నాకు తులాభారం జరుగుతోంది.. తూచేస్తున్నారు..
ఏదో నా మానాన నేను మాట్లాడుతున్నాననుకుంటున్నా గానీ.. నా మాటలకు విలువ చేర్చబడుతోందని గమనించలేకపోతున్నా… కళ్లతో స్కానింగులు చేసేస్తున్నారు.. ఆ స్కానింగ్ కళ్ల చురుకు తట్టుకోలేక కళ్లు దించుకుంటున్నా…
నా కోపాన్ని గుండెల్లో తట్టుకోలేక అరిచాననుకున్నా గానీ.. నా అరుపూ నా ప్రమేయం లేకుండానే నా వ్యక్తిత్వంలో ఓ నగిషీగా చేర్చేయబడిందని తెలుసుకోలేకపోయా…
మంచోడుగానో, చెడ్డోడుగానో, తలపొగరోడు గానో.. కోపిష్టిగానో.. రకరకాల టాగ్స్ నా వంటి నిండా తగిలించబడుతున్నాయి. అవి పీకేసేయాలని నేను అవసరం లేని వ్యర్థప్రయత్నం చేస్తూనే ఉన్నా..
నా విలువకు ఇప్పుడు కొత్త కొలమానాలు వచ్చేసాయి.. likes అటా, కామెంట్లట్లా… ఫ్రెండ్సూ, ఫాలోయర్స్ అటా.. నా సైట్‌కి అలెక్సా ర్యాంకింగట… అన్నీ కలిపేసి నా మార్కెట్ వేల్యూ లెక్కేసే సైట్లూ వచ్చేశాయి.. నా విలువ తెలుసుకుని మురిసిపోతున్నా… లోకం చూడని తల్లి గర్భం నుండి మొదలై ఎంతెత్తుకు ఎదిగిపోయానో అని నా భుజాలు చరుచుకుంటున్నా… 🙂 పిచ్చి నేను!! అయినా జనాలు నాకు విలువ కట్టడమేమిటి, ఆ విలువ చూసుకుని నేను మురిసిపోవడమేమిటి?
“మనల్ని మనం ప్రమోట్ చేసుకోవాలట” – ఎవరో మహానుభావుడు చెప్తున్నాడు.. ఎందకు ప్రమోట్ చేసుకోవాలో అర్థం కావట్లా.. ప్రమోట్ చేసుకుంటే ఏమొస్తుందో కూడా తెలీట్లా.. “జనాలు గొప్పగా చూస్తారేమో” ప్రమోటెడ్ పీపుల్ని!! నాకంటూ ఓ విలువ ఉండాలని ఏ క్షణమూ కోరుకోని.. గుడ్డిగా నా పని చేసుకుపోయే నాకు.. ఈ వేల్యూ ప్రమోషన్ చాలా నవ్వొస్తోంది..
ఎక్కడో నలుగురికి గుర్తుండిపోవాలట.. చచ్చాక కూడా! అదేమంటే వివేకానందలూ, ఐన్‌స్టీన్‌లూ, మదర్ థెరిస్సాలూ మనకెలా గుర్తున్నారో అలా మనమూ మిగిలిపోవాలట.. చిరకాలం!
క్షణం క్షణం ఎదుటి వ్యక్తిలో వందల ఆలోచనలు వస్తున్నాయి, పోతున్నాయి.. అవన్నీ పక్కకు నెట్టి మనమొక్కళ్లమే ఆ మనిషి ఏకైక ఆలోచనగా నిలిచే సర్కస్ విన్యాసాలు చేస్తున్నాం.. విన్యాసాలకు అలుపొస్తోందీ.. అయినా ఆపట్లా.. ఎందుకీ తపన?
ఎవరికో గుర్తుండడం అనే ఓ చిన్న స్వార్థాన్ని కూడా అధిగమించలేని మనం నిరంతరం వేల్యూ అసెస్మెంట్ లెక్కింపుల్లోనే అస్థిత్వాన్ని కాపాడుకుంటూ, పోగొట్టుకుంటూ.. జీవశ్చవాలుగా బ్రతికేస్తూ పోతామేమో!!
“నేనే” లేను! ఇంకా నాకేంటి విలువ? ఎవరి గుండెల్లోనో మిగిలిపోవాలని కృత్రిమంగా నటించేయడం నాకు సిగ్గుగా అన్పిస్తోంది… నా గుండె పట్ల జాగ్రత్త తీసుకోని నేను ఏ గుండెలోనో స్థానం కోసం పాకులాడడం..!!
భౌతికంగా నేను కన్పిస్తున్నానేమో మీ అందరికీ.. నిజంగా “నేను” లేను.. నా బాధ్యతే మిగిలుంది. “నేను” లేననుకుని చేయాల్సిన బాధ్యత అది.. అందుకే నాకే విలువా వద్దు.. మీ లెక్కలు మీరు కాసేపు నా పట్ల కట్టిపెట్టుకోవచ్చు…
నేను అరుస్తాను.. బాధపడతాను.. ఆవేదన చెందుతాను.. సంతోషిస్తాను.. శ్రమిస్తాను.. విశ్రమిస్తాను.. చివరకు నిష్ర్కమిస్తాను…
నా చర్యలకు ఏ రకమైన జోడింపులూ నాకవసరం లేదు. మీ జోడింపులు లేని నన్నుని ఓ మాయలోకి లాగేయొచ్చు. నా గమనం, గమ్యం ఆ మాయ కాదు… ఓ దేదీప్యమానమైన వెలుగు… అన్ని అజ్ఞానాలూ పటాపంచలయ్యే వెలుగు.. శక్తి వలయంలో విలీనమయ్యే వెలుగు!!
– నల్లమోతు శ్రీధర్
శ్రీధర్ గారూ…
నా చర్యలకు ఏ రకమైన జోడింపులూ నాకవసరం లేదు –
అని మీరన్నా – మీ విలువను కొలవద్దన్నా –
ఈ మాధ్యమపు క్షేత్రానికి మీరిచ్చిన మదింపు – ముగింపు …
“మనల్ని మనం ప్రమోట్ చేసుకోవాలట” పై ఏవగింపు …
మీ విలువే అంతటా …
regards …