ప్రాణం పోయబడుతోందీ… ప్రాణం తీయబడుతూనూ ఉంది…
ఏ ప్రాణానికాయుష్షెక్కువో లెక్కలేసుకుంటూ.. ఆయుష్షు తీరిన ప్రాణాల్ని చూసి వ్యధ చెందుతూ… అలాంటి క్షణాలు మనకేమూలలో పొంచి ఉన్నాయోనని భయపడుతూ… ఓ అస్థిమిత జీవితం నాటకరంగంపై ప్రదర్శించబడుతోంది..
రకరకాల రోగాలతో పోయిన ప్రాణానికీ కారణాలు తెలుసుకోవడం మనకు ఇష్టం… మన ప్రాణమూ పోకుండా కాపాడుకోవడానికి!
ప్రకృతి వైపరీత్యాల వల్ల అర్థాంతరంగా తీరిన ఆయుష్షుకీ జాతక, కర్మ ఫలాల చిట్టాపద్ధులు పరిశీలించడం మనకు ఉత్సుకత… ఏం పాపం ఆ ఘోరానికి దారితీసిందో అర్థం చేసుకోవాలన్న తాపత్రయం!
ఎలా పుట్టామో సైన్స్ చెప్తుంది.. ఎందుకు పుట్టామో జీవితం ముగిసిపోయే లోపూ అర్థం కాదు.. అర్థం చేసుకోవాలన్న ఆసక్తీ లేదు..
మనకు Purpose of life అవసరం లేదు.. మనకు కావలసిందంతా రంగస్థలంపై కొంత చోటుంటే చాలు.. మిగతా నటులతో కలిసి ఏవో హావభావాలో, దర్పాలో.. దర్జాల్లో, స్పందనలో ఒలకబోస్తూ దొరికిన జీవితాన్ని వినోదించడానికి!
—————————————————–
ఇన్ని వేల వేల ప్రాణాలు ఎందుకు వాయులీనం అవ్వాలి.. అన్నదే మనకు పెద్ద చింత…
తల్లి బొడ్డుతాడుని తెంచుకుని భూమ్మీద పుట్టిన ప్రతీ మనిషికీ ఆరంభంలో తన జీవిత గమ్యం గురించి అంతఃచేతనలో స్పష్టత ఉంటుంది…. ఎప్పుడైతే మనం ఆడిస్తూ, ఆశలు రేపుతూ, కోరికలు నేర్పుతూ.. పూర్తిగా ఈ ప్రపంచంతో కలిపేసుకుంటామో అప్పటివరకూ ఆ శిశువు బ్రహ్మతో నేరుగా సంబంధం కలిగే ఉంటుంది…. ఇది వేదాంతమూ కాదు.. మూఢ నమ్మకమూ కాదు… ఎంతో మానసిక సంఘర్షణ ద్వారానూ, నా స్వంత జీవితాన్ని అన్వేషించుకుంటూ, ఎన్నో జీవితాల్నీ, జీవన గమనాల్నీ గమనించుకుంటూ సాగే ప్రయత్నంలో అర్థమైన వాస్తవం…
ఏ క్షణమైతే తానొచ్చిన పని చేయడం మర్చిపోయి.. మనిషి వినోదించడం మొదలుపెడతాడో.. ఆ క్షణం నుండే ఆయుష్షు తగ్గించబడుతూ పోతుంటుంది… అలాగే మనం అనుభవిస్తున్న వినోదంతో పాటే రకరకాల బాధలూ చుట్టుముట్టబడేలా రంగస్థలంలో నాటకం రక్తి కట్టించబడుతుంది…
——————————————
మన శ్రద్ధంతా జీవితం యొక్క అర్థాన్ని, గమ్యాన్నీ అన్వేషించడం మీద పెట్టబడట్లేదు.. సంతోషం అనే ఓ మాయని అనుసరిస్తూ… వినోదాలతో, విలాసాలతో, మాయలతో, మాటలతో ఆ సంతోషాన్ని ఎలాగోలా నింపుకుంటూ.. అల్ప సంతోషులుగా క్షణ క్షణానికో కొత్త సంతోషాన్ని వెదుక్కుంటూ.. ఆ సంతోషాల మధ్య ఏర్పడే శూన్యతని చూసి బాధలుగా మనస్సుని కష్టపెట్టుకుంటూ…. సాగుతూ ఉంది జీవితం!!
ఒళ్లో ఒడ్డించిన జీవితాన్ని వీలైనంత సాగదీసుకుంటూ మాయల మధ్య సాగడమే ఒంటబట్టింది… ఇంకా ఈ జీవితం ఎందుకుందో అన్న ఆలోచన ఎలా స్ఫురిస్తుంది?
————————————————–
శ్వాస తీసుకోగలిగితే ప్రాణం ఉన్నట్లు.. శ్వాస తీసుకోవడం ఆగిపోతే ప్రాణం పోయినట్లు… ఇంతే తెలుసు మనకు!
ప్రాణం పోవడం అంటే ఈ ప్రపంచంలో మనదైన ఉనికిని పోగొట్టుకోబోతున్నామన్న భయమే మనకు తెలిసింది!!
రోగాలూ, జాతకాలూ, ప్రకృతి ప్రకోపాలూ ఏదేం జరిగినా… ఓ పర్పస్తో ఊపిరిపోయబడిన ప్రాణం ఆ పర్పస్ తెలుసుకుని కట్టుబడి ఉన్నంతకాలం అర్థాంతరంగా తీయబడదు…
పర్పస్ని వదిలేసి.. రంగస్థలంపై మన పాత్ర కోసం ప్రాణాన్ని నిలబెట్టుకోదలిస్తే.. అది గాల్లో పెట్టిన దీపంలానే ఎప్పుడు ఉంటుందో ఎప్పుడు ఊడుతుందో అర్థం కానంత భయానకంగా ఉంటుంది.
ఇక్కడ చివరిగా నా స్వీయానుభవాలు ప్రస్తావించకపోతే మీకు ఇదంతా ఒట్టి మెట్ట వేదాంతంగానే తోస్తుంది… మనలో చాలామందికి ఇలాంటి మాటలు నిదర్శనాలతో సహా కావాలి… లేదా చెప్పేవాడు ఆచరించన వాడైనా అయి ఉండాలి.. అప్పుడే మనం వినడానికి ఇష్టం చూపుతాం… 🙂
———————-
నా జీవితంలో నా గమ్యం నా చిన్నతనం నుండి మనస్సులో మిణుక్కుమంటూ కన్పిస్తూనే ఉంది.. నా బాధల్లోనూ, నా ఆనందాల్లోనూ, నా వినోదాల్లోనూ, విలాసాల్లోనూ… నేను నా గమ్యాన్ని ఆదమరిచి మర్చిపోయిన అనేక క్షణాల్లో నేను దారుణంగా శిక్షించబడ్డాను… నేను మళ్లీ గమ్యంలో వడివడిగా నడవడం మొదలెట్టిన ప్రతీసారీ నా నడకకు మరింత బలం చేకూరుతూ వచ్చింది..
అందుకే నా వినోదాలూ, సరదా కబుర్లూ, ఆనందాలూ, రిలేషన్లూ, ఎఫెక్షన్లూ… ఇవన్నీ నా మనస్సుని తాకని పై పై పొరలంతే…. నాకు మాత్రమే అర్థమైన నేను నాలోపల వేరుగా ఉన్నాను… అది ఎవరికీ తెలియదు… ఆ “నేను”నే నన్ను ఓ లక్ష్యబద్ధంగా నడిపిస్తోంది. నా జీవితపు purposeకి దూరమైన క్షణం, ఆ purpose నెరవేర్చడం ఇక నావల్ల కాదని అర్థమైన క్షణం నా ప్రాణం దానంతట అదే వాయులీనం అవుతుంది. ఇది సత్యం!!
– నల్లమోతు శ్రీధర్
ఎడిటర్
కంప్యూటర్ ఎరా తెలుగు మేగజైన్
Leave a Reply