మనలో ప్రతీ ఒక్కరి జీవితాన్నీ చిన్నప్పటి నుండి చనిపోయే వరకూ వందల మంది ప్రభావితం చేస్తారు, స్ఫూర్తి నింపుతారు. ఏ ఒక్క వ్యక్తిని మర్చిపోయినా మనం మనిషిగా బ్రతకడానికి అర్హత లేనట్లే భావిస్తాను నేను. నా జీవితాన్ని తీర్చిదిద్దిన ఎందరో శిల్పుల పేర్లను కొన్నింటిని గతంలో రాశాను. అప్పట్లో వారి పేర్లని ఓ జాబితాగా మాత్రమే రాయగలిగాను. కానీ వారందరి నుండీ నేను నేర్చుకున్న, నేర్చుకుంటున్న క్వాలిటీస్ ఎన్నో ఉన్నాయి.. అలాగే ప్రతీ వ్యక్తి గురించీ నా మనస్సులో ఎంతో అటాచ్మెంట్ నిక్షిప్తమై ఉంది. దానికి అక్షరరూపం ఇవ్వాలన్న ఆలోచనతో ఈ సిరీస్ మొదలుపెడుతున్నాను. వీలున్నప్పుడల్లా నా జీవితాన్ని ప్రభావితం చేసిన వ్యక్తుల గురించి పంచుకుంటాను.
తాతయ్య (కొమ్మినేని సుబ్బయ్య):
ఎవరైనా మొదట తల్లిదండ్రుల గురించి చెప్పుకుంటారు. అమ్మ గురించి చాలానే చెప్పాలి, అమ్మ సుమతీదేవికి నా లైఫ్ లో చాలా ప్రాధాన్యత ఉంది, ఆవిడ నాకు దేవత లాంటిది. నాన్న గురించీ చెప్తాను.. కాకపోతే అంత ప్రాధాన్యమైన వ్యక్తి కాదు.
నాకు ఊహ తెలిశాక.. నాకంటూ కళ్లెదురు గుర్తున్నది అమ్మా, తాతయ్య, అమ్మమ్మా.. మాత్రమే! ఎక్కడికెళ్లినా తాతయ్య వెంటే ఉండేవాడిని. అప్పటికే ఆయనకు 55 ఏళ్లకు పైబడి ఉన్నాయి. కష్టపడడం అంటే ఆయన్ని చూసి నేర్చుకోవాలి. ఈరోజు నేనెప్పుడైనా తెగ కష్టపడిపోతున్నానన్న ఫీలింగ్ వచ్చినప్పుడల్లా ఆయన నాకన్నా వందల రెట్లు పడిన కష్టాన్ని గుర్తు తెచ్చుకుని మళ్లీ డెడికేటెడ్‌గా మారిపోతుంటాను.
నా స్కూల్ ఫ్రెండ్స్ చాలామంది వాళ్ల నాన్నల గురించి చెప్తూ.. “మా నాన్న అలా తెలుసా.. ఇలా తెలుసా” అంటుంటే అసలు ఈ నాన్న అనే పదం ఏమిటో అర్థం కాక చాలా ఏళ్లు కన్ప్యూజన్లో బ్రతికాను.. నాకంటూ ఏ కష్టం తెలీకుండా.. నేను ఏడిస్తే తను దిగులు పడే వ్యక్తి అంటూ మగాళ్లలో ఎవరైనా ఉన్నారూ.. అంటే అదీ తాతయ్యే. “ఐ లవ్ యూ తాతయ్యా..” కళ్లమ్మట నీళ్లతో రాస్తున్నా ఈ మాటలు.
భగవంతుడు నాకంటూ ఓ సంస్కారాన్ని, విజ్ఞతని ఇచ్చాడేమో గానీ ఆ సంస్కారం నా బాల్యంలో ఉపయోగపడేది కాదు.. నా బాల్యాన్ని ఏ కష్టమూ లేకుండా కాపాడింది నువ్వే. నాకంటూ ఓ జీవితం వచ్చేసరికి ఆ ఆనందాన్ని పంచుకోవడానికి నువ్వు లేవు… నువ్వు చనిపోతే నా బాగోగులు ఎవరు చూస్తారో తెలీక నువ్వెంత మధనపడే వాడివో.. నేను అప్రయోజకుడిని అవుతానేమోననీ, కొద్దిగా చదువూ, సంధ్యా తెలిసిన తల్లిదండ్రులు నాకు అందుబాటులో లేరని.. మిగతా పిల్లలతో నన్ను పోల్చకుని… నేను ఎలాగైనా బాగుండాలని.. నీకు తోచిన మాటల్లో.. “బాగా చదువుకో నాయనా” అని చెప్తుండే వాడివి. ఈరోజు నువ్వు ఏ లోకంలో ఉన్నా నా జీవితాన్ని నీ కాళ్ల ముందు పెడుతున్నా తాతయ్యా. ఇది నీ భిక్షే.
జీవితం బాగుండాలంటే ఏ వ్యక్తిత్వ వికాస పుస్తకాలూ, స్పీచ్‌లూ అవసరం లేదనీ.. నీలాంటి ఓ మనిషి ఇంట్లో ఉంటే చాలని ఊహ వచ్చాక అర్థమైంది తాతయ్యా. నువ్వూ, మీ ఫ్రెండ్స్ పొలం పనులన్నీ అయిపోయాక అరుగుల మీద కూర్చుని చెప్పుకునే ముచ్చట్ల నుండి మీకు తెలీకుండానే నేనెంతో లోకజ్ఞానం నేర్చుకున్నాను. నాకు ప్రధమ గురువు అంటూ ఎవరైనా ఉన్నారంటే మీరే!
పొద్దున్నే పొలం వెళ్లి… ఆ పక్కనే కాలువలో నీళ్లు తాగుతూ.. సాయంత్రం దాకా అన్నం తినీ తినకా మీరు పడిన కష్టం నా జీవితానికి ఎంత స్ఫూర్తి నింపిందో మీకు తెలీదు తాతయ్యా. నా బాల్యమంతా పొలంలో మీ వెంటే ఉండే భాగ్యం కలగడం ఎంత తీపి జ్ఞాపకమో! కాలువలకు కంతలు కట్టీ, కలుపు తీసీ, నారు పోసేటప్పుడు నారు కట్టలు అందించీ, ఎండాకాలం గేదెలకు గడ్డి మోసుకు వచ్చిన జ్ఞాపకాలు ఈరోజు నేను గడిపే ఏ లక్జరియస్ లైఫ్‌కీ సాటిరావు తాతయ్యా. నిజంగా మా జీవితాలు యాంత్రికమైపోయాయి. మేము యంత్రాల మధ్య బ్రతికేస్తున్నాం. మాకు పక్కన మనుషులంటూ కొందరున్నారన్న విషయమే తెలీట్లేదు. మేము మనుషులమే కాదు తాతయ్యా, మనుషులుగా ఎప్పుడో చచ్చిపోయాం.
పశువులకు గడ్డి కోసి నేను మోయలేనని చిన్న మూట నా తల మీదకు ఎత్తి పెట్టి.. ఇంకో మనిషి సాయం లేకుండానే నీకూ వల్ల కాని బరువైన అతి పెద్ద మూటని నీకు నువ్వు ఎంతో ప్రయాసతో ఎత్తుకోవడం ఇప్పటికీ మర్చిపోలేకుండా ఉన్నాను. నూర్పిళ్లప్పుడు పొలం కళ్లంలో మీతో కాపలా పడుకున్న రోజులూ అసలు జీవితం అంటూ నేను జీవించింది ఏదైనా ఉందీ అంటే నా బాల్యమే తాతయ్యా!
నీలాంటి వాళ్లు ఇప్పటి జెనరేషన్‌కి కావాలి తాతయ్యా.. నీలాంటి వాళ్లని చూస్తేనైనా జీవితం అంటే ఏమిటో మా అందరికీ మళ్లీ తెలిసొస్తుంది. కళ్లనీళ్లతో.. నీపై చెక్కుచెదరని ప్రేమతో, గౌరవంతో.. ఓ భగవంతునిగా నిన్ను భావిస్తూ.. సెలవు తీసుకుంటున్నాను తాతయ్యా 🙁
– నల్లమోతు శ్రీధర్
Leave a Reply