ఎవరి జీవితాల్లో వారు బిజీగా ఉండే జనాలంతా ఓ చోట చేరారు.. ఓ సందడి వాతావరణం సృష్టించబడడానికి రంగం సిద్ధమైంది…. అది పెళ్లి కావచ్చు.. మరో శుభకార్యం కావచ్చు..
సందడి చేద్దామంటే మనస్సులు తాళాలేయబడి ఉన్నాయి…. ఒకర్నొకరు అరమరికలు లేకుండా పలకరించుకునే చనువూ కొరవడింది… కానీ “మౌనం భరించలేక” పొడిపొడి పలకరింపులు సాగుతున్నాయి.. ప్రశ్నలూ, సమాధానాలూ… కొద్దిసేపు ఆకాశంలో సుదీర్ఘమైన చూపులూ.. ఆపై పనైపోయినట్లు ఒకర్నొకరు విడివడడం.. మరో మనిషి వైపో, మరో గుంపుకు సమీపంగానో చేరుకోవడం… అక్కడన్నా స్థిమితంగా ఉందామన్న ప్రయత్నం..
మనుషుల మధ్య మాటలు కొరవడ్డాయనడానికి అతి సహజమైన పేలవమైన మాటలతో ముగిసిపోయే సంభాషణలే నిదర్శనం… ఏ శుభకార్యం చూసినా అందరి మొహాల్లో బలవంతంగా తెచ్చిపెట్టుకునే నవ్వులూ… సంతోషం.. మనస్సులో తెలీని వెలితి….
మనుషుల మధ్య ఎంటర్టైన్మెంట్ మిస్ అవుతోంది.. మనుషుల మధ్య బలమైన బంధం మిస్ అవుతోంది… అవతలి మనిషి మొహంలో నిరాసక్తతని గమనించి… ఎవరికి వారు ఒకళ్లనొదిలేసి మరొకళ్ల వైపు సాగిపోతూనే ఉంటుంటారు…
తప్పదు కాబట్టి శుభకార్యాలకు హాజరవుతున్నారు గానీ… ఎవరికీ ఎవరితోనూ కలిసే ఆసక్తి లేదు… ఏమాత్రం ఆసక్తి ఉన్నా మనుషుల్ని కలవడం గురించి కాదు… ఖరీదైన కారుల్నీ, చీరల్నీ, దర్జానీ ప్రదర్శించుకోవాలన్న ఆసక్తే మిగిలింది…
——————————————-
ఎవరూ ఎవరి గొప్పదనాన్నీ ఒప్పుకోని ఫ్యాషన్ షోల్లా శుభకార్యాలు మారిపోయాయి. ఆ ఫ్యాషన్ షోల్లో కొన్ని గొంతులు చూపించుకోవడానికి ఏం లేక పూర్తిగా మూగబోతాయి.. అవి ఏ సెల్‌ఫోన్ కాంటాక్టులనో వెదికేసి.. అర్జెంటుగా ఇంతకాలం గుర్తురాని ఏ ఫ్రెండ్‌కో కాల్ చేసి… తమని తాము ఎంటర్టైన్ చేసుకునే ప్రయత్నం… తాము ఒంటరిగా లేమని ఆ హంగామా వాతావరణంలో ధైర్యాన్ని కూడగట్టుకునే ప్రయత్నం, లేదా ఏ Temple Run వంటి గేముల్లోనో మునిగిపోయి ప్రపంచంతో తమకేం పనిలేదన్నట్లు పేరుకుపోతున్న శూన్యతని పోగొట్టుకునే ప్రయత్నం.
—————————–
ఇంతలో భోజనాల చేసేయొచ్చంటూ ఎవరో ఒకరు చెప్పేయడం.. అప్పటిదాకా చాలా అసహనంగా కదలాడిన జనాభా చాలా రిలీఫ్ ఫీలై.. మళ్లీ ఆ ఫీలింగ్ బయటకు కన్పించకుండా… మెల్లగా క్యూలో చేరిపోవడం….
వచ్చినప్పటి నుండి ఎప్పుడెప్పుడు భోజనాలు చేసేది వెళ్లిపోదామా అన్న అటెండెన్స్ కల్చర్‌కి అలవాటు పడిపోవడం వల్ల చేయి కడుక్కోవడం ఆలస్యం… ఎటు వాళ్లు అటు సర్ధుకునే ప్రయత్నం..
———————————-
ఇది పెళ్లిళ్ల, గృహప్రవేశాల, ఇతర శుభకార్యాల సీజన్ కదా…. ప్రతీ ఒక్కళ్లకీ ఖచ్చితంగా ఎదురయ్యే తతంగం ఇది.
మనుషుల మధ్య దూరాన్ని శుభకార్యాలు సైతం తగ్గించలేనంత మనుషుల కూడికలూ… విడివడడాలూ!!
– నల్లమోతు శ్రీధర్
ఒకప్పుడు ఒక చోటు నుంచి వెళ్ళటానికి చాలా కష్టమయ్యేది.ఇలా వెళ్ళి అలా వొచ్చెయ్యటం కుదిరేది కాదు.ఆ సందర్భాల్లో తప్ప కలవడం కుదిరేది కాదు కాబట్టి కాబట్ట్టి వెళ్ళిన వాళ్ళు కాలాన్ని అలా సద్వినియోగం చేసుకునే వాళ్ళు.ఇప్పుడలా కాకుండా మామూలప్పుడు కూడా మొబైల్స్ ద్వారా కాంటాక్ట్ లో ఉండటం వల్ల ఆయా సందర్భాలకి విలువ తగ్గింది, అంతే ననుకోవచ్చు.