ఏ పనైనా distract అవుతుంది.. యెస్, మనం మానవమాత్రులం, రకరకాల డీవియేషన్లు వస్తాయి. అలాగని పర్మినెంట్‌గా డీవియేట్ అయితే గొప్ప గొప్ప లక్ష్యాలు అస్సలు సాధ్యపడవు. దాదాపు 18 ఏళ్లు.. నా శ్రమ వయస్సు ఇది. ఈ 18 ఏళ్లుగా నేను భౌతికంగానూ, మనస్థత్వపరంగానూ తెలిసిన మిత్రులందరూ pronouce చేసే ఒకటే మాట.. అసలు ఇంత ఎనర్జీ, కమిట్మెంట్ నీకు ఎక్కడి నుండి వస్తోందని! అస్సలు ఏమాత్రం గొప్ప కోసం ఇలాంటి పర్సనల్ కన్వర్జేషన్లు పబ్లిక్ చెయ్యడం లేదు, నా గురించి నేరుగా తెలిసిన వాళ్ల సంగతి పక్కనపెడితే ఇక్కడ ఓ నెలరోజులు క్రితం పాలో అవడం మొదలెట్టిన వాళ్లకైనా తలొంచుకుని నా పని నేను ఎంత పట్టుదలగా చేసుకుంటూ వెళ్తానో అర్థమై ఉంటుంది. దీనికి ఒకటే కారణముంది… కొంతమంది డబ్బులోనూ, విలాసాల్లోనూ, మనుషుల్లోనూ, పార్టీల్లోనూ, ఫంక్షన్లలోనూ ఎంజాయ్మెంట్ అనుభవిస్తుంటారు. నాకు పనిలో వ్యక్తపరచలేనంత సంతృప్తి లభిస్తుంది.
నేనూ కొన్నిసార్లు distract అవుతుంటాను.. ఒకటికి పది వ్యాపకాలు నెత్తిన వేసుకోవడం వల్ల ఏర్పడే సమస్య ఒక ఎత్తయితే.. అందరూ ఓ మాస్ హిస్టీరియాలా ఓ పూనకంలో ఊగిపోయేటప్పుడు అటు ఫేస్‌బుక్‌లోనూ, బయటా కొన్నాళ్లు తెలంగాణ, మరికొన్నాళ్లు ఎలక్షన్లు, టెలిఫోన్ ట్యాపింగ్, క్రికెట్, ప్రత్యేక హోదా, రాజధాని నిర్మాణం, అవార్డుల తిరస్కరణ, బాహుబలీ, బ్రూస్లీ.. ఇలా రకరకాల విషయాలు అలల్లా జనాల మెదళ్లని కుదిపేస్తూ అందర్నీ ఓ వైపుకి లాక్కు వెళ్లేటప్పుడు ఎంత వినకూడదనుకున్నా, ఎంత చూడకూడదనుకున్నా యధాలాపంగా ఏ టివిలోనో, FB news feedలోనో అవి కళ్ల ముందు ప్రత్యక్షమవుతూనే ఉంటాయి. కాసేపు పని పక్కన పడేసి వాటి గురించి ఆలోచించడమూ, అంతలో వాస్తవంలోకి వచ్చి పనిలో పడడమూ జరుగుతూనే ఉంటుంది.
కానీ నేను నమ్మేదొక్కటే ఒక మనిషికి రెండు ప్రపంచాలుంటాయి. 1. తన ఒక్కడికి సంబంధించినది 2. బయటి ప్రపంచంచే ప్రభావితం చెందేది. తన ఒక్కడికి సంబంధించిన ప్రపంచంలో బాధ్యతగా, సంతృప్తిగా, సంతోషంగా ఉంటే బయటి ప్రపంచంచే ప్రభావితం చెయ్యబడే ప్రపంచం ఎంత బలంగా ఉన్నా మనల్ని ఏమీ చెయ్యలేదు. ఏ రోజైతే మన పని మనం మానేసి, మన బాధ్యతని పక్కనపెట్టి కబుర్లు చెప్పుకుంటూ బ్రతకడం మొదలెడతామో ఆ రోజు మన స్వంత ప్రపంచం ఛిన్నాభిన్నం అయి బయటి ప్రపంచపు ప్రవాహంలో కొట్టుకుపోవడం జరుగుతుంది. దీన్ని చాలా స్పష్టంగా నమ్ముతాను కాబట్టే ఏరోజూ బయటి ప్రపంచపు విషయాలపై నేను ఎప్పుడూ స్పందించను, ప్రతీ దానిపై నాకు నిర్థిష్టమైన అభిప్రాయాలు ఉంటాయి, ఆలోచనా, విశ్లేషణా ఉంటుంది.. కానీ దానికన్నా నా ప్రపంచంలో నేను బ్రతకడం నాకు ఇష్టం. నా పని నేను చేసుకోవడంలో పొందే సంతోషం వెలకట్టలేనిది.
హాపీగా బద్ధకంగా పడుకోవచ్చు.. నిజంగా అది మనస్సుకి నచ్చిన పనైతే నేనూ బద్ధకంగా గడపడానికి వెనుకాడను. కానీ అది మైండ్ ఆడే పెద్ద గేమ్. ఒక్కసారి బద్ధకాన్ని విదిలించుకుని పనిచెయ్యడం మొదలెడితే ఎంత పనైనా అవలీలగా సాగిపోతుంటుంది. అందుకే నిద్రపోయేటప్పుడో, ఆరోగ్యం బాగాలేనప్పుడో తప్పించి ఏ ఒక్క క్షణమూ నేను రిలాక్స్ అవ్వను. నేను చేసే మేగజైన్, వీడియోలు, టివి షోస్, పోస్టులూ, ఇతర పర్సనల్, ప్రొఫెషనల్ పనులను చూస్తే చాలామందికి ఈ విషయం స్పష్టంగా అర్థమయ్యే ఉండాలి.
పనిని ఇష్టపడే స్వభావం, ఆ పని ద్వారా సంతృప్తిని మూటగట్టుకునే విధానం ఈరోజు చాలామందికి అర్థం కావలసి ఉంది. “ఒక పని చేస్తే ఏమొస్తుంది.. ఇంత కష్టపడి మీకు లాభమేంటి” వంటి కాలిక్యులేటివ్ మాటలు నా కెరీర్ మొత్తం వింటూనే ఉన్నాను. మనం పనిని తూకం వేసి అమ్ముకోవడం మొదలెట్టాక లాభం లేనిదే పనిచెయ్యకూడదని మొండికేసుకుని కూర్చున్నాక మనస్సులో సంతోషం ఆవిరైంది, ఆరోగ్యాలు పాడై రోగాల బారిన పడుతున్నాం, చిన్న వయస్సులోనే ఒబేసిటీలూ, సైకలాజికల్ ప్రాబ్లెంస్, ఒంటరితనం, కాన్ఫిడెన్స్ లేకపోవడం వంటి సమస్యలు తలెత్తుతున్నాయి. లాభం గురించి ఆలోచించకుండా ఒళ్లొంచి పనిచేసేవాడికి ఇలాంటి మానసిక, శారీరక ఆరోగ్య సమస్యలూ ఉండవు, డిజప్పాయింట్మెంట్లుండవు, ఒంటరితనం ఉండదు, బద్ధకం ఉండదు.. ఇంకా చాలానే లాభాలు డబ్బుల్లో తూగలేని లాభాలన్నమాట. అందుకే ప్రతీదీ డబ్బుతో కొలవకూడదు.
శ్రమ సంస్కృతి మళ్లీ జీవితంలో భాగమైపోయిన రోజున అందరి మొహాల్లో మాయమైన చిరునవ్వులు మళ్లీ ప్రత్యక్షమవుతాయి. ముఖ్యంగా సంతృప్తికరంగా జీవితం సాగుతుంది.
– నల్లమోతు శ్రీధర్
Super sir