పంచైతాని మహాబాహో కారణాని నిబోధ మే ।
సాంఖ్యే కృతాంతే ప్రోక్తాని సిద్దయే సర్వకర్మణామ్ ।। 13 ।।
ఓ అర్జునా, ఏ కార్యము చేయబడాలన్నా వాటి వెనుక ఉన్న ఐదు కారకముల గురించి సాంఖ్య శాస్త్రము ప్రకారం ఏమి చెప్పారో ఇప్పుడు చెప్తాను వినుము, అది కర్మ ప్రతిచర్యలను ఎలా నిరోధించాలో వివరిస్తుంది.
11వ శ్లోకంలో సాంఖ్య శాస్త్రం చెప్పబడిన మానసిక కర్మల గురించి చెప్పుకుంటూ, మనం చేసే ప్రతీ పని వెనుకా జ్ఞానేంద్రియాలు, మనస్సు, తెలివితేటలు, అహంకారం, నైతికత అనే ఫిల్టర్స్ ఆధారంగా మనం చేసే మానసిక కర్మలు (perceptions) ఏర్పడతాయని చెప్పుకున్నాం కదా. అవసరం అయితే ఆ శ్లోక తాత్పర్యాన్ని మరోసారి చదవండి. కృష్ణ భగవానుడు సాంఖ్య శాస్త్రాన్ని ఉదహరిస్తూ అదే చెప్పబోతున్నారు. కొంతమంది అనుకోవచ్చు.. దీన్ని “ఇంత వివరంగా తెలుసుకోవడం వల్ల ఉపయోగం ఏంటి?” అని!
“నాకు తెలీకుండానే నా మనస్సులో విపరీతమైన ఆలోచనలు వచ్చేస్తున్నాయి, నా మైండ్‌ని నేను కంట్రోల్ చేసుకోలేకపోతున్నాను” అని బాధపడే వారూ, “నా కోపాన్ని కంట్రోల్ చేసుకోలేక అందరిపై అరిచేస్తున్నాను” అనుకునే వారూ అసలు ఈ ప్రవర్తన వెనుక కారణాలు తెలిస్తే, తమ ప్రతీ ఆలోచననీ ఏ ఫిల్టర్ స్థాయిలో జరుగుతోందో గుర్తించగలిగితే అప్పుడు దాని వరకూ సరిచేసుకోవచ్చు. ఉదా.కి.. మీరు రోడ్ మీద వెళుతుంటే అల్లంత దూరంలో ఓ వ్యక్తి క్రిందపడిపోతే అతన్ని ఎవరూ పైకి లేపకుండా ఎవరి పాటికి వాళ్లు వెళ్లిపోతున్నారు అనుకోండి. మీ కళ్లు ఆ సంఘటనని చూస్తే మీ మైండ్ ఏం జరిగిందో గుర్తిస్తే, మీ తెలివితేటలతో మీరు దాన్ని జడ్జ్ చేస్తుంటారు.. ఏమని? “సమాజంలో కనీసం మానవత్వం లేకుండా పోయింది” అనే భావోద్వేగం మిమ్మల్ని ఆవరిస్తుంది. ఆ ఆలోచన వచ్చిన వెంటనే పైన సాంఖ్య శాస్త్రం చెప్పిన విషయాల పట్ల అవగాహన ఉంటే వెంటనే మనల్ని మనం ఛెక్ చేసుకోవచ్చు.. “ఈ నిరుత్సాహం ఎవరు తెచ్చారు?” అంటే అది మన తెలివితేటల వల్ల వచ్చిన నిరుత్సాహం. ఇప్పుడు ప్రతీ దాన్నీ జడ్జ్ చేసే మానసిక కర్మని అధిగమించి నిరుత్సాహం లాంటి ఎమోషన్స్‌ని మూటగట్టుకునే స్వభావాన్ని సరిచేసుకోవచ్చు.
అందుకే జ్ఞానం అనేది ఆచరణలో పెట్టినప్పుడు మాత్రమే ఒక మనిషి మహాత్ముడవుతాడు. ఊరికే చదివి వదిలేస్తే, మన ప్రతీ ఆలోచననూ సంస్కరించుకునే ఓపికా తీరికా లేకపోతే, జీవిత ప్రవాహంలో కొట్టుకుపోతే నిన్నటి మన ప్రవర్తనే ఈరోజూ అలాగే కొనసాగుతుంది, ఈరోజు ఎలా ఉంటామో రేపూ అదే రియాలిటీ కళ్ల ముందు నిలుస్తుంది.
14వ శ్లోకం:
అధిష్ఠానం తథా కర్తా కరణం చ పృథగ్విధమ్ ।
వివిధాశ్చ పృథక్ చేష్టా దైవం చైవాత్ర పంచమమ్ ।। 14 ।।
శరీరము, కర్త, వివిధ ఇంద్రియములు, వివిధ రకాల కృషి, దైవానుగ్రహము – ఇవే కర్మ యొక్క ఐదు అంగములు.
ఈ శ్లోకంలో భగవానుడు స్వయంగా కర్మ కారకాలను చెబుతున్నారు. “అధిష్టానం” అంటే మన ఆత్మని అకామిడేట్ చేస్తున్న (చోటు ఇచ్చిన) మన శరీరం. మన సోల్ (ఆత్మ) చేత మన పూర్వ కర్మలు, ప్రస్తుత కర్మలను అనుసరించి వాటి పర్యవసానాలను అదే రకమైన ఎనర్జీ ఫీల్డ్ అదే రూపంలోనూ, మరో రూపంలోనో టైమ్, స్పేస్ అనే త్రీ-డైమెన్షనల్ పరిమిత దృష్టికి ఆవల ఏదో ఒక సమయంలో అంటే ఈ జన్మలో గానీ మరుజన్మలో గానీ, ఈరోజు గానీ సంవత్సరం తర్వాత గానీ, పదేళ్ల తర్వాత గానీ, ముసలితనంలో గానీ.. మనం చూసే కాల విభజనకి అతీతంగా మన చేత అలాంటిదే కర్మ చెయ్యబడడమూ, లేదా ఫలితం అనుభవించడం జరుగుతాయి. స్పేస్ అంటే.. నువ్వు ఒక వ్యక్తికి హాని చేస్తే ఈ విశాల విశ్వంలో కొంత స్థలంలో ఉన్న ఆ వ్యక్తి భౌతిక రూపం (స్పేస్) మాత్రమే నేరుగా మీకు హాని చెయ్యాలని లేదు. అది వేరే ఏ రూపంలో గానీ, వేరే మనిషి కావచ్చు, వేరే పరిస్థితి కావచ్చు, సమస్య కావచ్చు, జీవి కావచ్చు.. వాటి ద్వారా అది మన జీవితంలోకి రావచ్చు.
పైన భగవానుడు చెప్పినట్లు.. ఒక కర్మ (పని) చెయ్యడానికి ఇంద్రియాలు టూల్స్ (పనిముట్లు) లాంటివి. వీటిని జ్ఞానేంద్రియాలు, కర్మేంద్రియాలు అని రెండు రకాలుగా విభజిస్తారు.
బయట జరిగే విషయాలను, మన ఎదురుగా ఉన్న మనుషుల ప్రవర్తనను, సంఘటనలను చూడడానికి, వినడానికి, వాసన తెలుసుకోవడానికి, స్పర్శ తెలుసుకోవడానికి.. ఇలా వివిధ రకాల సమాచారాన్ని బయటి ప్రపంచం నుండి స్వీకరించేవి, రుచి చూడడం ద్వారా, ఇతరుల్ని టచ్ చెయ్యడం ద్వారా బయట ప్రపంచంలోకి అందించేవి జ్ఞానేంద్రియాలు. అవే చర్మం, కళ్లు, నాలుక, చెవులు, ముక్కు.
ఈ జ్ఞానేంద్రియాలు అనేవే లేకపోతే బయట ప్రపంచం ఆధారంగా ఇంటెలిజెన్స్‌తో విశ్లేషించుకుని, దానికి ఇగో అప్లై చేసి మన అంతర్గత ప్రపంచాన్ని సృష్టించుకోవడం సాధ్యం కాదు. బయట నుండి తీసుకున్న సమాచారాన్ని విశ్లేషించుకున్న తర్వాత మన మైండ్‌లో ఏర్పడే ఓ మెంటల్ ఇమేజ్ ఆధారంగా.. మనం కోప్పడడం గానీ, కాళ్లతో పరిగెత్తడం గానీ ఇలా.. కర్మేంద్రియాల ద్వారా ఎగ్జిక్యూట్ చెయ్యబడడం మొదలవుతుంది.
ఉదా.కి.. కన్ను అనే జ్ఞానేంద్రియం ద్వారా బొద్దింకను చూశారు అనుకోండి. “బొద్దింక అంటే నాకు చచ్చేంత ఏవగింపు” అనే భావనను సృష్టించేది మీ ఇంటెలిజెన్స్. ఆ ఇంటెలిజెన్స్ అనే ఫిల్టర్ ఆధారంగా జడ్జ్మెంట్ జరిగిపోయాక.. ఆ డేటాని మీ బ్రెయిన్లోని మోటార్ మెకానిజం ప్రాసెస్ చేసి, కాళ్లు కదిలించి పరిగెత్తమని అదేశాలను సెంట్రల్ నెర్వస్ సిస్టమ్ ద్వారా మీ కాళ్లకి చేరవేయడం అనేది కర్మేంద్రియ లక్షణం. మాట్లాడడం, చేతులు, పాదాలు కదపడం, మన శరీరంలోని విసర్జన అవయువం అయిన మలద్వారం, మనిషి తన సెక్స్ కోరికలను తీర్చుకోవడానికి, జన్మని ఇవ్వడానికి ఉపయోగపడే జననేంద్రియాలు ఇవన్నీ కర్మేంద్రియాలు.
కృష్ణ భగవానుడు పైన చెప్పిన శ్లోకంలో.. “వివిధాశ్చ పృథక్ చేష్టా” అంటే కేవలం ఇంద్రియాలు ఉన్నంత మాత్రాన సరిపోదు.. ఫలానా పని చెయ్యాలన్న సంకల్పం ఆ మనిషికి కలగాలి. అప్పుడే పైన చెప్పబడిన ఇంద్రియాలనే టూల్స్ ఆధారంగా ఆ సంకల్పం కాస్తా కర్మగా మారుతుంది. ఉదా.కి.. ఈ భగవద్గీత తాత్పర్యాలనే తీసుకుందాం. మీ కళ్లు అనే జ్ఞానేంద్రియానికి ఈ శ్లోకం కన్పించింది అనుకోండి. “ఇదేదో తెలుసుకుందాం, నా జీవితానికి ఉపయోగపతుందేమో, నేను ఇంకా మెరుగ్గా తయారవ్వాలి” అనే సంకల్పం కలగడం భగవంతుడు చెప్పినట్లు చేష్ట క్రిందకు వస్తుంది. ఆ సంకల్పం కలిగినప్పుడే శ్రద్ధగా చదవడమూ, అర్థం చేసుకునే ప్రయత్నం చెయ్యడం జరుగుతుంది. అంటే ఒక జ్ఞానం మీకు అందాలన్నా, లేదా ఇంకొకర్ని కోపంతో తిట్టాలన్నా, “అయ్యో అతను కష్టాల్లో ఉన్నాడు, నా వంతు సాయం చేద్దాం” అనే భావన రావాలన్నా సంకల్పాల ద్వారానే వస్తుంది. అందుకే పూజలు చేసేటప్పుడు సంకల్పం బలంగా చెప్పుకోండి అంటారు. సంకల్పం అనేది ఓ ఎనర్జీ. అది వివిధ టూల్స్‌ని ఉపయోగించుకుని కర్మలు చెయ్యడానికి ఉత్ప్రేరకం లాంటిది.
ఈ శ్లోకంలో భగవానుడు దైవానుగ్రహం వల్ల కూడా కర్మలు ఏర్పడతాయని తెలిపారు. “దేవుడా అన్నీ నాకే మంచి చేయి, పక్కన వాడు ఏడుస్తూ బ్రతకాలి” అని కోరుకుంటే దేవుడు/విశ్వం వినదు. ఆఫ్టరాల్ నువ్వూ, నేనూ ఎంత.. ఓ పెద్ద సరస్సు లాంటి విశాల విశ్వంలో ఓ మూలన మట్టిని పట్టుకుని వేలాడుతున్న చిన్న కప్పల లాంటి వాళ్ళం. అందరి కదలికలను గతంలో వెదజల్లిన ఎనర్జీ ఆధారంగా ఓ క్రమపద్ధతిలో పెట్టడమే సృష్టి ధర్మం. మనం ఎన్ని పాపాలు చేసినా, ఇతరుల్ని కష్టపెట్టినా మనకుండే పలుకుబడి ఆధారంగా మనం దేవుళ్లకి, దేవాలయాలకు విపరీతంగా మొక్కొచ్చు. కానీ ఎన్ని చేసినా కర్మ అనుభవించాల్సింది ఉంటే అది వెంటాడుతూనే ఉంటుంది. దైవానుగ్రహం అంటే దేవుడిని ప్రసన్నం చేసుకోవడం కాదు.. అన్నింటినీ దారిలో పెట్టేలా దైవ శక్తి తన స్వంత ఇంటెలిజెన్స్‌ని కొనసాగించేలా ఆమోదించడం! స్వాగతించడం, సరెండర్ అవడం! జీవుడు దేవుడి చర్యలను ఆమోదించినా ఆమోదించకపోయినా దైవ శక్తికి వచ్చే నష్టమేమీ లేదు. అది చట్టంలా తన పని తాను చేసుకుంటూ పోతూనే ఉంటుంది. కానీ “నువ్వెవడివి నాకు చెప్పేది, నా లైఫ్ నా ఇష్టం” అని అహానికి పోయి విశ్వ శక్తిని తిరస్కరిస్తే విశ్వ హార్మొనీకి సహకరించని ఆ రిజెక్షన్ కాస్తా ఏదో ఒక రూపంలో కర్మఫలాలుగా అనుభవంలోకి వచ్చి ఫలితాలు వస్తాయి. అదే సరెండర్ అయితే జరగాల్సింది జరిగి, ఇకనైనా జాగ్రత్తగా ఉంటాం.
కొంతమంది అంటుంటారు.. “ఎన్నో పాపాలు చేసిన వాళ్లు ఎంతో సంతోషంగా తిరుగుతున్నారు” అని ఆవేదన వ్యక్తం చేస్తుంటారు. పైన చెప్పిన టైమ్, స్పేస్ అనే భావనను మళ్లీ గుర్తు తెచ్చుకోండి. లేదా మళ్లీ చదవండి. మనం విశ్వంలోకి వెదజల్లే ప్రతీ ఎనర్జీ అంతే బలంగా ఏదో ఒక రూపంలో, ఏదో ఒక కాలంలో రాక మానదు. మన పనులన్నీ మానేసి ప్రతీ క్షణం అలా పాపాలు చేసిన వాళ్లతోనే ఉంటే మాత్రమే.. ఆ ఫలితాలు వాళ్లు ఎలా అనుభవిస్తారో మన నోటీస్‌కి వస్తుంది. అంత ఓపికా తీరికా మనకు లేక, కేవలం బయటకు వాళ్లు నవ్వేది, బయట వాళ్లు కలిగి ఉండే సంపద, డబ్బుని చూసి పాపాలు చేసినా వాళ్లు సుఖంగా ఉన్నారు అనే భ్రమలోకి వెళుతుంటాం. ఇలాంటి భ్రమలు కలిగి ఉండడం కూడా మనం చేసే కర్మలే. ఓ మాయ మనల్ని కప్పేసి ఓ వాస్తవం నుండి దూరం చేసి, వాళ్లు పాపం చెయ్యగా లేనిది నేనెందుకు చెయ్యకూడదు అని మీరూ దారి తప్పేలా చేస్తుంది.
- Sridhar Nallamothu