బలవంతంగా కళ్లు మూసుకున్నాను…
కనురెప్పలు అల్లల్లాడుతున్నాయి.. లోకాన్ని చూడడానికీ, గ్రహించడానికీ, విశ్లేషించడానికీ అలవాటు పడ్డ కనుగుడ్లని దాచలేక వాటి అస్థిమితత.
అయినా నేను పట్టు వదల్లేదు… కనురెప్పల కదలికలు మెల్లగా మందగించాయి..
దృశ్యాలు మాయమైనా.. గతం తాలూకు మనఃఫలకంలో ముద్రించుకుపోయిన విజువల్ డేటాబేస్లోని రికార్డులు ఒక్కటొక్కటిగా ఆలోచనల రూపంలో ప్రవాహంలా విజృంభిస్తున్నాయి.
ఏదో జ్ఞాపకం… ఏదో ప్రవర్తన, ఏదో అవమానం.. ఏదో ఆనందం… మెదడు అలరామాల్లోంచి దొర్లుకుంటూ బయటపడుతున్నాయి.
అంతలో ఏదో శబ్ధం.. ఆ శబ్దాన్నీ ఆలోచన చుట్టి వచ్చింది.. శబ్ధకారణాన్నీ ఊహించి వచ్చేసింది… మళ్లీ ఎక్కడికో ఆలోచన వచ్చి వాలింది…
టివిలో చూసిన నిర్భయ తీర్పూ.. ఉదయం పేపర్లో చూసి దిగాలుపడ్డ ప్రాంతీయ గొడవలూ.. సినిమా రీళ్లలా కదలాడుతున్నాయి..
వద్దనుకుంటూనే అన్నీ విశ్లేషించేస్తున్నాను… అవే విషయాలపై ఇతరులు వ్యక్తపరుస్తున్న అభిప్రాయాలూ గుర్తొస్తున్నాయి… మనుషుల నైజాలు గుర్తొచ్చినప్పుడు ఓ జాలో, సానుభూతో, కోపమో, అసహనమో పొంగుకొస్తోంది… ఆ పొంగు శ్వాసనీ పరుగులెత్తిస్తోంది..
అంతలో కళ్లు మూసుకున్న కారణం జ్ఞప్తికొచ్చింది… ఈగల్లా ముసురుకున్న ఆలోచనల్ని విదిలించుకోగానే.. అన్నీ నెమ్మదించి… బిగదీయబడిన నరాలన్నీ వదులవుతున్నాయి…. చాలా ప్రశాంతంగా ఉంది…. ఆలోచనల ప్రవాహం తగ్గుతోంది… మనస్సు స్థిమితంగా ఉంది..!!
———————————-
సరిగ్గా దీని కోసమో కళ్లు మూసుకుంది… కళ్లు తెరిస్తే ప్రపంచం చాలానే ఉంది. కానీ కళ్లు మూస్తే అంతకు మించిన ప్రపంచం ఉంది!
లాక్కుపోయే ఆలోచనలు లేవు.. రక్తాన్ని మరిగించే ఆవేశం లేదు.. కపట జాలి లేదు… మనుషుల సొదలు లేవు.. రణగొణ ధ్వనులు లేవు.. న్యూస్ పేపర్లలో నల్లటి, ఎర్రటి అక్షరాల్లో రహస్యంగా పలికించే భావాలూ లేవు.. టివిల్లో చూసిన రక్తపు మడుగులూ లేవు..
ఏరోజుకారోజు మన మనోఃప్రపంచం ప్రశాంతంగా కళ్లు తెరుస్తుంది… జీర్ణించుకోలేని దృశ్యాల్ని చూడలేక.. కళ్లు మూసుకుని వాటిని జీర్ణించుకోనూ లేక కళ్లు మూయడానికే భయపడుతోంది.. ఏ అర్థరాత్రికో, అపరాత్రికో అలసిపోయి బలహీనపడి.. బరువెక్కి మూతబడుతున్నాయా కళ్లు! మళ్లీ తెల్లారి మామూలే!
మన ప్రపంచం మన నియంత్రణలో లేకుండా పోయిన అభాగ్యులం.. ప్రపంచాన్ని మన నియంత్రణలోకి తీసుకోలేకపోతున్న అసమర్థులం.. కానీ జ్ఞానేంద్రియాలు కొద్ది సమయమైనా మూతపడాల్సిందే.. లేదంటే మనిషి ప్రపంచపు ప్రవాహంలో కొట్టుకుని తన ఉనికినే పోగొట్టుకునే ప్రమాదముంది.
– నల్లమోతు శ్రీధర్
ఎడిటర్
కంప్యూటర్ ఎరా తెలుగు మేగజైన్
Leave a Reply