ఎవరెవరి తలపుల్లోనో చోటు కోసం ఎంత వెర్రి ఆరాటం…. 🙂 అందర్నీ పేరుపేరునా పలకరించి మనల్ని సాంతం వదిలేశారనే కినుక ఉన్న పెట్టున జవజీవాల్నీ మెలిపెట్టేయడం ఎంత అవసరం లేని బాధా…. 🙂
కూడికలూ, తీసివేతల బంధాల్లో ఏవేవో పాత జ్ఞాపకాల్నీ, అనుబంధాల్నీ రుజువుగా చూపి ఆ కూడికలూ, తీసివేతల్ని నిలదీయాలనుకోవడం పిచ్చి ప్రయాస కాదూ….
చలించే మనస్సుల్లో శాశ్వతంగా స్థిరపడిపోవాలనుకోవడం అత్యాశే కదా…?
గతించిపోయిన క్షణాల్ని మాటల్లోకి మోసుకొచ్చి తెగీతెగని స్థితిలో ఉన్న బలహీన బంధాలకు బలం పేనాలనుకోవడం వ్యర్థప్రయత్నమన్పించుకోదా….
ఏ మనిషి ఎంతవరకూ… ఏ బంధం ఎంతవరకూ….. దేన్ని శాశ్వతం చేసుకోవాలనుకుంటున్నాం… ఆశపడినంత మాత్రాన ఏదైనా శాశ్వతమైపోతుందా…..
సెకనుకి లక్షల ఆలోచనలు చేసే ఓ దేహపు మనస్సులో మన గురించి ఆలోచనొక్కటే బలంగా నిలిపేయానుకోవడం…. హహహహ…. "నీ ఆలోచనల్లో ఈ జీవితం ముగిసిపోనీ…" అని పొయెటిక్గా భ్రాంతుల్లో నింపే మాటలకు దాసోహమైపోతున్నామేమో….
ఏ మనస్సూ మన గురించి శాశ్వతంగా చింతించేటంత స్థిరచిత్తాన్ని కలిగిలేదు… ప్రవాహ గమనంలో కొట్టుకుపోతూ ఆలోచనలు సాగించే మనస్సుల్ని ఆధీనం చేసుకోజూడతరమా….
– నల్లమోతు శ్రీధర్
Leave a Reply