
సహజంగా ఫార్వార్డెడ్ మెసేజ్‌లు నేను పెద్దగా పట్టించుకోను. కానీ ఈరోజు నా చిన్నప్పటి క్లాస్మేట్ విద్యాసాగర్ షేర్ చేసిన ఓ మెసేజ్ చాలా బాగుంది. ఆ మెసేజ్ ఇది. “సింహంలా జీవించాలి” అని చాలామంది గొప్పగా చెప్పుకుంటూ ఉంటారు. జీవితం మొత్తం మిగతా జంతువుల్ని తరిమి, వేటాడి పవర్‌తో బ్రతికిన సింహం తన వయస్సు పెరిగేసరికి తనలో శక్తి తగ్గిపోయేసరికి కనీసం తనని తాను రక్షించుకోలేని స్థితికి చేరిపోయి, అది ఏ హైనాలనైతే వేటాడి బ్రతికిందో అవే హైనాల చేత కార్నర్ చెయ్యబడి అది బ్రతికి ఉండగానే దాని శరీరాన్ని ఆ హైనాలు కొరుక్కు తింటుంటే ఆ బాధ తాళలేక బ్రతుకుతుంది. ఇదీ విద్యాసాగర్ పంపిన మెసేజ్ సారాంశం.
ఒక తల్లి ఉంది. పిల్లలు డిసిప్లెయిన్డ్గా ఉండాలని వాళ్లు పెద్దయి సెటిలయ్యే వరకూ “అది చేయొద్దు, ఇది చేయొద్దు” అని గద్దిస్తూ ఉండేది. వాళ్లు పెద్దయ్యారు, జీవితంలో సెటిల్ అయ్యారు. ఆమెకీ వయస్సు మీద పడింది. ఏ పనీ చేసుకోలేని పరిస్థితి ఏర్పడింది. ఇప్పుడు ఆ పిల్లలు ఆమెకి కనీసం విలువ కూడా ఇవ్వడం మానేశారు. ఆమె ఏది చెబుతున్నా పట్టించుకోవడం మానేశారు.
ఒక మనిషిని హృదయంతో మంచిగా మాట్లాడి గెలవచ్చేమో గానీ మైండ్‌తో, తలపొగరుతో ప్రవర్తించి ఎప్పటికీ గెలవలేవు. అవి కుటుంబ సంబంధాలు అయినా, బయటి సంబంధాలు అయినా, ఇతర జీవులతో అయినా! పెంపుడు జంతువుల్నే తీసుకోండి.. వాటిని ప్రేమగా చూసుకుంటే అనుక్షణం వెంటే తిరుగుతూ ఉంటాయి. అదే వాటిని హెరాజ్ చేస్తుంటే ఏదోరోజు తిరగబడతాయి.
లైఫ్ చాలా చిన్నది. మన మాటలు ప్రేమగా ఉండాలి.. కల్మషం లేకుండా ఉండాలి.. మనకు ఎమోషనల్ బ్యాలెన్స్ ఉండాలి.. ఎవరి హృదయాన్నీ నొప్పించకుండా ప్రవర్తించాలి. అప్పుడు ఒక డివైన్ సోల్ అవుతాం. లేదంటే అంతా బాగున్నట్లే కనిపిస్తుంటుంది లోపల జరగాల్సిన డామేజ్ జరిగిపోతూనే ఉంటుంది. Always win the hearts, అదే నిజమైన జీవితం. ప్రేమతో మనుషుల్ని గెలుచుకుందాం.
- Sridhar Nallamothu