నేను వాదిస్తున్నాను… ఎంతలా అంటే లాజిక్ల మెలికలు తిప్పి మరీ నిన్ను ఓడగొట్టేటంతగా…
ఎలా మాట్లాడితే నువ్వు ఓడిపోతావా.. అని నీ మాటల్లోని, నీ ఎమోషన్లలోని టెంపర్మెంట్ని fraction of secondsలో కాలిక్యులేట్ చేస్తున్నా..
నువ్వెక్కడ వెనక్కి తగ్గుతావో, సూటిగా ఏ ప్రశ్న వేస్తే నీ నోరు మూగబోతుందో rapidగా ఊహించేస్తున్నా…
ఛెస్లో పావుకి ఛెక్ చెప్పేసినట్లు నీ next moveకి ఛెక్ చెప్పేయడం నా తక్షణ కర్తవ్యం..
ఆకలేస్తోంది… no… దప్పికవుతోంది.. no…
ఇప్పటివరకూ నీ మాటలన్నీ bufferలో స్టోర్ చేసుకుని.. అన్నీ క్రాస్ ఛెక్ చేసుుకుంటూ.. నీ ఆలోచనల్లో ఓ లూప్ హోల్‌ని పట్టేశాను. ఎలుకని కలుగుతో బంధించినంత సంబరం…
సంబరాన్ని అదిమి పట్టుకుంటూనే ఆ loop holeని పాచికలా వాడేశా..
పాచిక పారింది.. నీ నోరు మూగబోయింది…
నువ్వూ, నీ ఆలోచనలూ తప్పని బల్లగుద్ది మరీ నిరూపించేశా….
నువ్వు ఓడిపోయావు…. నా అహం చల్లబడింది…
గట్టిగా శ్వాసించాను.. నా వాదనా పటిమను నాకు నేనే మెచ్చుకున్నాను.. పెదాల చివర్న తెలీని గర్వపు నవ్వు తళుక్కుమంది…. రిలాక్స్డ్గా కూర్చీలో జారగిలబడ్డా….
————————————————————
నన్ను నేను గెలిపించుకోవడంలో నా తెలివితేటలు నిన్ను మానసికంగా నాకు దూరం చేశాయని అర్థం కావట్లేదు.. అర్థమైనా దానిపట్ల పెద్ద పట్టింపు లేదు.
ఓ చిన్న అహాన్ని సంతృప్తిపరుచుకోవడానికి ఓ పెద్ద అంతర్జాతీయ సమస్యని పరిష్కరించినంత తెలివితేటలు, మెంటల్ రిసోర్సెస్ వృధాగా వాడేశానన్న స్పృహే నాకు లేదు.
జీవితం సంఘటనలూ, పర్యవసానాలూ, భిన్నాభిప్రాయాలూ, వాదోపవాదాలూ, చిన్న చిన్న ఇగోలే కాదు… తలొంచుకుని ఓడిపోయైనా బలపరుచుకోవలసిన అద్భుతమైన మానవ సంబంధాలు అన్నింటికన్నా పెద్ద జీవితాన్ని రుచిచూపిస్తాయి.
బుర్ర షార్ప్‌గా ఉన్న ఉడుకు రక్తం కుర్రాడూ అడ్డదిడ్డంగా వాదించి గెలుస్తాడు.. ఆలోచనల్ని బలవంతంగా కూడబలుక్కుని, సంఘటనల సీక్వెన్స్ అనలైజ్ చేసుకునే ముదుసలీ గెలుస్తాడు…
బ్రెయిన్ షార్ప్‌గా ఉంది కదా అని అద్భుతమైన మనిషిగా మనల్ని మనం భావించుకోవడం వర్షంలో చెట్టు నీడన సెక్యూర్డ్ గా నిలబడడం లాంటిది… కాసేపు బానే ఉంటుంది. ఏదో పిడుగు పడుతుంది.. అంతా మసైపోతుంది..
ఎన్ని గాయాలైనా హృదయం ఇచ్చినంత ఆనందం ఏ లాజిక్కూ ఇవ్వలేదు. హృదయం ఓడిపోయి కూడా ఆ ఓటమినీ ఆస్వాదించగలుగుతుంది. కానీ లాజిక్ ఓటమిలో కసిని పెంచుకుంటుంది. ఆ కసి మరింత మనల్ని దిగజారుస్తుంది.
వినమ్రంగా తలొంచుకోవడం ఓడిపోవడం కాదు.. అది ఏ గెలుపూ ఇవ్వని మానసిక శక్తిని ఇస్తుంది. ఇది అర్థం కాకే చిన్న చిన్న అహాలు సంతృప్తిపరుచుకుని క్షణిక మాత్రపు ఆనందాలతో జనాలు జీవితాల్ని సరిపెట్టుకుంటారు.
—————————————————————
చివరకు.. ఇప్పుడు నేను అనుకుంటున్నా.. ఎలా మాట్లాడితే నువ్వు ఓడిపోతావా.. అన్నట్లు కాకుండా….
"తలొంచుకునైనా నీ అద్భుతమైన రిలేషన్‌ని దక్కించుకోగలనా… ఆ అదృష్టం నాకు వరిస్తుందా" అని!!
నాలో ఆలోచనల్లో మార్పు నీకు ఓటమి అన్పించొచ్చు… ప్రపంచానికి ఓటమి అన్పించొచ్చు…. కానీ నా మనస్సు ఆస్వాదిస్తున్న సంతృప్తి ఏ ప్రపంచపు ప్రాణానికి అంతుచిక్కుతుంది… అది నా స్వంతమైన అనుభూతిగా మిగలడం తప్ప!!
ఏ ఓటమిని ఎంతవరకూ మనస్సుకి స్వీకరించాలో స్పష్టమైన అవగాహన నాకున్నప్పుడు నా ప్రతీ ఓటమినీ నాకు కోలుకోలేని దెబ్బగా భావించడం నీ అమాయకత్వం కాదా…. 😛
గమనిక: సహజంగా వివిధ విషయాల పట్ల మనుషుల మధ్య జరిగే మానసిక చర్యల్ని విశ్లేషించే ప్రయత్నమే ఇది. ఎవరికైనా పనికొస్తుందన్పిస్తే షేర్ చెయ్యగలరు.
ధన్యవాదాలు
– నల్లమోతు శ్రీధర్
ఎడిటర్
కంప్యూటర్ ఎరా తెలుగు మేగజైన్
శ్రీధర్ గారు,
ఇది కాకతాలీయమే అనుకుంటున్నను….
సరిగ్గ ఇలాంటి వాటి గురించే నిన్న రాత్రి నుండి రాస్తున్నాను…
నన్ను నేను సమీకరించుకునే దిశలో నా ప్రవర్తనను అనలైజ్ చేస్కుంటే మీరు రాసిన వాటిళ్ళో కొన్ని నా విశయంలోనూ జరిగాయి. ఎదుటివారి బలహీనతలపై చిన్న చిన్న దెబ్బలు వేస్తూ ఇతరులను ” తప్పుగా” మలుస్తూ అదే నిజమని మనం చేసే ప్రయత్నాల్లో చాలావరకు అబద్దపు విజయాలు మనసును త్రుప్తి పెట్టినా, ఒక్కోసారి మనసు గోల చేసినపుడు పునరాలోచిస్తే…
మనమీద మనకు కొద్దిపాటి ద్వేషమైనా కలగక మానదు.. ఐనా కూడ మనం మారలేమేమో…
ఎప్పటికప్పుడు కొత్త కొత్త డిస్పోసబుల్ వాదనలు చాలా కన్వీనియంట్ గా మనకనుగూనంగా మల్చుకొంటు….
ఒకటే బాధ.. ఇవన్ని జరిగిపోయినవి ఇప్పటికే, మచ్చలు అలాగే మిగిలిపోతాయి ఎప్పటికీను…
ఒక మంచి విశయాన్ని ఇలా షేర్ చేస్కున్నందుకు అభినందనలు మీకు….