ఎంతో వేదన తర్వాత మొహాలపై విచ్చుకునే ఓ అద్భుతమైన చిరునవ్వుని అక్షరాల్లో చెప్పడానికి వీలెలా కుదురుతుంది.. అనుభవించి తెలుసుకోవడం తప్ప!
బాధల్లో ఉన్న మనస్సుల్ని మరింత అందరూ బాధపెట్టేయగలరు.. తేలికపరిచే గొప్పదనమే కొందరికి మాత్రమే స్వంతం.
అందరూ మనవాళ్లే అనుకుని కష్టాల్లో ఉన్న వాళ్లకి కొద్దిపాటి ఊరటనిచ్చే మహానుభావుల్ని చూస్తే పాదాభివందనం చేయబుద్ధవుతుంది.
ఇంకొకరి కలత చెందిన మనస్సు తెరిపినపడడానికి మనం పూనుకోవడమే దైవకార్యం.
ఏం దెయ్యం పూనిందో గానీ.. మనుషులు సహజసిద్ధంగా బ్రతికేయడం మర్చిపోతున్నారు.. అకారణ ద్వేషాలూ, కోపాలూ, కక్షలూ, ప్రతీకారాలూ!
మీ అభిప్రాయం నాకు నచ్చకపోయినా మీపై నాకు ద్వేషం పుట్టుకొస్తుంటే అస్సలు ఇంత పెద్ద జీవితాన్ని ఇంత ఇరుకైన ఆలోచనలతో ఎలా జీవించగలం.. క్షణమో నరకంగా అనుకోవలసిందే తప్ప!
మన స్వంత తలనొప్పులు చాలవన్నట్లు.. ప్రతీ దానిపై మనకో అభిప్రాయం ఏడిచచ్ఛింది కదా.. సో రాజకీయాలూ, కులాలూ, మతాలూ, సినిమాలూ.. అభిమానాలూ… పడిపోయిన ముడిని మరింత గొంత బిగుసుకునేలా వేయడానికి సవాలక్ష రోగాలు మనకి అంటుకుని!!
ఇలాంటి అనవసరమైన విషయాలన్నీ మన మనస్సులపై స్వారీ చెయ్యకపోతే.. ఎవరితో ఏ గొడవా ఉండదేమో…
ఏవో అజెండాల్ని బొడ్లో కత్తుల్లా దాచుకు తిరుగుతూ మనుషులు తోటి మనుషుల్ని షాకింగ్‌గా గాయం చేసేసి చోద్యం చూస్తున్నారు.. ఇంత పైశాచికత్వం ఈ మానవ జీవితానికి అవసరమా?
పాపం గాయపడ్డ వాడి మనస్సెంత కుంగిపోయిందో.. అది ఎప్పటికి తెప్పిరిల్లుతుందో.. తిరిగి చిరునవ్వు ఎప్పుడు పుట్టుకొస్తుందో..
ఈ మధ్య "సైకో"ల గురించి టివిల్లో తరచూ చూస్తున్నాం.. నిజం చెప్పాలంటే మన ప్రవర్తనని ఉన్నదున్నట్లు ఎసెస్ చేసుకుంటే మనకన్నా మించిన సైకోలెవరున్నారని?
మన తప్పుడు భావజాలాన్నీ, మన కోపాల్నీ, తాపాల్నీ, మనుషులపై మనం పెంచుకుంటున్న ద్వేషాల్నీ, వ్యవస్థలపై మనకు ఉన్న అపనమ్మకాల్నీ.. నిస్సిగ్గుగా ప్రపంచం మీద వెదజల్లి పొల్యూట్ చేసి పారేస్తున్నాం… మళ్లీ పర్ఫెక్టనిస్ట్ బ్రెయిన్‌కి "ప్రపంచంలో అందరూ సక్రమంగా ప్రవర్తించాలనే" కరెక్టివ్ నేచర్ ఒకటి బోడి!!
మన వల్ల సాటి మనిషికీ, ప్రపంచానికీ ఎంత హాని జరుగుతోందో తలుచుకుంటే.. ఇంత దారుణంగా ప్రవర్తించగలమా?
చాలామంది మనుషుల్ని మనం చూస్తే.. చిన్న చిన్న సమస్యలు.. సాటి మనుషుల వల్ల ఏర్పడేవే. కానీ ఎంత బాధపడుతున్నారంటే.. ఒక్క మాట మనం ఆర్తిగా మాట్లాడితే కళ్లమ్మట నీళ్లు కారిపోయేటంత!
మనం ఎదగడానికీ, మన అభిప్రాయాలూ కరెక్ట్ అన్పించుకోవడానికీ పక్కనున్న 99%నీ తొక్కేయడమో, చంపేయడమో కరెక్ట్ అనుకున్నంత కాలం ఈ నిశ్శబ్ధ మారణకాండ ఆగదు… ఎందరో మనస్సుల్ని కలతపెడుతూనే ఉంటుంది..
అలా కలతపడిన మనసులకు కాస్తంత ఊరటనిచ్చే మహామనుషుల రుణం మాత్రం ఎప్పటికీ తీర్చుకోలేం… ఒక సాటి మనిషిగా ప్రతీ ఒక్కరం మంచి మనుషుల విలువెంతో.. అదీ ఇలాంటి దారుణమైన సమాజంలో అన్నది గుర్తించి గౌరవించుకోవలసిన అవసరం ఉంది.
గమనిక: ఇది ఎవరికైనా పనికొస్తుంది అన్పిస్తే షేర్ చేయగలరు.
ధన్యవాదాలు
– నల్లమోతు శ్రీధర్
ఎడిటర్
కంప్యూటర్ ఎరా తెలుగు మేగజైన్
Leave a Reply