నాకు నేనే అర్థం కాని నన్ను చూసి ఈ ప్రపంచం నేను అర్థమైపోయానని సంబరపడిపోతుంటే పిచ్చిగా నవ్వడం తప్ప ఏం చేయగలను..
నా పరమార్థాన్ని అన్వేషించడంలో భౌతిక స్పృహకి దూరంగా గడిపే నా అంతరంగానికి.. యాంత్రికంగా చేసే నా భౌతిక క్రియలు అర్థం పర్థం లేని గొప్పదనాల్నీ, అపార్థాల్నీ ఆపాదిస్తుంటే అవి నా మనస్సుకెప్పుడు చేరేను?
ఈ శరీరమూ, ఈ ఆలోచనలూ, ఈ మాటలూ, చేతలూ.. ఇవే నా సంపూర్ణ స్వరూపంగా భావింపబడే ఈ లౌకిక ప్రపంచంలో నిరంతరం ఆత్మసాక్షాత్కారానికై జ్వలించే నా వాస్తవతత్వం ఎప్పటికి ప్రతిఫలించేను?
సమాజం పట్లా, మనుషుల పట్లా, విలువల పట్లా నేను వ్యక్తపరిచే ఏ బాధా నన్ను ఇసుమంతైనా బాధించదని… ఆ దశలన్నీ దాటిపోయానని.. నా విద్యుక్తధర్మం కొద్దీ నాదైన సౌఖర్యవంతమైన ప్రపంచంలో ప్రశాంతంగా గడుపుతూనే మనస్సుకి పట్టని ఆవేశాలు వెళ్లగక్కుతున్నానని అర్థమయ్యే జీవులు ఈ భూప్రపంచంలో ఎవరైనా ఉన్నారో లేదో! 🙂
మనస్సుని సత్యం వైపూ, జీవిత గమ్యం వైపూ ప్రయాణింపజేస్తూ చేతల్ని కృత్రిమపు పనుల్లో ముడిపెట్టి సాగించడం ఎంత సరదా అయిన అనుభూతో.
చేతలకు అంటుకునే పూలెన్నో, గుచ్చుకునే ముళ్లెన్నో! పాపం అవన్నీ నా మనస్సుని చెల్లాచెదురు చేయప్రయత్నిస్తుంటే.. అదంతా వ్యర్థ ప్రయత్నమని అర్థమవుతూ పెదాల చివర అరక్షణం కదలాడే నవ్వుని తలుచుకుంటే ఇంకా నవ్వొస్తోంది.
లౌకిక విషయాల్ని మోస్తూనే అలౌకిక ప్రపంచంలో మునిగితేలే అదృష్టం లభించడం ఏ జన్మసుకృతమో!!
– నల్లమోతు శ్రీధర్
శ్రీధర్ గారు, చాల అద్భుతంగా రాస్తున్నారు. ధన్యవాదాలు. కొన్ని విషయాలు బుర్రకి ఎక్కట్లేదు కానీ ఏదో ఒకరోజు చిక్కుముడి విడిపోయి స్పష్టంగా అర్థం అవుతుందనే నమ్మకం ఉంది.(like connecting the dots). so please continue writing.