ఎంతగా మనల్ని మనం పట్టించుకుంటే అంతగా వ్యామోహం పెరుగుతుంది…
మన రూపం, మన ఆలోచనలూ, అభిప్రాయాలూ ప్రతీదీ ఎంత వద్దనుకున్నా ప్రతీక్షణం తెలీకుండానే “నేను” అనే పదాన్ని హైలైట్ చెయ్యడానికి ట్రై చేస్తూ ఉంటాయి.
——-
చిన్నప్పటి నుండి పెరిగి పెద్దయ్యే క్రమంలో మనకు తెలీనివెన్నో కళ్లారా చూస్తూ, జనాలు చెప్పినవి వింటూ.. అస్పష్టంగా ఉన్న విషయాలపై మొత్తానికి ఏవేవో బలమైన అభిప్రాయాలు ఏర్పరిచేసుకుంటాం. దేనిపైనైనా ఓ అభిప్రాయం మనకు ఏర్పడిందంటే.. ఇక అదే వేదమని నమ్ముతాం.. ఇక్కడే బయటి ప్రపంచంతో సంఘర్షణ మొదలవుతుంది.
ఒకదాన్ని బలంగా నమ్మడం మోహలక్షణం. నమ్మిన దానికి gumలా అతుక్కుపోవడమన్నమాట. సో ఇక్కడ మనస్సూ, విచక్షణా లోపిస్తాయి. “నిజమైన మనం” మాయమై… “అభిప్రాయాలే మనం”గా గల మనం role play చేస్తుంటాం. ఖర్మ కొద్దీ మనల్ని గమనించే మనుషులు కూడా “నిజమైన మనని” వదిలేసి “మన అభిప్రాయాలకే” ప్రాధాన్యత ఇవ్వడం మొదలెడతారు. దీంతో స్వతహాగా “నిజమైన మనం” ఎంత ఉన్నతులమైనా.. “మన అభిప్రాయాల సమూహమే” మన క్యారెక్టర్ని డిసైడ్ చేస్తుంది. దీంతో మన అభిప్రాయాల్ని నెగ్గించుకునే క్రమంలో, వాటికి పబ్లిక్ acceptance పొందే క్రమంలో “నిజమైన మనల్ని” కోల్పోయి ఓ తేలికపాటి అభిప్రాయపు వ్యక్తిగా చులకనగా స్థిరపడిపోతాం. అది మనస్సుకి గాయంగా అన్పిస్తుంది. ఆ బాధ వెంటాడుతూ ఉంటుంది.
————–
పైన చెప్పినదంతా ఒక్కసారి నిశితంగా గమనించండి… ఏది మనల్ని అంతగా బాధపెడుతోందీ?
మనం బలంగా ఏర్పరుచుకున్న అభిప్రాయమే కదా? అంటే ఎవరో చెప్తే, ఏదో జరిగితే మనం క్రియేట్ చేసుకున్న ఓ గాలివాటు అభిప్రాయాన్ని కలిగి ఉన్నందుకు, దాన్ని నమ్ముకున్నందుకూ, దాన్ని వాదించినందుకూ మనం బాధపడాల్సి వస్తోందన్నమాట.
ప్రతీదానిపై అభిప్రాయాలుండొచ్చు కానీ.. అవి మన చుట్టూ మందీ మార్భలాన్ని చేరవేసి… మన అభిప్రాయాలే కరెక్ట్ అనేటంత స్థాయిలో వ్యామోహాన్ని పెంచేసి.. చివరకు “అసలైన నేను”ని మన మనస్సుకి దూరం చేసేటంత బలంగా ఉండకూడదు. అభిప్రాయాలకు పట్టూ, విడుపూ ఉండాలి.
——————–
కేవలం అభిప్రాయాలే కాదు… మనల్ని మనం ప్రజెంట్ చేసుకోవడానికి “నేను” అనేది వాడక తప్పదు గానీ.. ఆ “నేను” అనేది ఎంత బలంగా, గర్వంగా, మొండిగా, మూర్ఖంగా, అట్టహాసంగా వస్తే అంత మన అసలైన మూలాల్ని మర్చిపోయినట్లు!
నిజంగా మనం చాలానే సాధించి ఉండొచ్చు, చాలానే అందంగా ఉండి ఉండొచ్చు, డబ్బూ ఉండి ఉండొచ్చు… కానీ వాటి పైత్యప్రకోపాలన్నీ ప్రపంచంలోనే “మనల్ని” ఉంచుతున్నాయి తప్ప “మన మనస్సులో” మనకు చోటీయట్లేదు.
ప్రపంచంతోనే మన transactions ఉన్నంతకాలమూ అటు సంతోషంతో పాటు ద్వేషాలూ, తిరస్కారాలనూ ప్రపంచం నుండే అనుభవించవలసి వస్తుంది. ఆయా పరిమాణాలన్నీ మరింత మోహానికీ, క్రోధానికీ గురిచేస్తాయి.
అందుకే చాలా విషయాల్లో పట్టీపట్టనట్లు ఉండాలి.. అలాగే మనం చేసే పనుల పట్ల మనకు మితిమీరిన వ్యామోహం పనికిరాదు.. అలాంటి వ్యామోహం చివరకు దుఃఖకారకమే అవుతుంది.
– నల్లమోతు శ్రీధర్
Leave a Reply