాట్సప్‌లో కొటేషన్లలో షేర్ చేసుకున్నా, రోజూ జపం చేసినా నాలిక గీసుకోవడానికి కూడా పనికిరాదు.
నేను రెండు రోజుల క్రితం అప్రయత్నంగా హార్ట్ చక్ర (అనాహత చక్ర) యాక్టివేట్ అయ్యాక ఇలా వెర్బల్ నాలెడ్జ్‌తో సంబంధం లేకుండా ప్రతీ దానిపట్లా అవ్యాజ్యమైన ప్రేమ, విశ్వంలో ఒక వస్తువు మొదలు ప్రతీ జీవి పట్ల ఓ కొత్త డైమెన్షన్, perception మొదలైంది. ఆ స్థితికి చేరుకోవడానికి సాధన చేసి నిజమైన అనుభూతులు స్వంతం చేసుకోవాలి. కాన్సెప్టులు మేధస్సుని ప్రదర్శించుకోవడానికి ఉపయోగపడతాయి తప్పించి, ఎక్కడైనా అనర్గళంగా గంటలు గంటలు స్పీచ్ ఇవ్వడానికి ఉపకరిస్తాయి తప్పించి.. నీటిలోకి ఏ రెసిస్టెన్స్ లేకుండా దిగినంత స్వేచ్ఛగా, అనుభూతిలో మునిగిపోవాలి. అదే నిజమైన అనుభవం.
- Sridhar Nallamothu