ఆరుబయట నవ్వారు మంచం వేసుకుని పడుకునే వాళ్లం. ఆ పక్కింట్లోనూ, ఈ పక్కింట్లోనూ సేమ్ సీన్.. మా కబుర్లతో పాటు వాళ్లవీ వీళ్లవీ కబుర్లు కూడా విన్పిస్తుండేవి.. మధ్యలో వాళ్ల కబుర్లలోకి మేమూ, మా కబుర్లలోకి వాళ్లూ కాస్త గొంతు పెంచి దూరిపోయే వాళ్లు.
అలా పడుకుని తలెత్తి ఆకాశంలోకి చూస్తే.. ఓ kite షేప్‌లో వరుసగా నక్షత్రాలు.. వాటిలో tailలో మిడిల్లో ఓ నక్షత్రం చాలా బ్రైట్‌గా వెలిగిపోతుంటుంది.. సరిగ్గా ఆ మధ్యలో నక్షత్రం క్రింద మిణుకుమిణుకుమనే చిన్న నక్షత్రాత్నే అరుంధతి నక్షత్రమంటారట.. ఆ సీక్రెట్ తెలిశాక బయట పడుకున్న ప్రతీసారీ కోట్ల నక్షత్రాల్లో దాన్ని వెదుకులాడుకుని ఒక్క క్షణం కళ్లతో దానికి కమ్యూనికేషన్ పంపించకపోతే మనస్సు స్థిమితంగా ఉండేది కాదు. దాన్ని వెదుక్కోవడానికి పెద్ద కష్టమేమీ అయ్యేది కాదు, తూర్పు వైపు తలపెట్టుకుని పడుకుంటే.. నాకు కుడి వైపే kite పలకరించేది. ఇక kite కన్పిస్తే నక్షత్రం పట్టుకోవడం ఎంత పని 🙂
అలా చిన్నప్పుడే అరుంధతిని పలకరించాను. నక్షత్రాలు లెక్కపెట్టకూడదని చెప్పేవాళ్లు. పంతం కొద్దీ కొన్నింటిని లెక్కేసి ఎక్కడ మొదలెట్టానో, ఎక్కడ వరకూ చేరుకున్నానో అర్థం కాక మళ్లీ కాసేపు ఆపేసి మరో attempt చేసేవాడిని. పొలంలో పడుకోవాల్సి వచ్చినప్పుడు ఇంటి నుండి పొలానికి వెన్నెల్లో నడిచి వెళ్లడం అనిర్వచనీయమైన అనుభూతి. అమావాస్యప్పుడు ఆమావాస్య చుట్టూ అల్లబడిన చేతబడి కధలు వినీ, మా పొలానికి ముందే ఉండే స్మశానంలోంచి ఆ కటిక చీకటిలో నడిచి వెళ్లడమూ మరో extreme. చిన్న టార్చ్ లైట్ పట్టుకుని మా తాతయ్య ముందు నడుస్తుంటే స్మశానంలో ఉన్న నల్లటి తాటిచెట్లని చూసి జడుసుకుంటూ మధ్య మధ్యలో కళ్లు మూసుకుంటూ గుడ్డిగా నడవడం తలుచుకుంటే ఇప్పుడు నవ్వాగదు.
చంద్రుడంటే నాకు ఇష్టం. నా చేతికి కెమెరా వచ్చాక పున్నమి నాటి నిండు చంద్రుడుని ఎన్ని ఫొటోలు తీశానో లెక్కే లేదు. టెర్రాస్‌పైకి tripodని తీసుకెళ్లి కెమెరాని దానికి బిగించి మోకాళ్లపై అలాగే వంగి కూర్చుకుని చంద్రుడూ, చంద్రుడు చుట్టూ కదలాడే మబ్బుల్నీ ఓ పెయింటింగ్ మాదిరిగా కేప్చర్ చెయ్యాలని విశ్వప్రయత్నం చేసి చాలాసార్లు సక్సెస్ అయ్యాను కూడా. నా ఆల్బమ్‌లలో వాటిని చూడొచ్చు.
ఆరుబయట నిద్రపోయేటప్పుడు మధ్యలో మెలకువొస్తే టైమెంతో తెలియడానికి వాచ్ ఉండేది కాదు. ఓసారి ఆకాశంలోకి చూసి చంద్రుడు ఏ వైపు ఎంత క్రిందకి వెళ్లిపోయాడో ఓసారి చూసేస్తే టైమెంతయ్యిందో, ఇంకెంతసేపు పడుకోవచ్చో తెలిసేది. ఇలాంటివి చెయ్యొచ్చని ఇప్పుడు చాలామందికి తెలీదనుకోండి. నా చిన్నప్పుడు కొన్నేళ్ల పాటు ఇలా చందమామతో స్నేహం చేసిన నేను ఈరోజు ఫొటోల కోసం తప్పించి బయటకు కదల్లేనంత బిజీ.. దీన్ని బిజీ అంటారో ప్రకృతితో అటాచ్మెంట్ తగ్గిపోవడం అంటారో నాకూ తెలీదు, నాకు చెప్పేవారూ ఎవరూ లేరు!!
– నల్లమోతు శ్రీధర్
Leave a Reply