బిర్యానీ – చాలామందికి ఇష్టమైన ఫుడ్… ఆ ఇష్టం కొద్దీ వారానికి నాలుగైదు రోజులు కూడా ఆవురావురుమంటూ తినేసేవాళ్లుంటారు.. వాళ్లకి plain meals అస్సలు సహించదు..
మసాలా అంటే మనకు ఇష్టం.. ఇది ఫుడ్ అయినా లైఫ్ అయినా! ప్రశాంతంగా ఉన్న కడుపులోకీ, మనస్సులోకీ మసాలాలు నింపి పారేసి.. వాటిని కడుపులోనూ, బ్రెయిన్‌లోనూ డైజెస్ట్ చేసుకోవడానికి నానా తంటాలు పడడం మనకు ఇష్టం.
మొన్నెవరో చనిపోయారు.. టివిల వాళ్లు ఏడుపు పాటల బ్యాక్‌గ్రౌండ్‌తో రోజంతా లైవ్ టెలీకాస్ట్ చేసేసి.. “ఇంకేముంది లైఫ్… పెద్ద పెద్ద వాళ్లే పోతున్నారు.. మనమెంత” అనే వైరాగ్యం కొన్ని లక్షలమందికి వచ్చేలా చేసేశారు. అంతేకాదు.. అందరూ వరుసబెట్టి క్యాన్సర్లతో పోతున్నారు.. మనకూ క్యాన్సర్ ఉందేమో అని భయపడిపోయిన వాళ్లూ ఎంతమందినో నేను చూశాను 🙂
పెద్దోళ్లూ, పేరున్నోళ్లూ పోయినప్పుడు బాధపడాల్సిందే.. తప్పు లేదు.. కానీ దానికీ ఓ హద్దు ఉంటుంది.. ఉన్న పనులన్నీ మానేసి.. రోజంతా డల్‌గా కూర్చుంటే.. అలా బాధపడడం మానవత్వంగా, ఆ పెద్ద మనిషి పట్ల మనకున్న గౌరవంగా ఫీలైతే అది తప్పు కాదా? ఎవరైనా వచ్చి మన చెంప మీద ఛెళ్లున ఒకటిచ్చుకుని.. “నీ పని నువ్వు చేసుకో” అని వాయిస్తేనన్నా ఈ లోకంలోకి వస్తామేమో!
నిన్నో, మొన్నో రాజధాని విషయంలో పవన్ కళ్యాణ్ ఏదో అన్నాడు.. రోజంతా జనాలు పనులన్నీ మానేసి.. ఎవరికి తోచిన విశ్లేషణలు వాళ్లు చెయ్యడం మొదలెట్టారు. దేశం ఇలా తగలడుతోందంటే.. పనులు చెయ్యడం మానేసి కబుర్లు చెప్పి బ్రతికే మేధావుల వల్లనే… ఒళ్లొంచి తన పనేదో తాను చేసే వాళ్లు కావాలి ఈ సమాజం బాగుపడడానికి! Facebookల్లో కూర్చుని తోచిన విశ్లేషణలు పోస్ట్ చేస్తూ.. అది సామాజిక బాధ్యతగా భ్రమిస్తూ… ఆ బాధ్యత సక్రమంగా నెరవేర్చేసినట్లు బ్రతుకుతుండే వాళ్ల వల్ల ఏ సమాజానికీ, ఏ దేశానికీ, ఏ ప్రాంతానికీ పైసా ఉపయోగం ఉండదు.
నిన్న BBC డాక్యుమెంటరీ… వెస్టిండీస్‌తో వరల్డ్ కప్… నిర్భయ గురించీ, మహిళల హక్కుల గురించి మాట్లాడాల్సిందే… కానీ ఓ హద్దు ఉంటుంది… మన అభిప్రాయాలకూ, విశ్లేషణలకూ, ఆవేదనలకూ విలువ లేని చోట… అసలు మన విశ్లేషణలు సమస్యని ఏమాత్రం సాల్వ్ చెయ్యలేని చోట ఎంత అరిచి గీపెట్టుకున్నా సమస్యా సాల్వ్ కాదు… మనకూ ప్రశాంతతా ఉండదు.
రోజులు రోజులు గడిచిపోతున్నాయి…. రోజుకో ఇష్యూ…. పొద్దున్న పేపర్లో వచ్చిన చెత్తనంతా బుర్రలో పోగేసుకోవడం.. వాటిని క్లిప్పింగులుగా Facebookల్లో షేర్ చేసుకుని… చర్చలు ప్రారంభించడం.. మధ్యలో టివిల్లో వచ్చే బ్రేకింగ్ న్యూస్‌లను update చేస్తూ రోజంతా గడిపేయడం…
చినమాయను పెదమాయా.. పెదమాయని పెనుమాయా కప్పేస్తుందన్నది మన ధోరణి చూస్తే స్పష్టంగా అర్థమవుతుంది…
ఓరోజు KCR ఏదో అంటాడు… ఓరోజు చంద్రబాబు ఏదో అంటాడు… ఓరోజు జగన్ ఏదో అంటాడు…. ఓరోజు ఓ ఫిల్మ్ స్టార్ పోతాడు… ఓరోజు BBC డాక్యుమెంటరీ వస్తుంది… ఓరోజు ఓ ఘోర రోడ్ ప్రమాదం జరుగుతుంది.. ఓరోజు పెద్ద ప్రకృతి వైపరీత్యం వస్తుంది… ఓ రోజు ఏ బ్రిటన్‌లోనో అండర్వేర్ మీద మన దేవుడి బొమ్మి ప్రింట్ చెయ్యబడుతుంది.. ఇలా మనుషులూ, ప్రాంతాలూ, పరిస్థితులూ, ప్రకృతీ, మీడియా, సెంటిమెంట్లూ.. అన్నీ మన ఎమోషన్లతో ఆడేసుకుంటే.. అసలు మనం మనుషులమా.. కాళ్లతో ఎవరిష్టమొచ్చినట్లు వాళ్లు ఎటుబడితే అటు తన్నే ఫుట్బాల్లమా?
వత్తిడెక్కువైందని 30 ఏళ్లకే BP టాబ్లెట్లు మింగుతున్న వాళ్లని చూస్తున్నాం.. ఎందుకు ఎక్కువ కాదు వత్తిడి? తన పని తాను చేసుకోవడం మానేసి.. ఆ వత్తిడిని పెంచేసుకుంటూ.. మరోవైపు ప్రపంచంలో ఉన్న చెత్తనంతా బుర్రలో మోస్తూ నిరంతరం బిక్కుబిక్కుగా భయంగా బ్రతుకుతుంటే BPలూ, హార్ట్ అటాక్లూ, బాడీ మెటబాలిజం, హార్మొనీ దెబ్బతిని ఇతర అన్ని రకాల క్రానిక్ డిసీస్లూ రాకుండా ఉంటాయా?
నువ్వేంటన్నదీ, నీ పనేంటన్నదీ, పొద్దున్నే లేచిన దగ్గర్నుండి నీ రోజుని ఎంత ప్రశాంతంగా, సంతోషంగా గడపాలన్నది నీ చేతిలో ఉంటుంది. నీకు బాగా పరిచయం ఉన్న వాళ్లే Facebookలో ఎమోషలైజ్ అయి ఏదో రాశారనుకుందాం.. నువ్వు వెళ్లి చదవకపోతే మిత్రుడికి అన్యాయం చేసినట్లు భావించడమూ.. చదివి కామెంటో, likeనో కొట్టకపోతే మళ్లీ బాగుండదనో లైక్ కొట్టడమూ.. ఇదంతా అవసరమా?
ఓ వ్యక్తి ఎమోషనల్ బ్యాలెన్స్ కోల్పోయో, ఓవర్ రియాక్ట్ అయ్యో రాసే సెన్సిటివ్ విషయాల్ని మీరు like, కామెంట్ రాయడం ద్వారా మీ ఫ్రెండ్ లిస్టులో ఉన్న అందరికీ ఆ నెగిటివ్ భావజాలాన్ని వైరల్‌గా చేరుస్తున్నారన్న స్పృహ కొంతైనా ఉందా?
వీలైతే మీరూ ప్రశాంతంగా ఉండండి, ఎమోషనలైజ్ అయిన మీ ఫ్రెండ్స్‌కి రియాక్ట్ అవకండి, తద్వారా ఇతరుల్నీ ప్రశాంతంగా ఉంచండి.. అన్నింటికన్నా ముఖ్యంగా మీరు చెయ్యాల్సిన పనులేంటో బుద్ధిగా చేసుకుంటూ.. సాధ్యమైతే పాజిటివ్ భావజాలాన్నీ, ఆలోచనల్నీ Facebookలో పంచుకోండి….
సమాజంలో జరిగే అన్యాయాల గురించి మాట్లాడుకుంటే సమాజం బాగుపడుతుందని అనుకోకండి… సమాజం గురించి పాజిటివ్ ఆలోచనల్ని పంచుకుంటేనే నిజంగా సమాజంలో కొద్దిగానైనా ప్రొడక్టివిటీ పెరుగుతుంది, ఇన్‌సెక్యూరిటీలు పోతాయి, హాయిగా ప్రశాంతంగా ఉంటాం!!
గమనిక: ఇందులో ఎవరి మనోభావాలనూ గాయపరచడం నా ఉద్దేశం కాదు.. బ్రెయిన్లో అన్ని ఫీలింగులూ, మసాలాలూ వదిలేసి న్యూట్రల్ స్థితిలో ఇది చదివితే నా ఉద్దేశం తిన్నగా అర్థమవుతుంది. కొద్దిమందైనా ఆలోచించే అవకాశం ఉంటుంది.
– నల్లమోతు శ్రీధర్
Leave a Reply