నోరు తెరిచి మాట్లాడాలంటే భావప్రకటనపై దాడి… భావ వక్రీకరణల కుట్రలు…
నువ్వు ఫలానా కులమా, మతమా, ప్రాంతమా… అంటూ గొంగళి పురుగులు పాకినట్లుండే అసహ్యమైన చూపులు…
తెలివితేటల్ని గేలి చేసే మూర్ఖత్వం.. అజ్ఞానాన్ని నెత్తిన మోసే మూఢత్వం…
క్వార్టరు బాటిల్కీ…. మందపాటి పచ్చ నోటుకీ, … ముక్కుపట్టిపోయిన బియ్యానికీ… కట్టిన కొన్నాళ్లకే సజీవ సమాధి చేసే ప్రభుత్వ గృహానికీ… ఖర్చుచేసుకునే అతి చవకైన ఓటు హక్కు..
తెల్లారి పేపర్ హెడ్డింగులతో గుర్తొచ్చి… మధ్యాహ్నానికి టివి వార్తలతో ఎగసిపడి… ఏదో ఒకటి… ఎక్కడో చోట వాగేసి… సాయంత్రానికి మత్తుగా నిద్రపోయే సామాజిక స్పృహా, రాజకీయ చైతన్యమూ!
“ఈ దేశాన్నీ, ప్రజల్నీ మనమేం చెయ్యలేం” అని నుదురు చిట్లించీ.. మూతి బిగించీ… నాలుగు తిట్లు తిట్టుకునే అపరిమితమైన మేధస్సు…
“మన దేశం, మన మతం అంత గొప్పది.. ఇంత గొప్పది…” అంటూ ఎక్కడెక్కడివో పేపర్ క్లిప్పింగులూ… ఆశ్చర్యం పుట్టించే వార్తలూ మోసేసుకొచ్చి… అందరికీ పంచేసి… మనం మాత్రం మన దేశపు గొప్పదనం కోసం ఏం కష్టపడకుండా తొంగునే బద్ధకం…
———————————–
ఇన్ని వైకల్యాల మధ్య “స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు” చెప్పుకునే అమాయకత్వం… ఆ వైకల్యాలు గుర్తించలేని, సరిచేసుకోలేని సంకుచిత స్వభావం…
స్వాతంత్ర్యం వచ్చాక గర్వించదగినవి దేశంలో చాలానే ఉన్నాయి… తలదించుకోవలసినవి అంతకన్నా ఎక్కువగా ఉన్నాయి…
మనిషి మారడు… సమూహం మారదు… కానీ దేశం వెలిగిపోవాలని కోరుకుంటాడు… పంద్రాగస్టుకి చిన్నప్పుడు తిన్న చాక్లెట్లు గుర్తు తెచ్చుకుని… మళ్లీ స్కూల్కెళ్లి చాక్లెట్లు తిన్న రోజులు కలగంటాడు తప్ప పంద్రాగస్టు పరమార్థం మాత్రం అజ్ఞానంలో, అమాయకత్వంలో, బద్ధకంలో, వివక్షలో, ద్వేషంలో బ్రతికే ఏ భారతీయుడికీ అర్థమే కాదు…
అర్థం కాని విషయం గురించి శుభాకాంక్షలు చెప్పుకునే హాస్యాస్పదమైన రోజు ఇది.
– నల్లమోతు శ్రీధర్
ఎడిటర్
కంప్యూటర్ ఎరా తెలుగు మేగజైన్
నిజం. మతితప్పిన కాకుల రొదలో గతి తప్పిన సగటుజీవి ఆవేదనకు అద్దం మీ అక్షరాలు.