పాపం మనకెన్ని అవస్థలూ..!!
ఏ మాదిరి శత్రుత్వమో, అభిప్రాయ బేధమో, మాట పట్టింపో, మనస్సు గాయపడడమో తెలీదు కానీ.. ఎవర్నో ఏదో నేరుగా అనలేక మరెవర్నో అడ్డుపెట్టుకుని అక్కసునంతా వెళ్లగక్కేస్తుంటాం.
మనం వదిలిన బాణాలు అవతలి హృదయాల్ని గాయపరిచి మన అహాన్ని సంతృప్తిపరుస్తాయో లేదో తెలీదు కానీ, దీపావళి రాకెట్లు ఎలా పైకెళ్లకుండా పక్కింటోళ్ల కిటికీల్లోకి దూరతాయో అలా నూటికి 99 సందర్భాల్లో
ఓ నెగిటివ్ ఎమోషన్‌కి ఉన్న శక్తి మనం అంచనా వేయలేనిది. ఏ ఒక్కరినో ఉద్దేశించి అలాంటి నెగిటివ్ ఎమోషన్లని మనం వెదజల్లినప్పుడు వాటి విషం స్వచ్ఛమైన మనసుల్నీ కలుషితం చేస్తుంది, ఒకింత ఇన్సెక్యూర్డ్గా ఫీలయ్యేలానూ చేస్తుంది. మరోవైపు మన అక్కసుని ఎంటర్టైన్మైంట్గా వినోదించే శాడిజాన్నీ పెంచి పోషిస్తుంది.
చాలామంది మనుషుల మనస్థత్వాలు మనకు సరిపడవు, వాళ్లెందుకు ఇలా ఉంటున్నారు అనుకుంటాం.. మనం వారి గురించి లోపల కారాలూ మిరియాలూ నూరుతున్నాం అన్న విషయం వారికి తెలీదు కానీ మన కడుపు మాత్రం అల్సర్‌తో మండిపోతుంటుంది 🙂
మన ఆగ్రహం ద్వారా వారికి హాని జరగాలనుకుంటాం… ఉండబట్టలేక నేరుగానో.. వేరే వాళ్లని అడ్డుపెట్టుకునో నొచ్చుకునేలా మాట్లాడతాం.. "హమ్మయ్య అనాల్సింది అనేశాం" అని రియాక్షన్ కోసం క్యూరియాసిటీగా చూస్తుంటాం. మన బాణం గురితప్పక గుచ్చుకుని.. మన శత్రువు మొహం చిన్నబోయింది అనుకుందాం. ఇక హాపీగా నిద్రపోవచ్చా? ఈ మాత్రపు ప్రశాంతత కోసమా కుతకుతలాడుతూ కర్కశంగా మనుషుల్ని మనం గాయపరుస్తున్నది? మనం శత్రువుగా భావించే వ్యక్తిని మొదటి క్షణమే పట్టించుకోవడం మానేసి మన పని మనం చేసుకుంటుంటే ఇంతకన్నా ఎక్కువ ప్రశాంతత లభించదా?
మాట వరసకే తీసుకుందాం.. ఎవరి మీదో పెట్టి నన్నే మీరు ఓ మాట అన్నారనుకుందాం. బాణం నా మీదకే వదలబడిందని నాకూ అర్థమైందనుకుందాం. ఓ 10 నిముషాలు బాధపడ్డాను.. నా ఎమోషనల్ బ్యాలెన్సింగ్ ఇంకా ప్రొడక్టివ్‌గా నన్ను నేను తయారు చేసుకోవడానికి మీ మాటల్ని అస్త్రాలుగా చేసుకుంది అనుకుందాం. ఇక్కడ మీ బాణాలు నన్ను గాయపరిచాయా.. నన్ను మరింత బాగు చేస్తున్నాయా? మీ పట్ల నేను కేర్లెస్గా ఉండడాన్ని అప్పటికే రగిలిపోతున్న మీ మనస్సు పాపం తట్టుకోగలుగుతుందా?
పరోక్షంగా మనం మాట్లాడే మాటలు మనం కోరుకున్న శాడిస్టిక్ ఫలితాలనే ఎల్లప్పుడూ సాధించిపెట్టవు అన్న విషయం అర్థం కావడానికే పైన ఓ ఉదాహరణ కల్పించాను.. ఇందులో నాకెవరిపైనా కంప్లయింట్లు లేవూ… 🙂 ఈ ఆర్టికల్ రూట్ కాన్సెప్ట్ మాదిరిగా నేనెవర్నీ ఉద్దేశించీ రాయట్లేదు సుమా 🙂 🙂
మొన్నీ మధ్య ఓ సినిమాలో చూశాను.. ఓ విలన్ రోజూ తన గ్యాంగ్ సభ్యుల చేత కొట్టించుకుంటాడు.. తను మరింత స్ట్రాంగ్ అవడం కోసం!
సరిగ్గా అలాగే మన సూటిపోటి మాటలు మన శత్రువుల్ని బలోపేతం చేస్తుంటాయి. కసి పెంచుతుంటాయి.. మరింత ఎదిగేలా చేస్తుంటాయి. యెస్.. ఇది నిజం.. ఎంత నిజమంటే ఓ ఊరు ఊరు సూటిపోటిగా మాట్లాడి లేకపోతే నేను ఇన్నేళ్లు ఇదే ఫైర్‌తో ఏదో ఒకటి సాధించాలన్న తపనతో బ్రతుకుతూ ఉండే వాడిని కాదు.
ఓ పక్క శత్రువు బలోపేతం అవుతుంటే.. సూటిపోటిగా మాట్లాడే మనం బలహీనం అవుతున్నాం!!
మన మాటల ద్వారా మనం వ్యక్తపరిచే మన సంకుచితత్వాలు బయటి ప్రపంచానికి అర్థమైనా కాకపోయినా.. మన మనస్సు మాత్రం నిలదీస్తూనే ఉంటుంది. "ఇంతగా దిగజారాలా ఓ మనిషిని గాయపరచడం కోసం" అని! సిగ్గుతో కుంగిపోతాం. కానీ పైకి సమర్థించుకుంటామనుకోండి.
ఎవర్నో ఉద్దేశించి మనం మాట్లాడే మాటలు.. "రేపు తేడా వస్తే ఇదే మనిషి మన విషయంలోనూ ఇలాగే ప్రవర్తిస్తారు" అన్న భయాల్ని మనతో అప్పటివరకూ అటాచ్డ్గా ఉన్న వాళ్లకు కలిగించవంటారా?
ఒకర్ని సాధించడం కోసం అందర్నీ దూరం చేసుకోవడం ఎవరి మూర్ఖత్వం?
ఎవరో ఏదో గాయం చేస్తారు.. మనస్సు బాధ పడుతుంది.. మనమూ ఏదో అంటాం.. మరొకరు ఆ అన్నదాన్ని పట్టుకుని మరేదో అంటారు.. మనకు కలిగే బాధ origin మరో చోటికి ట్రాన్స్ఫర్ అవుతుంది. అందరిపై విరక్తి పుడుతుంది.. సమాజం మొత్తాన్నీ బంగాళాఖాతంలో తోసేయాలనిపిస్తుంది. ఆ చివరా, ఈ చివరా సమాజాన్ని ఇరికించుకుని.. సముద్రంలోకి sink చేయడానికి బలం సరిపోదు. అక్కడా ఓ నిస్పృహే.. చివరకు అందర్నీ సముద్రంలో తోసేయడం వల్ల కావట్లేదు కాబట్టి… మనమే మనదైన ఇరుకైన ప్రపంచపు షెల్‌లోకి ఇరుక్కుపోయి హాయిగా డిప్రెషన్‌ని ఆస్వాదిస్తుంటాం..
సో మన గాయాలూ, మన బాణాలూ.. అన్నీ పెట్టేబేడా సర్ధుకుని ఓ విరక్తి దగ్గర అటకెక్కుతాయి.
ఇదన్నమాట సంగతి.. ఎందుకు చెప్పండి ఇన్ని కష్టాలు? మనుషుల్ని క్షమించలేమా… మాటలు అదుపులో పెట్టుకుని మనమూ, అవతలి వాళ్లూ ప్రశాంతంగా బ్రతకలేమా?
గమనిక: ఇది ఎవరికైనా పనికొస్తుంది అన్పిస్తే మీ మిత్రులకూ షేర్ చేయగలరు.
ధన్యవాదాలు
– నల్లమోతు శ్రీధర్
ఎడిటర్
కంప్యూటర్ ఎరా తెలుగు మేగజైన్
Leave a Reply