తెలుగులో టెక్నికల్ సాహిత్యాన్ని 1996లో మొదలుపెట్టిన మొదటి వ్యక్తిగా అప్పట్లో నా లక్ష్యం తెలుగు వారందరికీ టెక్నాలజీ పంచడమే ప్రధానంగా ఉండేది, ఇప్పటికీ అదే లక్ష్యం కొనసాగుతూ ఉంది.
టెక్నాలజీ శక్తి నాకు తెలుసు. అది జీవితాల్ని చాలా మెరుగుపరుస్తుంది, జ్ఞానాన్ని పెంపొదిస్తుంది అన్నది నాకు తెలుసు. అందుకే టెక్నాలజీ జనాలకు రీచ్ అవ్వాలనుకున్నాను.
———-
కానీ 2000-2002వ ప్రాంతంలో రాష్ట్రంలో టెక్నాలజీ ఉన్న ఫళంగా విస్ఫోటనం చెంది విస్తృతంగా వాడుకలోకి వచ్చాక.. సరైన మార్గనిర్దేశకత్వం కొరవడడం వల్ల అప్పటి నుండి ఇప్పటివరకూ టెక్నాలజీ దుర్వినియోగం చేయబడుతూనే ఉంది.
ప్రధానంగా నాకు అత్యంత ఇష్టమైన మానవ సంబంధాలు టెక్నాలజీ కారణంగా ఛిన్నాభిన్నం అవడం, వ్యక్తుల మధ్యా, వ్యవస్థల మధ్య ద్వేషాలు పెచ్చుమీరడానికీ, బాధ్యతలు మర్చిపోయి పూర్తి స్థాయిలో కాలక్షేపం చేయడానికీ ఛాటింగుల రూపేణా టెక్నాలజీ తప్పుదారి పట్టడం నన్ను ఆలోచనలో పడేసింది.
ఒక వ్యక్తిగా ఇన్ని కోట్ల మందిని టెక్నాలజీ సద్వినియోగం చేసుకునేలా ప్రభావితం చేసే శక్తీ, మాధ్యమాలూ నాకు అందుబాటులో లేవు. అందువల్ల టెక్నాలజీ దుర్వినియోగాన్ని ఆడ్డుకోలేను.
—————-
ఈ నేపధ్యంలోనే మానవ సంబంధాలపై చర్చించడం, నైతిక విలువల గురించి తల్లిదండ్రులూ, గురువులు చెప్పడం మర్చిపోయిన అంశాల్ని చర్చించడం నా మరో వ్యాపకంగా మార్చుకున్నాను.. ఆ క్రమంలోనే కొంత టెక్నాలజీ, కొంత హ్యూమన్ సైకాలజీ, మానవ సంబంధాలూ వంటి వాటిపై గత కొన్నేళ్లుగా నా దృష్టి ఉంటూ వచ్చింది…
—————-
నాకు మరికొంత మానసిక వికాసం కలిగిన తర్వాత ఇటీవల అర్థమవుతున్న విషయం… వ్యక్తులు స్వతహాగా స్వీయ ఉన్నతిని మరుస్తున్నారు.. ప్రపంచం దృక్కోణంలో వ్యక్తుల ఆలోచనలు సాగుతున్నాయి తప్ప తమ ఆలోచనా విధానాన్ని మెరుగుపరుచుకునే ప్రయత్నం ఎక్కడా సాగట్లేదు. అలాగని నాబోటి వాడు గుడ్డిగా “మీ ఆలోచనా విధానాన్ని మార్చుకోవాలి” అని చెప్తే అంగీకరించే విశాల హృదయం ఎవరికీ లేదు. సో ఈరోజు మానవ సంబంధాలు బాగుండాలన్నా, సమాజం బాగుండాలన్నా ముందు రావలసిన పరివర్తన వ్యక్తుల స్థాయిలోనే!
————–
ఈ విషయం అర్థమైన తర్వాత ప్రస్తుతం వ్యక్తి ఔన్నత్యంపై దృష్టి పెట్టదలుచుకున్నాను. ఒక వ్యక్తి సంతోషంగా ఉంటే, అభద్రతలు తొలగిపోతే, తానేంటో, ఈ ప్రపంచంలో తన ఉనికేంటో స్పష్టత వస్తే, ఈరోజు మనం అనుభవిస్తున్న అనేక బాధలు తీరిపోతాయి. సో వ్యక్తులుగా మనం ఏ జ్ఞానాన్నయితే కోల్పోయామో దాన్ని నేను స్వయంగా అభ్యాసం చేస్తూ పంచాలనుకుంటున్నాను.
———–
అందుకే ఇకపై నా పోస్టులు కొంతవరకూ అర్థం కావచ్చు, కొంతవరకూ అర్థం కాకపోవచ్చు… కానీ మీకు ఆసక్తి ఉంటే ఖచ్చితంగా వ్యక్తిగా మీ ఉన్నతికి ఉపయోగపడతాయి. జీవితంపై, ఆలోచనా విధానంలోనూ స్పష్టత తీసుకు వస్తాయి.
నేను చర్చించోతున్న ఆధ్యాత్మిక, తాత్విక, యోగా సాహిత్యం ఇప్పటివరకూ చాలా గ్రాంధిక పదాలతోనూ, అర్థాలతోనూ ఒక సామాన్యుడికి అర్థం కాని విధంగా ఉంటూ వచ్చింది. దాంతో చాలామంది చాలామంది ఈ మాటల్ని, ఈ భావజాలాన్నీ అర్థం చేసుకోలేక “ఇదంతా ఒట్టిదే” అని కొట్టిపారేసి తమకు ఇన్స్టెంట్గా ఆనందం కలిగించే జీవనశైలినే నమ్ముకుంటూ సాగిపోతున్నారు.
దీన్ని దృష్టిలో ఉంచుకుని నాకు తెలిసినంతవరకూ, నాకు అర్థమైనంత వరకూ ప్రస్తుత తరానికి అర్థమయ్యే విధంగా వ్యక్తి ఉన్నతికి ఉపయోగపడే విషయాలను వీలువెంబడి చర్చించాలనుకుంటున్నాను.
—————-
ఒక్కటి మాత్రం నిజం.. నేను చేయాలనుకుంటున్న ప్రయత్నం వ్యక్తులు మూలాలు మర్చిపోయిన క్రమంలో వాటిని తిరిగి పరిచయం చేయడమే, ఆలోచింపజేయడమే… ఓ వ్యక్తిగా నేను ఎదుగుతూ, ఆసక్తి ఉన్న వారికి నాకు తెలిసిన జ్ఞానం చేర్చడమే.. సో ఆసక్తి ఉన్న వారు ఫాలో కావచ్చు.
ధన్యవాదాలు
– నల్లమోతు శ్రీధర్
Leave a Reply