ప్రతీ అన్యాయం నుండీ ఓ భావజాలం పుట్టుకొస్తుంది.. కొంతవరకూ ఆ భావజాలం అన్యాయాన్ని ఎదిరిస్తుంది… అది కొన్నిసార్లు శృతిమించి అసలుకే ఎసరూ తెస్తుంది.. అలా తరచూ వికటించే భావజాలాల్లో చాలామందిని చిరాకుపరిచే భావజాలం “ఫెమినిజం” అనేది ఒకటి.
మగవాళ్ల నుండి ఆడవాళ్లకి అన్యాయం జరగకుండా కాపాడడం వరకూ.. మహిళలు అన్ని రంగాల్లో ముందంజలో ఉండేలా ప్రోత్సహించే వరకూ మాత్రమే ఫెమినిస్ట్ ఆలోచనలు పరిమితం కావాలి.. కానీ సొసైటీలో మనం చూసే అనేకమంది సోకాల్డ్ ఫెమినిస్టుల ఆలోచనాధోరణులు అంతటితో ఆగవు.. “మగాడు లేకపోతే ఏంటి.. మేం బ్రతకలేమా” అని తిన్నగా అన్యోన్యంగా ఉన్న వారి ఆలోచనలనూ తప్పుదారి పట్టించే బాపతు జనాలెందరో.
ప్రతీదీ మగాళ్లకూ, ఆడాళ్లకూ సరిసమానంగా ఉండాలన్న వాదన చాలామందిలో బలంగా నాటుకుపోయింది… చివరకు అవి ఎలాంటి సిల్లీ ప్రశ్నలకు దారితీస్తాయంటే… ఓ సంఘటన గుర్తొస్తే నవ్వొస్తుంది… కొన్నేళ్ల క్రితం.. అప్పటివరకూ ముఖపరిచయం కూడా లేని ఓ ఫెమినిస్ట్ మిత్రురాలు ఏదో సందర్భంలో చాలా డామినేటింగ్‌గా “మీకు వంట చెయ్యడం వచ్చా..” అని అడిగారు. ఆ రిలేటెడ్ టాపిక్ ఏదీ అప్పుడు జరగకపోతున్నా, అసందర్భంగా అడిగేశారు. నేను రాదన్నాను. “అందేటి రాకపోవడం ఫస్ట్ అర్జెంటుగా నేర్చుకోండి… వంట చెయ్యడం కూడా రాకపోతే ఎలా?” అని బ్రెయిన్ వాష్ చేశారు. ఎక్కడా వాదించడం నాకు ఇష్టం ఉండదు కాబట్టి సైలెంట్‌గా బుద్ధిగా వింటూ కూర్చున్నా.
——————————————————
జస్ట్ ఓ ఎగ్జాంపుల్‌గా ఇది చెప్పానంతే. ఇలాంటి భావజాలం నేను చదివినదీ, డిస్కషన్లలో కంఠశోష వచ్చేలా వాదించబడినదీ చాలానే చూశాను.
మగా, ఆడా కలిస్తే ప్రకృతి. మగా, ఆడకి మధ్య అన్యోన్యత ఎవరేం వాదించినా ఫస్ట్ సాధించాల్సింది. మగాళ్లు వంటచేస్తేనే అన్యోన్యత రాదు, ఆడవాళ్లు ఉద్యోగాలకు వెళ్తేనే అన్యోన్యత రాదు. ఇద్దరికీ మధ్య అండర్స్టాండింగ్ ఎలా కుదురుతుందో, ఒకరికొకరు ఎలా బలపడతారో ఏ జంటకా జంట విభిన్నంగా జరిగిపోతుంది తప్పించి మధ్యలో ఓ జనరలైజ్డ్ అభిప్రాయాలతో “ఈరోజుల్లో అమ్మాయంటే ఇలా ఉండాలి.. అబ్బాయంటే ఇలా ఉండాలి” అని ఇద్దరినీ ఇద్దరికీ కాకుండా చేసే భావజాలాలను బలవంతంగా రుద్దడం సరైనది కాదు కదా.
అలాగే ఫెమినిస్ట్ భావజాలం ఉన్న అనేకమంది కధలూ, కవితలూ అప్పుడప్పుడూ కళ్లబడుతుంటాయి.. నవ్వొస్తుంది… ఎందుకు మగాళ్లంటే అంత ద్వేషం? వాళ్ల లైఫ్లోనో, వాళ్లు చూసిన అనేక జీవితాల్లోనో మగాళ్లు చెడ్డవాళ్లే కన్పించారనుకుందాం.. ఆ మాత్రానికే మగ సమాజం మొత్తాన్నీ అసహ్యించుకుంటూ పోతే కాపురాలు ఎవరితో చేస్తారు.. సాయంత్రాలు ఇళ్లకు వెళ్లి?
ఫెమినిజమే కాదు.. ఈ మధ్య కాలంలో మగాళ్లకు సమర్థనగానూ భావజాలాలు విస్తరిస్తున్నాయి. అసలు మగా, ఆడని విడదీసి… “నీ పక్షాన నేనున్నాను.. నీ పక్షాన నేనున్నాను” అంటూ వారి మధ్య మంటలు పెట్టే మనుషులను ఏమనాలి? అన్యాయం జరిగితే మాత్రమే నీ సాయం వాళ్లకు అవసరం.. ఏమీ అన్యాయం జరగనప్పుడు నీ భావజాలాన్నీ, నీ ఉనికినీ రక్షించుకోవడం కోసం ఓ జెండర్ మొత్తాన్నీ ద్వేషిస్తూ రచనలు సాగిస్తూ పోతే అది అభ్యుదయవాదం అవుతుందా?
మగాడైనా, ఆడదైనా కొంత అమాయకత్వం, కొంత అణుకువ అవసరం రిలేషన్లు బలపడడానికి. కానీ అమాయకత్వాన్నీ, అణుకువనీ “నువ్వు అలా ఉంటే అన్యాయమైపోతావు.. కళ్లు తెరువు ముందు” అంటూ అవతల వారి పార్టనర్లు మంచి వాళ్లయినా ఎగదోసి.. వారిద్దరి మధ్యా సున్నితత్వాన్ని కసిదీసా చెరిపేసి ఏం సాధించాలనుకుంటారు కొద్దిమంది ఫెమినిస్టులు?
చివరిగా ఒక్కమాట.. ఫెమినిజమైనా, ఇంకో ఇజమైనా.. ప్రతీ భావజాలం అన్యాయంపై పోరాడే వరకూ మాత్రమే ఉనికి నిలబెట్టుకుంటుంది.. అన్యాయాలను వదిలేసి ఉనికి కోసం తిప్పలు పడితే ఆ ఉనికీ, గౌరవమూ మిగలకుండా పోతుంది.
గమనిక: ఇది ఎవర్నీ కించపరచడానికి రాయలేదు.. జరుగుతున్న దానిపై నా అభిప్రాయం వ్యక్తపరిచానంతే. ఎలాంటి దారిమళ్లించే డిబేట్లనీ నేను ఎంటర్టైన్ చెయ్యలేను 🙂
ధన్యవాదాలు
– నల్లమోతు శ్రీధర్
Leave a Reply