అది టైలర్ షాప్.. అందులో extra వర్కర్ లేక ఎప్పుడూ ఓ మెషీన్ ఖాళీగా ఉండేది.. బాపట్ల షరాఫ్ బజార్లో (ఇప్పుడు అది ఫ్లై ఓవర్‌గా మారిపోయిందనుకోండి) ఉండేదా షాప్..
ఆ ఖాళీగా ఉన్న మెషీన్ మీద కూర్చుని.. దాని సర్ఫేస్నే writing padగా చేసుకుని రాసుకుంటూ ఉండే వాడిని. బాపట్లలో కాలేజ్ పూర్తయ్యాక మా చెరువు జమ్ములపాలెం ఊరికి వెళ్లాలంటే దాదాపు గంట బస్ కోసం వెయిట్ చేయాలి. అలా వెయిట్ చేసే క్రమంలో ఆ టైలర్ షాపూ, దాని ఓనరూ, అక్కడి వర్కర్స్ పరిచయం అయ్యారు. సో అది నా అడ్డాగా మారింది.
రాసుకునేది క్లాస్‌కి సంబంధించిన విషయాలా అంటే కానే కాదు. రకరకాల ఆర్టికల్స్.. సమాజంలో చుట్టూ చూస్తున్న పరిస్థితులపై అప్పటి అవగాహన మేరకు తప్పు ఒప్పులతో మనస్సులోకి ఆలోచనలు అక్షరరూపం ఇచ్చే యగ్నం అన్నమాట అది. బుక్‌స్టాల్స్‌లో విచ్చలవిడిగా బుక్స్ కొనడం నాకు అలవాటు. అలా అప్పట్లో కొత్తగా వచ్చి నచ్చిన మేగజైన్ క్రేజీ వరల్డ్. దాన్ని తిరగేస్తుంటే.. “స్టూడెంట్ రిపోర్టర్లు కావాలి.. మీకు తోచినది మీ స్వంత వాక్యాల్లో రాసి పంపండి.. మేము ప్రచురిస్తాం” అనే చిన్న బాక్స్ ఎడిటర్‌గా ఉన్న జయా మేడమ్ రాశారు. సరే ట్రై చేద్దామని ఆ టైలర్ షాపులో మెషీన్ టేబుల్ మీద ఖాళీ టైమ్‌లో కూర్చుని రాసేవాడిని. అలా రాసేటప్పుడు “నేను పత్రిక కోసం పంపిస్తున్నానన్న” అదనపు శ్రద్ధతో రేనాల్డ్స్ పెన్నుని పొందికగా వంపులు తిప్పుతూ చేతనైనంత అందంగా రాసే ప్రయత్నం తలుచుకుంటే ఇప్పుడు నవ్వొస్తుంది. నేను రాసి పంపినవి చాలా పబ్లిష్ చేశారు. నా పేరు ప్రింట్లో చూసుకుని మురిసిపోయేవాడివి. తెలిసిన వారికీ గర్వంగా చూపించే వాడిని.
ఆ తర్వాత చదువు పూర్తయి అకౌంటెంట్‌గా ఏదో చిన్న ఉద్యోగం కోసం కర్నూలు వెళ్లాల్సి వచ్చింది. అక్కడా ఆపకుండా రాసి పంపే వాడిని. అలాంటిది ఓరోజు పోస్ట్ వచ్చింది.. జయా మేడమ్ నుండి పర్సనల్‌గా లెటర్. “మీరు చాలా బాగా రాస్తున్నారు.. మా పత్రికలో సబ్-ఎడిటర్ పోస్ట్ ఖాళీగా ఉంది. ఆసక్తి ఉంటే చెన్నై వచ్చి జాయిన్ కావచ్చు” అని సారాంశం. ICWAI చేసినా.. అకౌంటెంట్‌గా నా మొదటి ఉద్యోగమే చిరాకు వచ్చేసి.. మెడికల్ రిప్రజంటేటివ్ ఇంటర్వ్యూలకు కూడా ఒకటి రెండు కంపెనీలకు అదే కర్నూలులో అటెండ్ అయిన టైమ్‌లో ఈ లెటర్ కొంత ఊరట. సరే ఏదైతే అదయిందని చెన్నై వెళ్లాను. జయా మేడమ్ నెలకు రూ. 1500 ఇస్తానన్నారు. అసలు ఈ ఫిగర్ వింటే ఇప్పుడే కాదు, అప్పుడు కూడా ఎవరూ వర్క్ చెయ్యరు. కానీ నాకు ఇష్టమైన జర్నలిజం ఫీల్డ్. నెలకు రూ. 2000లకు ఫైనల్ అయింది.
చెన్నైలో జాయిన్ అయ్యాక క్రేజీవరల్డ్ పత్రిక పూర్తి బాధ్యతలు నాకు అప్పగించేశారు. దాంతో పాటు సూపర్ హిట్ ఫిల్మ్ మేగజైన్ సబ్-ఎడిటర్‌గానూ బాధ్యత. ఊటీ, కొడైకెనాల్, వైజాగ్, కేరళ వంటి ఔట్ డోర్లతో పాటు, చెన్నైలోని కోదండపాణి స్టూడియో వంటి చోట్ల రికార్డింగులకూ, హిట్లర్, పెద్దన్నయ్య, అన్నమయ్య వంటి పలు సినిమాలకు ఆయా హీరోలు, ఆర్టిస్టులతో కలిసి సక్సెస్ టూర్లకి వెళ్లడమూ జరుగుతుండేది. బాలకృష్ణ గారికి నేనంటే ప్రత్యేకమైన అభిమానం. సో బాలయ్య ఔట్ డోర్లు, ఇంటర్వ్యూలు తనకి కుదరకపోతే నాకే అప్పజెప్పేవారు బి.ఎ. రాజు గారు. (ప్రతీ సినిమా టైటిల్స్ లో PROగా మా రాజు గారిని మీరు చూడొచ్చు)
——————-
నాకు చక్కని తెలుగు భాష తెలుసు గానీ దాన్ని వ్యక్తపరచడం తెలిసేది కాదు. చెన్నైలో మా ఆఫీస్‌లో పైన రూమ్‌లో ఉన్నాను కొన్నాళ్లు. ఈనాడు, జ్యోతి వంటి పేపర్లు ముందేసుకుని వాటిలోని ఎడిటోరియల్స్‌లో వాడబడిన పదాలను ఓ డిక్షనరీగా రాసుకుని.. సందర్భానుసారం ఆ పదాలను వాడుతూ.. ఒక భావాన్ని రకరకాల వాక్యనిర్మాణంలో వ్యక్తపరచడం ప్రాక్టీస్ చేసేవాడిని. ఒకే భావాన్ని కొన్నిసార్లు 20-30 స్టైల్స్‌లో రాసి ఏది ఎక్కువ expressiveగా ఉందో క్రాస్ ఛెక్ చేసుకునే వాడిని. అలా అలవడిందే నా రైటింగ్ స్టైల్.
వాస్తవానికి ఇలాంటి ప్రాక్టీస్ అప్పుడే కొత్త కాదు.. నా డిగ్రీ చదివే రోజుల్లో కొన్నాళ్లు బాపట్లలో ఒక రూమ్‌లో ఉండే వాడిని. అప్పుడు ఓ డైరీ కొన్నాను.. ఆ డైరీ క్రింద ప్రతీ పేజీలో ఒక కొటేషన్ ఉండేది. సో ఓ టార్గెట్ పెట్టుకున్నా.. అందరూ డైరీ డైలీ ఏక్టివిటీలు, ఫీలింగ్స్ నోట్ చేసుకోవడానికి మెయింటైన్ చేస్తారు. బట్ నేను ప్రతీ పేజీ క్రింద ఉన్న కొటేషన్‌ని ఆధారంగా చేసుకుని నాకు చేతనైన ఆలోచనలతో ఆ పేజీలో వ్యాసం రాయాలన్నది నా ప్రాక్టీస్. అలా ఓ ఇయర్ డైరీ పూర్తి చేశాను. చెప్పుకుంటూ పోతే ఇలాంటి పలు అనుభవాలు ఉన్నాయి. ఇలాంటి రకరకాల అనుభవాలను అక్షరబద్ధం చెయ్యాలన్న తలంపుతో ఈ సిరీస్ అందిస్తున్నాను.
– నల్లమోతు శ్రీధర్
Leave a Reply