ఫారినర్స్ పాటిస్తూ ఇండియాలో మాత్రం ఆధ్యాత్మిక తిరోగమనానికి కారణం ఇది? – Sridhar Nallamothu
విదేశాల నుండి ఇండియాకి వచ్చి రకరకాల యోగ విధానాల్లో శిక్షణ పొందే వారిని చూసి మన భారతీయులం మన భారతీయ సంస్కృతి గురించి గొప్పగా చెప్పుకుంటూ ఉంటాం. కానీ భారతీయ ప్రాచీన జ్ఞానాన్ని నేర్చుకునే, అభ్యాసం చేసే చిత్తశుద్ధి మాత్రం మనలో కన్పించదు. కేవలం తాతలు నేతులు తాగారు అనే తరహాలో గొప్పలు చెప్పుకోవడం తప్పించి!
వ్యక్తిగతంగా నేను పాశ్చాత్య ఆధ్యాత్మిక గ్రంధాలనేకం చదివాక మన వేదాలు, అరబిందో, రమణ మహర్షి, జిడ్డు కృష్ణమూర్తి వంటి పలువురు చేసిన ఆధ్యాత్మిత, తత్వ బోధనలను చదివాను. పాశ్చాత్యులు గొప్పగా చెప్పే జ్ఞానమంతా క్లిష్టమైన పరిభాషలో మన దేశ పురాతన గ్రంధాల్లో నిక్షిప్తం చెయ్యబడి ఉంది. ఇంకా చెప్పాలంటే రుగ్వేదం, యజుర్వేదం, సామవేదం వంటి వేదాల్లో ఒక్క లైన్లో ప్రస్తావించబడిన సూక్ష్మ సత్యాలను విశదీకరించి విదేశీయులు పుస్తకాలు పుస్తకాలు రాశారు.
మరి ఆధ్యాత్మిక జ్ఞానానికి పుట్టినిల్లు అయిన భారతదేశంలో అది ఎందుకు అంతరించిపోతోంది అన్న దాన్ని నిశితంగా నేను పరిశీలించినప్పుడు అర్థమైన విషయాలు ఇవి.
- జ్ఞానం ప్రవాహం లాంటిది. ఒక దగ్గర నిలిచి ఉండేది కాదు. ప్రవాహం ఆగిపోతే ఎలా మురికిపట్టిపోతుందో జ్ఞానమూ అంతే! గురు శిష్యులు, గురువు పట్ల వినయం కలిగి, నేర్చుకోవాలనే జిజ్ఞాస కలిగిన శిష్యులు మెల్లగా అంతరించిపోయారు. చాలామంది గురువులకు కూడా లోతైన విషయాలు తెలీకపోవడం, మొక్కుబడిగా పైపై విషయాలు తెలుసుకుని అదే జ్ఞానబోధ అని భావించడమూ దీనికి కారణం. డబ్బులకు అమ్ముకునే స్థితికి జ్ఞానం దిగజారిన తర్వాత పరిస్థితి మరీ విషమించింది.
- దివంగతులు ప్రముఖ జర్నలిస్ట్ అరుణ్ సాగర్ గారిని పలుమార్లు కలిశాను. ఆయన కన్జ్యూమరిజం మీద విపరీతంగా ఫైట్ చేసేవారు. కార్పొరేట్లు వస్తు వినియోగాన్ని ప్రోత్సహించి, మనుషుల్ని మెటీరియల్ ప్రపంచం వెనుక పరుగులు తీసే సంస్కృతి ఇది. కొత్త కారు కొంటే, మరో వస్తువు కొనాలనిపిస్తుంది.. పక్కన వాడు ఏది చేస్తే అంతకన్నా మెరుగ్గా చేయాలనిపిస్తుంది. మనకు వచ్చే ఆదాయం, మనకు ఎంత వరకూ అవసరం వంటివన్నీ మర్చిపోయి మెటీరియల్ ప్రపంచంలో కొట్టుకుపోయే వ్యక్తికి ఆశలూ, కోరికలూ, అవి తీరనప్పుడు ఏర్పడే అశాంతి, నిస్పృహ నిరంతరం వెంటాడుతుంది. నేను మనిషి శరీరంలోని chakras గురించి లోతుగా స్టడీ చేశాను. అన్నింటి కంటే క్రిందిది మూలాధార చక్ర మనిషి ఉనికికి సంబంధించినది. నేను సౌకర్యంగా ఉన్నాను, నేను ఆర్థికంగా బాగున్నాను అనే సంతృప్తి పొందనంత వరకూ ఆ చక్రలో ఎనర్జీ బ్లాక్ అయి ఉంటుంది. మూలాధార చక్ర ఎనర్జీ బ్లాక్ అయితే ఆ తర్వాత పై భాగాల్లో ఉండే మణిపూరక, అనాహత వంటి అన్ని చక్రాలకు, చివరకు సహస్రార చక్ర ద్వారా విశ్వంతో కనెక్ట్ అవడం జరగదు.
సో నాకు అది లేదు, ఇది లేదు అనే పరుగులాటలో ఉన్న వ్యక్తి మూలాధార చక్ర స్థాయిలోనే ఇరుక్కుపోయి ఉన్నప్పుడు ఇంకా అతని ఆజ్ఞా చక్ర, సహస్రార చక్ర, అన్ కండిషనల్ లవ్‌ని రుచిచూపించే హార్ట్ చక్ర ఎలా అవగాహనలోకి వస్తాయి?
బౌద్ధంలో బుద్ధుడు చెప్పేది ఒకటే.. మనిషి కోరికే దుఃఖానికి హేతువు అని! ఈరోజు అనుకున్న కోరికను పొందితే సంతోషం లభిస్తుంది. అదే కోరిక వెనుక మరో రూపమూ పొంచి ఉంటుంది. ఈరోజు పొందినది రేపు పోవడానికి సిద్ధంగా ఉంటుంది. ఈరోజు ప్రేమని పొందితే రేపు అదే ప్రేమ అదే వ్యక్తి నుండి గానీ ఇంకో వ్యక్తి నుండి గానీ పోయే ప్రమాదం ఉంటుంది కదా! అంటే ప్లెజర్ ఉన్న దగ్గరే పెయిన్ పొంచి ఉంటుంది. ఈ ప్లెజర్, పెయిన్ ఊబిలో మన భారతీయులు ఎక్కువగా కూరుకుపోతున్నారు. డబ్బు, స్వార్థం, అవసరాలు ఇవే మన మైండ్లను డామినేట్ చేస్తున్నాయి. అలాంటప్పుడు ఈ మైండ్‌ని అధిగమించి, సోల్ స్థాయికి చేరుకుని నిరంతరం నిశ్చలంగా ఉండే అలౌకిక ఆనందాన్ని పొందడం మనకు ఎలా సాధ్యపడుతుంది?
- ఆధ్యాత్మికత అంటే చెత్త చెత్త యూట్యూబ్ ఛానెళ్లు, అవగాహన లేని గురువులు మూఢ భక్తి అని తేల్చి పారేశారు. సోమవారం పూజ చేస్తే ఈ ఫలితాలు లభిస్తాయి, ఇంట్లో ఈ వస్తువు ఉంటే డబ్బులే డబ్బులు.. ఇలా మనుషుల్లోని మూఢత్వాన్ని, పాత భీతిని క్యాష్ చేసుకోవడం వల్ల నిజమైన ఆధ్యాత్మికత మరుగునపడుతోంది. వివిధ దీక్షలు తీసుకున్నప్పుడు లక్షలాది వెచ్చించి అలంకారం చేసి, పది రకాల ఆహారాలు పెడితేనే దేవుడు కరుణిస్తాడు అనే దిగజారుడు మానసిక స్థితికి ఆధ్యాత్మికతను పడిపోయింది.
భక్తి యోగాలో కొబ్బరికాయలు, నైవేద్యాలూ, అలంకారాలూ ముఖ్యమైనవి కావు. దైవ రూపాన్ని (భౌతిక రూపం కాదు, ఫొటోలో కన్పించేది కాదు) హృదయంలో ప్రతిష్టించుకోవడం ద్వారా మైండ్ చేసే మాయ తొలగిపోయి ఏకత్వం లభిస్తుంది. అప్పుడు భావోద్వేగాలూ, మానసిక వైకల్యాలూ, మనుషులందరూ వేర్వేరు అనే భావనలు తొలగిపోయి మనిషి విశ్వమానవుడిగా, దైవ రూపంగా అవతరిస్తాడు. అది చెప్పగలిగే ఏ గురువూ మనకు కన్పించదు.
నిజమైన ఆధ్యాత్మిక జ్ఞానాన్ని అర్థం చేసుకున్న పాశ్చాత్యులు మాత్రమే వ్యక్తిగతంగా ఎదిగిపోతుంటారు. కానీ మనం కులాలు, మతాలు అంటూ కొట్టుకుంటూ మనిషిలోని దైవత్వానికి బదులు రాక్షసత్వాన్ని పెంచి పోషించుకుంటున్నాం.
ఇది ఎవరైనా షేర్ చేసుకోవచ్చు. రాసిన నల్లమోతు శ్రీధర్ అనే నా పేరు తొలగించి షేర్ చేసుకుంటే మీలో పైన చెప్పిన రాక్షస భావనలు పుష్టిగా ఉన్నాయని మీరు గ్రహిస్తే చాలు. జ్ఞానానికి విలువ ఇవ్వని రాక్షస భావన అది.
ధన్యవాదాలు
- Sridhar Nallamothu