సమయాన్నీ, పనుల్నీ, ఎమోషన్లనీ, నిద్రనీ, బాహ్య ప్రపంచపు ఇష్టాల్నీ, అవయువాల కదలికల్నీ.. అన్నింటినీ తాకట్టు పెట్టి ఒంటరిగా కూర్చునీ సమూహంలో ఉన్నంత తృప్తి పడడం అదృష్టమో, శాపమో.
క్షణాలూ, నిముషాలూ, గంటలూ కరిగిపోతున్నా.. మొహంపై పరుచుకున్న మోనిటర్ వెలుతురు కళ్లల్లో జీవాన్ని లాక్కుంటున్నా.. తల తిప్పలేని బలహీనత..!
ఏవేవో చదువుతూ.. మనవి కాని ఎమోషన్లని రెచ్చగొట్టుకుంటూ మనం పడుతున
నిద్ర తూలుకొస్తోంది.. వాలిపోయే కనురెప్పల్ని చండ్రాకోలుతో అక్షరాల వెంట పరుగుపెట్టిస్తూ పెడుతున్న హింస ఆ సున్నితమైన కళ్లని ఎంత బలహీనపర్చట్లేదూ?
మనం మాట్లాడుకోవడానికే పుట్టామేమో.. పనులన్నీ అటకెక్కించి.. మాటలు కోటలు దాటించుకుంటున్నాం.
కుర్చీల్లో కూలబడి బండి టైర్లయినా అంత సాలిడ్‌గా ఉంటాయో లేదో గానీ నడుముల చుట్టూ మందపాటి టైర్లు కూడబెట్టుకుంటున్నాం.
బానెడు పొట్టకు లైపోలూ, సమాజాన్ని సంస్కరించడంలో వేడెక్కి ఊడిపోయే జుట్టుకి న్యూజెన్లూ ఎటూ ఉండనే ఉన్నాయి.
ఎంత లోకజ్ఞానం.. ఎంత లోకజ్ఞానం… నేను టెక్నాలజీ, సైకాలజీ, చెప్తాను.. మీరు సినిమాలు చెప్తారు.. మరో ఫ్రెండ్ రాజకీయాలు చెప్తాడు.. ఫేస్బుక్ ఏర్చికోర్చి అందర్నీ ఇక్కడ కలపడం లోకకళ్యాణానికో, ఉపద్రవానికో, లేక మాటలతో బాధ్యతల్నుంచి మనల్ని ఎస్కేప్ చేయించడానికో 🙂
నేను ఇది రాస్తున్నా, మీరు ఇంకోటి రాస్తున్నా.. అందరం అందరికీ చెప్పుకునే వాళ్లమే. పాపం విని ఆచరించే వారు మాత్రం కరువైపోతున్నారు. మన హ్యాండ్సెట్లు ట్రాన్స్మిషన్ మోడ్‌లోనే పనిచేస్తున్నాయి.
తెల్లారాక "శుభోదయం" అయినా, పడుకోబోయే ముందు "శుభరాత్రి" అయినా ఎవరైనా పట్టించుకుంటున్నారో లేదో తెలీదు.. మనకు చెప్పుకోవడానికి అవకాశం ఉంది కాబట్టి చెప్పుకుంటున్నాం.
"ఎవరికోసం ఈ వెర్రి రాతలు.. నీ రాతలకు అపార్థాలు వస్తే.. నువ్వు ఆ అపార్థాల్ని తొలగించే ప్రయత్నం నన్ను హింసపెట్టే కదా చేసేది" అంటూ వేళ్లు తడబడుతూ ఆచితూచి టైప్ చేస్తానంటున్నాయి. పాపం వాటి భయం వాటిది.
మొత్తానికి మంచో, చెడో ఉన్నదంతా చెప్పేసుకుంటూ.. కాలం కరగదీస్తున్నాం.. ముచ్చటపడి కొనుక్కుపెట్టుకున్న ఓ కంప్యూటర్ డబ్బా ముందు!
ఆయుష్షు హరిస్తోంది.. కళ్లు మసకబారుతున్నాయి.. కాళ్లు కదల్లేకపోతున్నాయి, సమయం చేతులు దాటుతోంది, పనులు మూలన పడుతున్నాయి, కొత్త స్నేహితులేమో కానీ అనేకమంది ముక్కూ మొహం లేని శత్రువులు తయారవుతున్నారు.. ఇన్ సెక్యూరిటీలు పెరుగుతున్నాయి, వాదనలు జరుగుతున్నాయి, ఓపికలు నశిస్తున్నాయి, విచక్షణ పోతోంది, మనది కాని భాష వాడుతున్నాం, దిగజారుతున్నాం..
చివరకు పర్పస్‌ఫుల్ లైఫ్ కాస్తా… దమ్మిడీ ఉపయోగం కూడా లేకుండా ముగిసిపోతోంది 🙁
గమనిక: ఇందులో ఎవర్నీ తప్పు పట్టలేదు.. మారుతున్న మన జీవనశైలిని అక్షరబద్ధం చేసే ప్రయత్నమంతే. ఇందులో అనేక విషయాలు నాకూ వర్తించవచ్చు. నాకు వర్తించే విషయాలు నేను ఆచరణలోకి తీసుకుంటానని చెప్పగలను. దీని గురించి ఆలోచించాలా లేదా అన్నది మిగతా వారి ఇష్టం.
ధన్యవాదాలు
– నల్లమోతు శ్రీధర్
ఎడిటర్
కంప్యూటర్ ఎరా తెలుగు మేగజైన్
Leave a Reply