అప్పుడెప్పుడో నేను సినిమా ఫీల్డ్‌లో ఉన్నప్పటి సంగతి… హిట్లర్ మూవీ 100 days ఫంక్షన్ ఒంగోలులో కవర్ చెయ్యడానికి వెళ్లాను చెన్నై నుండి..
ఆడిటోరియం చుట్టూ పటిష్టమైన భద్రత… పని మీద సెక్యూరిటీ మధ్య నుండి నేను లోపలికీ బయటకూ వెళ్తుంటే జనాలు బ్రతిమిలాడుతున్నారు.. “అన్నా ఒక్కసారి నన్నూ లోపలికి తీసుకెళ్లవా” అని! అభిమాన తారల్ని చూడాలన్న తపన, ఒకర్నొకరూ తోసుకుంటున్నారు… కానీ లాభం లేదు..
అలాంటి 100 రోజుల వేడుకలూ, అభిమానుల పిచ్చి అభిమానమూ చాలానే చూశా అప్పట్లో..
———–
కట్ చేస్తే..
సినిమా రివ్యూలే పనిగా రన్ అవుతున్న అనేక వెబ్సైట్లు గత కొన్నేళ్లుగా చూస్తున్నా.. అలాగే FB వంటి సైట్లలోనూ… విపరీతమైన పిచ్చి అభిమానం.. ఒకర్నొకరు బండబూతులు తిట్టుకుంటారు.. ఒక్క పల్లెత్తి మాట అననీయరు తమ హీరోని!
——————-
సినిమా వాళ్లని నేను జీవితంలో చాలా క్లోజ్‌గా చూశా, మూవ్ అయ్యా. పవన్ కళ్యాణ్ వంటి వారిని “అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి”కి ముందు మొట్టమొదట ఇంటర్వ్యూ చేసిన కొద్దిమందిలో నేను ఒకడిని… బాలయ్య, చిరు, వెంకటేష్, నాగార్జున, రజనీ, కమల్, మాధురి దీక్షిత్, మనీషా కొయిరాలా వంటి వాళ్లెందరినో దగ్గరగా
గమనించగలిగాను..
వాళ్లంతా ఎంత సాధారణంగా ఉంటారో, తమ పనిని తాము చేసేసి తమ రెమ్యూనరేషన్ తీసేసుకుని తమ లైఫ్ తాము ఎంత కాజువల్‌గా లీడ్ చేస్తారో.. దానికి భిన్నంగా బయట చూస్తే ఒక హీరో ఫ్యాన్ మరో హీరోతో ఫైట్ చేస్తూ ఉంటాడు.. అదేమంటే.. తమ హీరో గొప్ప అంటాడు…
ఈ మధ్య చూస్తున్నాను… చాలామంది అభిమానులు పరాకాష్టకు చేరుతున్నారు. ఓ హీరో పట్ల తాము చూపించే అభిమానంలో 10% తమ లైఫ్ పట్ల జాగ్రత్త తీసుకుంటే చాలా మంచి పొజిషన్లో ఉంటారు..
ఇక్కడ కొందరికి జీర్ణించుకోవడానికి కష్టమైనా కొన్ని విషయాలు చెప్పదలుచుకున్నా…
—————————–
1. ఏ హీరో అయినా స్క్రీన్ మీద కన్పించిన దానిలో 10% కూడా హీరో లక్షణాలు కలిగి ఉండడు. ఎందుకూ పనికిరాని వ్యక్తిని కూడా హీరోగా ఎస్టాబ్లిష్ చేయొచ్చు. ఇది ఖచ్చితంగా నమ్మి తీరాల్సిన నిజం..
2. చాలామంది హీరోలకు వాళ్ల అభిమానులు కటౌట్లు పెడుతూ, రిపీటెడ్ షోస్ చూస్తూ చూపించే శ్రద్ధలో కొద్దిశాతం కూడా సినిమా పూర్తయ్యాక ఆ సినిమా పట్ల బాధ్యత ఉండదు. సినిమా పూర్తయిందా, రెమ్యునరేషన్ వచ్చిందా, హిట్టా ఫట్టా అన్నవే ఆలోచిస్తారు.
3. అంతగా తిట్టుకుంటారూ, కొట్టుకుంటారు కదా…? ఏ హీరో అయినా మీ జీవితంలో మీకు directగా హెల్ప్ చేసింది ఏమైనా ఉందా? “ఫలానా హీరో వల్ల నేను జీవితంలో బాగుపడ్డాను” అని ఎవరైనా ముందుకొచ్చి చెప్పగలరా? డైలాగ్ రైటర్లు రాసే పంచ్ డైలాగులను హీరోలు ఐదారు టేకులు తీసుకుని చెప్తే… వాటిని గొప్ప గొప్ప జీవిత సత్యాలుగా వల్లించి జీవితం వికసించిపోయింది అనుకుంటారు కదా చాలామంది. ఆ పంచ్ డైలాగుల్లో ఉండే ఒకటి రెండు సత్యాలు పక్కన పడేసి ఓసారి ఏ స్వామి వివేకానంద బోధనలో చదవండి… జీవితం అంటే ఏంటో తెలుస్తుంది.
మాట్లాడడానికి సరదాగా ఉంటాయి కదా అని పంచ్ డైలాగుల్ని బట్టి పెట్టేసి.. మీరూ హీరోలైపోయినట్లు అనేసుకుంటే హీరోలైపోతారా?
4. పబ్లిక్ వెబ్ సైట్లలో మీరు మాట్లాడుతున్న బూతులు ఎప్పుడైనా గమనించారా? అపోజిట్ హీరో అభిమాని అంటే అంత చులకనా.. అసలు ఎంత దారుణమైన స్థితికి దిగజారిపోయినట్లు అంత పచ్చిబూతులు మాట్లాడుతుంటే? మీ హీరో అలాంటి బూతులను మాట్లాడమని మీకు చెప్తున్నాడా? ఇలా బూతులు మాట్లాడుకోవద్దని గైడ్ చెయ్యని, తమ స్వార్థం మాత్రమే తాము చూసుకునే హీరోల్ని నమ్ముకునా ఇలా మీరు దిగజారి ప్రవర్తిస్తోంది?
5. మీ హీరోల సినిమాల్ని వెనకేసుకొస్తూ చాలా గొప్ప పని చేస్తున్నారనుకుంటున్నారు గానీ… కేవలం మీలాంటి అభిమానులు చూసినంత మాత్రాన సినిమాలు సక్సెస్‌ఫుల్‌గా ఆడిపోవు.. ఒకవేళ మీకు మీరే ఒకటికి పదిసార్లు పనికిమాలిన సినిమాలను కూడా చూస్తూ ఆడించుకోవాలన్నా.. మీ జేబు ఖాళీ అవడం తప్పించీ లాభం లేదు. నాలాంటి కామన్ ఆడియెన్ ఏ సినిమా చూసినా, తన స్వంత అభిప్రాయాన్ని ఉన్నదున్నట్లు వ్యక్తపరిచినా గౌరవించడం నేర్చుకోవాలి. ఏ సినిమా అయినా సినిమా ప్రేక్షకుల కోసం తీస్తున్నది మీలాంటి ఇరుకు మనస్థత్వాలు ఉన్న అభిమానుల కోసం కాదు!
6. ఇకపోతే ఒక్కో హీరో ఒక్కొకరికి ఈ మధ్య కాలంలో చాలామందికి సంఘసంస్కర్తలుగా కన్పిస్తున్నారు.. మీకు అభిమానం ఉంటే వాళ్లని అభిమానించండి… కానీ స్థాయికి మించి కాదు.. స్థాయికి మించిన అభిమానం గుడ్డిదే అవుతుంది. ప్రపంచంలో గొప్ప గొప్ప వాళ్లు ఎందరో ఉన్నారు, నేర్చుకోదలుచుకుంటే వారి జీవితాల నుండి నేర్చుకోండి.. హీరోల నుండి ఏం నేర్చుకుంటారు….? ఏ సినిమా ఎంత కలెక్షన్ వసూలు చేసిందీ, ఎన్ని ప్రింట్లు రిలీజైందీ… ఈ పనికిమాలిన లెక్కలా…?
7. చివరిగా ఇది ఏ హీరోనీ, ఏ అభిమానినీ విమర్శించడానికి రాసింది కాదు. నేను చూశాను… సినిమా ప్రపంచంలో చాన్నాళ్లే ఉన్నా…. మీరు అనుకుంటున్నంత సీన్ అక్కడేమీ లేదు.. బయటకు హడావుడి అంతే… ఆ హడావుడి చూసి మీరు జీవితాలు కాల్చుకోకండి.
మీ జీవితానికి All the Best…
– నల్లమోతు శ్రీధర్
well said
chakkagaa cheppaaru.
I like it!
Chala practical ga matladaru….Nija jeevitham ki cinema jeevitham ku madya unna pichi adimanam gurinchi chakkaga chepparu…
Sridhar gaaru..chaalaa baagundi.nice post:):)
well said bro…!