క్షణానికి ఇంపార్టెన్స్ తెచ్చుకోవడానికి ఎన్ని తహతహలు మనకు…?
కొన్ని క్షణాల్ని "ప్రత్యేకంగా" భావించేసి వాటికి రంగులు అద్దుకుంటే తప్ప ఆనందాన్ని పొందలేని శూన్యత మనది.
అన్నింటికీ కారణాన్ని అన్వేషించడం అలవాటైపోయిన మనకు ఆనందించడానికీ ఓ బలమైన కారణం కావాలి 🙂 పొర్లిపొర్లి ఏడవడానికి వంద కారణాలు దొరుకుతాయి కానీ మనస్ఫూర్తిగా పగలబడి నవ్వడానికి ఒక్క సందర్భమూ మనకు ఆనదు.
మనం నవ్వాలంటే… ప్రళయాలు రావాలి.. విలయ తాండవం చేయాలి.. బంగాళాఖాతంలో తుఫాన్లు పుట్టుకురావాలి… 😛 అంత ప్రత్యేకమైనది గుండె అగాధాల్లోకి తోసేయబడిన మన నవ్వు…
నిరంతరం ఆనందాన్ని వెదుక్కోవడంతోనే ముగిసిపోతోంది జీవితం…!
మనస్సులో దాచి పెట్టుకుని మనుషుల్లో ఆనందాల్ని వెదుక్కుంటే ఎప్పటికి దొరుకుతుందది?
ఈ క్షణం ఆనందంగా ఉండడానికి ఎలాంటి ప్రత్యేక కారణం అవసరం లేదు… ఎలాంటి అన్వేషణా అవసరం లేదు.. దుఃఖాల్నీ, అసంతృప్తుల్నీ మోసుకు తిరగ్గపోతే చాలు.. ఆనందం ఆటోమేటిక్‌గా మనస్సుని తనకి తాను నింపేసుకుంటుంది…
ఆనందం ఎంత trickyగా ఉంటుందో ఓ అబ్జర్వేషన్‌ని ప్రస్తావించి చెప్తాను…
మొన్నెప్పుడో "కంప్యూటర్ ఎరా" మేగజైన్ రాస్తుంటే ఎందుకో కాన్సంట్రేషన్ కుదరట్లేదు.. మనస్సులో ఏదో లోటుగా అన్పిస్తోంది… నాకు వర్క్ చాలా ఇంపార్టెంట్.. సో చివరకు చిరాకేసి.. ఓ ఐదు నిముషాలు అలా పరధ్యానంగా చేసే పని ఆపేసి.. "నా మనస్సులో దేని గురించి లోటు ఫీలవుతున్నానా" అన్నది ఆ రోజు జరిగిన సంఘటనల ఆధారంగా రీకాల్ చేసుకోవడానికి ట్రై చేశా.
గుర్తొచ్చింది.. అది చాలా చాలా చిన్న విషయం. కానీ ఓ డిజప్పాయింట్ మెంట్ ఆ విషయం వల్ల ఫీలై ఉండడం వల్ల అది తెలీకుండానే సబ్ కాన్షియస్ మైండ్‌లో ప్లే చేస్తోంది..
సో ఇలాంటివి టెక్నిక్‌గా హ్యాండిల్ చేయడం నాకు ఎప్పట్నుండో అలవాటు. సింపుల్‌గా ఆ విషయాన్ని బలవంతంగా కాకుండా మనస్ఫూర్తిగా మర్చిపోయా.. ఇంకేం…. ఆనందమే ఆనందం.. 🙂
సో గ్యాస్ ధరలు పెరిగాయనో, ఎట్లాబడితే అట్లా యాక్సిడెంట్లు అవుతున్నాయనో, డెంగీ జ్వరాలు పెరుగుతున్నాయనో, స్కూల్ ఫీజులు పెరుగుతున్నాయనో రకరకాల భయాల్ని మోసుకు తిరుగుతుంటే మనస్సులో ఆనందాలకు చోటెక్కడ? అందుకే మందు పార్టీల్లోనో, మనుషుల గుంపుల్లోనో భద్రంగా ఉన్నామని మనస్సులో ఉండాల్సిన ఆనందాల్ని మనుషులతో సంపాదించాలని చూసుకుంటున్నాం.
"అందరూ ఏడుస్తుంటే మనం నవ్వడమేమిటి.." ఈ ఫీలింగ్ చాలామందికి తెలీకుండానే మనస్సులో చాలా లోతుగా నాటుకుపోతోంది.
నిజంగానే అందరూ ఏడుస్తున్నారు…. ఎందుకా శోకమో అర్థం కాదు.. అంత కుమిలి కుమిలి ఏడవాల్సిన దుస్థితి ఎందుకొస్తోందో తెలీదు.
చనిపోయే క్షణం ప్రశాంతంగా ఉండడానికి బ్రతికున్న నిండు జీవితమూ కలతపడుతూనే ఉంటున్నారు.. భాధలతో, భయాలతో, అభద్రతలతో మూసుకుపోయిన మనస్సు ద్వారాల్ని తెరుచుకుంటే ప్రశాంతతం ఈ క్షణం నుండీ దొరకదా? మన పిచ్చి కాకపోతే….
అర్థం పర్థం లేని బరువుల్ని తలకెత్తుకోవడం.. నేను బరువు మోస్తున్నానని గర్వంగా చెప్పుకోవడం.. దించుకునే దాకా ఏడుస్తూ మోయడం.. దించుకున్నాక ఓ క్షణం బలవంతపు నవ్వు నవ్వుకుని మరో బరువు ఎత్తుకోవడం… ఇదే లైఫా.. 😛
ఎవరో చిన్నచూపు చూస్తారని కష్టపడి కార్లూ, బంగళాలూ కొనాలా…? మనం అవసరాల్ని తీర్చుకోవాలా? విలాసాలు తమని మన అవసరాలుగా ప్రలోభపెట్టాలా? ఇలాంటి అర్థంపర్థం లేని బరువులు ఎన్నని మోస్తున్నాం..
సోషల్ స్టేటస్‌కి జనాలు గౌరవం ఇస్తారేమో… ఆ గౌరవం ద్వారా మన కళ్లల్లో మెరుపు తెచ్చుకోవచ్చేమో…. ఆ మెరుపు క్షణికమే… మనస్సులో నిజమైన ఆనందాన్ని పోగొట్టుకున్న వ్యక్తి సమాజంలో ఆనందం పొందుతున్నట్లు అనుకోవడం ఒట్టి భ్రమే.. ఆ భ్రాంతి వీడిన రోజు ఎవరూ లేని మనం మానసికంగా ఎంత ఒంటరి వాళ్లమో అర్థమవుతుంది.
అందుకే ఆనందం కోసం వెంపర్లాడాల్సిన పనిలేదు.. ధనంతో, దర్పంతో, జనంతో వచ్చేదే మన ఆనందం అయితే… ఆనందం యొక్క ఫస్ట్ సిప్ కూడా రుచి చూడకుండానే జీవితం ముగించేస్తున్నామేమో…
గమనిక: ఇది ఎవరికైనా పనికొస్తుంది అన్పిస్తే ఇతరులకూ షేర్ చెయ్యగలరు.
– నల్లమోతు శ్రీధర్
ఎడిటర్
కంప్యూటర్ ఎరా తెలుగు మేగజైన్
http://computerera.co.in
http://youtube.com/nallamothu
http://nallamothusridhar.com
Leave a Reply