ఇంటి వెనుక నులక మంచం మీద అమ్మ ఒళ్లో తలపెట్టుకుని పడుకున్నాను. నా తల మీద చేయి పెట్టి జుట్టు సరిచేస్తూ కూర్చుంది సుమతమ్మ. పలకరిస్తే “ఆ.. ఊ” అంటోంది తప్పించి సరైన బదులు లేదు. కళ్లల్లోకి చూస్తే స్థబ్ధుగా కూర్చుని ఉంది.
అమ్మకి ఒంటి నిండా పుళ్లు. ఆరోజే హైదరాబాద్ నుండి వచ్చింది. మానసిక స్థితి సరిలేకపోవడంతో ఎర్రగడ్డలో చేర్చారట. అక్కడ ట్రీట్మెంట్కి బెదిరిపోయినట్లుంది.. ఊరికూరికే ఉలిక్కిపడుతోంది. అమ్మ సరిగా మాట్లాడడం లేదని మనస్సులో ఓ దిగులు.. అది బయటకు చెప్పుకోగలిగేదీ కాదు, సరయ్యేదీ కాదు.
“అల్మారాలో డబ్బులు తీసుకుని బాపట్ల వెళ్లి అమ్మకి టాబ్లెట్లు తీసుకురాపో” అని అమ్మమ్మో, తాతయ్యో చెబితే చీటీ తీసుకెళ్లి అరకిలోమీటరు రోడ్ దాకా నడిచెళ్లి పెదనందిపాడు నుండి చీరాల వెళ్లే ఆర్టీసీ బస్ పట్టుకుని వెళ్లేవాడిని. బాపట్ల భావన్నారాయణ స్వామి గుడి రోడ్లో ఓ మెడికల్ షాపు ఉండేది. నేను చీటీ చూపించగానే స్లీపింగ్ పిల్స్ ఇచ్చే వారు. అమ్మకి అవే మెడిసిన్ అని అప్పుడే నాకు తెలిసింది. ఎప్పుడు చూసినా అమ్మ మత్తుగా పడుకుని ఉండేది.
మరో నెలరోజుల్లో టెన్త్ ఎగ్జామ్స్ ఉన్నాయనగా బయట నుండి ఇంటికి రాగానే ఇంట్లో ఏడుపులు విన్పిస్తున్నాయి. “అమ్మ చనిపోయింది” అన్నారు. ఎలా స్పందించాలో తెలీదు. అందరూ ఏడుస్తుంటే ఏడ్చాను. ప్రేమ లేదా అంటే చాలా ప్రేమ ఉంది, కానీ ప్రేముంటే ఏడవాలని తెలీదు. అలా ఆమె శవం వైపు నిస్తేజంగా చూస్తున్నాను. నాచేతే తలకొరివి పెట్టించారు. భుజం మీద కుండ పెట్టి కట్టెల మీద పేర్చిన అమ్మ శవం చుట్టూ మూడుసార్లు తిరగమన్నారు. చేతికి నిప్పు ఇచ్చి, అంటించి వెనక్కి తిరగకుండా ముందుకెళ్లమన్నారు. అస్థికలు విజయవాడ కృష్ణ నదిలో కలిపి వచ్చాం నేనూ, తాతయ్య.
అమ్మ చనిపోయిన నెలరోజులకి టెన్త్ ఎగ్జామ్స్. బాపట్ల విలియంబూత్ కాలేజ్‌లో సెంటర్. ఎగ్జామ్ రాస్తుంటే చేయి తిరగడం లేదు. ఒకే అక్షరాన్ని అలాగే ఒకటికి రెండుసార్లు మెలితిప్పితే గానీ మరో అక్షరం రాయగలిగే వాడిని కాదు. అవి మానసిక వత్తిడి అని అప్పుడు తెలీదు.
నాకు స్లీపింగ్ పిల్స్ ఎలా అలవాటయ్యాయో తర్వాత రాస్తాను. ఇక్కడ ఒక విషయం చెప్పాలి. నాకు స్లీపింగ్ పిల్స్ అలవాటయ్యాక ఒక రోజు నేను రోజూ తీసుకునే డోస్‌కి సరిపడా స్టాక్ దొరకలేదు. సో ఫిట్స్ వచ్చిన వాళ్లకి ఉపయోగించే గార్డినల్తో పాటు, రెండు వేర్వేరు గ్రూపులకి చెందిన స్లీపింగ్ పిల్స్ కలిపి నాకు కావలసిన క్వాంటిటీలో వేసుకుని పడుకున్నాను. ఎప్పుడు నిద్రపోయానో, ఎలా నిద్రపోయానో తెలీదు. అర్థరాత్రి లేస్తే కరెంట్ లేదు.. చీకట్లో ఏదో పలవరిస్తూ అటూ ఇటూ తిరుగుతున్నానట. మా పెద్దక్కా, నేనే ఉన్నాం. కామ్‌గా పడుకోమంటే పడుకోవట్లేదట. అంతలో మా పక్కింట్లో ఉండే మా బంధువుల ఆమె ఒకామె నిద్రలేచి మా అక్కకి తోడుగా వచ్చి.. “అచ్ఛం వాళ్లమ్మలానే అరుస్తున్నాడు, వాళ్లమ్మలాగే అవుతున్నాడు” అంటూ మా అక్కని మరింత భయపెట్టిందట. ఇప్పటికీ మా అక్క దాన్ని గుర్తుచేసుకుని బాధపడుతుంది.
మా అమ్మని దగ్గరగా చూశాక, నేనూ అలవాట్ల బారిన పడ్డాక ఒక మనిషి జీవితం అతని మైండ్‌లో ఉంది అన్నది అర్థమైంది. మానసిక ఆరోగ్యం ప్రాధాన్యత చాలా అర్థమైంది. మా అమ్మ అలా ఎలా మానసిక స్థిమితం కోల్పోయిందో తెలుసుకునే ప్రయత్నంలోనే బ్రెయిన్, మైండ్, భావోద్వేగాలు, న్యూరో కెమికల్స్, బ్రెయిన్లోని న్యూరల్ నెట్‌వర్క్‌లు, థాట్ ప్రాసెస్లు, మెంటల్ బ్లాక్స్ వంటివి అధ్యయనం చెయ్యడం మొదలెట్టాను. అది ఎంత లోతుగా ప్రతీరోజూ నేర్చుకుంటున్నాను అంటే ఓ న్యూరాలజిస్ట్ కూడా అంత ఆసక్తి చూపించకపోవచ్చు.
ఒక్కటి మాత్రం నిజం.. “శ్రీధర్ బాబూ” అని అమ్మ ప్రేమగా పిలిచే పిలుపు శాశ్వతం. నన్ను ఎవరైనా శ్రీధర్ అంటే ఊరుకునేది కాదు.. “శ్రీధర్ ఏంటి శ్రీధర్, శ్రీధర్ బాబు అనండి” అని వత్తిడి చేసేది. అమ్మ పోయాక మా ఉమక్క, పద్మక్క నన్ను “బాబు” అని పిలవడం మొదలెట్టారు.
- Sridhar Nallamothu