ఫైర్.. పీస్.. ఈ రెండు క్వాలిటీలు ఒక మనిషిలో పుష్కలంగా ఉండాలి. రెండింటినీ సందర్భానుసారం వాడుకోవాలి..
ఎప్పుడూ నిమ్మకు నీరెత్తినట్లు తనకేదీ పట్టనట్లు ప్రశాంతంగా కూర్చున్న వాడెవడూ జీవితంలో ఏదీ సాధించలేడు. చాలా మోటివేషన్ కావాలి, ఏదో సాధించాలనే ఫైర్ ఉండాలి, దాని కోసం మెంటల్, ఫిజికల్ రిసోర్సెస్‌ని వాడి స్ట్రగుల్ అయి సాధించాలి. ఈ క్రమంలో తనని తాను చల్లబరుచుకోవడానికీ.. ఆ వేగం, ఆ ఆరాటం అదుపుతప్పి ప్రాకృతిక అవసరాలైన తిండీ, నిద్ర, మానసిక ప్రశాంతతలకు భంగం వాటిల్లకుండా కాపాడుకోవడానికి ఏ క్షణం మనం మౌనమునిగా మారాలో, ప్రశాంతత చెంతకు చేరాలో, అది ఏ విధంగా సాధించాలో అవగాహన ఉండాలి. ఈ రెండు రకాల extremes తెలిసిన వాడే మనిషి.
పనిచేస్తూ పోతే మనస్సూ, శరీరం అలసిపోతుంది. అయినా విశ్రాంతి లేకుండా పనిచేస్తూ పోతే ప్రొడక్టివిటీ తగ్గిపోయి అంతా గజిబిజిగా తయారవుతుంది. సరిగ్గా ఇలాంటప్పుడే మనస్సుని పని నుండి డిటాచ్ చేసి రిలాక్స్ చేసే విద్య తెలియాలి. కాస్త రిఫ్రెష్మెంట్ చాలు మరింత ఉత్సాహంగా పనిచెయ్యడానికి!
తినడానికి తిండీ.. కావలసినవి కొనడానికి డబ్బులూ.. చుట్టూ కబుర్లు చెప్పడానికి కావలసినంత మంది మనుషులు ఉన్నారు కదా అని ఏ పనీ చెయ్యకుండా “ఇదే ప్రశాంతమైన లైఫ్” అని పోసుకోలు కబుర్లు చెప్పుకుంటూ పోతే మీకు తెలీకుండానే మీ జీవితంపై కొన్నాళ్లకి విరక్తి పుడుతుంది. ప్రశాంతత అంటే పనిచెయ్యకపోవడం ద్వారా వచ్చేది కాదు, ఇబ్బందులు ఫేస్ చెయ్యకపోవడం వల్ల కలిగేది కాదు. కష్టపడుతూ కూడా భౌతిక ప్రపంచం నుండి కాసేపు డిటాచ్ అయి సాధించే గొప్ప మానసిక స్థితి ప్రశాంతత. అది మెడిటేషన్ ద్వారా సాధ్యమవుతుందా, లేక ఆలోచనలు మళ్లించుకోవడం ద్వారా అవుతుందా అన్నది ఎవరి పద్ధతులు వాళ్లు ఫాలో కావచ్చు. బట్ జీవితంలో ఫైర్ మిస్ కాకూడదు. సాధించాలన్న కసి మిస్ అయినోడి జీవితం నూటికి నూరుపాళ్లు వేస్ట్.
50-100 ఏళ్లు అంటే మాటలు కాదు.. కొన్ని వేలమంది మహానుభావులు బ్రతికుండే యాభై, వందేళ్లలో ఎంత సాధించవచ్చో కళ్లారా నిరూపించారు. అది పొటెన్షియాలిటీ ఆఫ్ లైఫ్. దున్నుకున్నోడికి దున్నుకున్నంత లైఫ్. కానీ ఖాళీగా ఉండొద్దు. ఈ ప్రపంచంపై మనకంటూ మనం ఓ ముద్రని వెయ్యడానికి ఉన్నది ఈ ఒక్క జీవితమే. ఇవ్వాళ కళ్లు మూసుకుని టైమ్‌పాస్ చేస్తే రేపు మిగలదు. బద్ధకపు దుప్పట్లని విసిరికొట్టి కళ్లల్లోకి నీళ్లు చిలకరించుకుని పనిచెయ్యడం మొదలెట్టండి.
మీకు ఆవలింతలు వస్తున్నాయంటే.. కాసేపు చదివితే, కాసేపు పనిచేస్తే అలసిపోతున్నారంటే.. ఒళ్లు పనికిమాలినదిగా తయారైందని అర్థం. రోజుకి ఓ అరగంటైనా ఎక్సర్సైజ్ చెయ్యండి. పట్టిన బద్ధకం అంతా వదిలిపోతుంది. శరీరమూ, మనస్సూ ఎప్పుడూ ఏక్టివ్‌గా ఉండాలి. “మనమేం ఊడబొడవాలి” అంటూ పనికిమాలిన పెదవి విరుపులు విరిస్తే రేపు ఈ ప్రపంచానికి నువ్వు అవసరమే లేదు, ఎవడూ గౌరవం ఇవ్వడు. లేచి కష్టపడండి.. సాధించండి.. ఫలితాలు వస్తాయో లేదో తర్వాతి సంగతి.. కష్టం అనేది చాలా మజానిస్తుంది, సక్సెస్ కూడా ఇవ్వలేనంత గొప్ప సంతృప్తిని ఇస్తుంది. కష్టం ఇచ్చిన మజాకి రుచి మరిగిన వాడికి విజయం గురించి పెద్దగా పట్టింపు ఉండదు. విజయమైనా, అపజయమైనా వాడికి కావలసిన సంతృప్తి వాడు ఆల్రెడీ ఆస్వాదించాడు. అదీ శ్రమైక జీవన సౌందర్యం!!
– నల్లమోతు శ్రీధర్
Thanks for sharing your thoughts sir…after reading this I want to change my attitute lazy to busy….thanks once again …..