సమాధి స్థితి లేదా బౌద్ధంలో చెప్పబడిన నిర్వాణ స్థితి.. “నేను, నాది” అనే భావన చుట్టూ పేర్చుకుంటూ వచ్చి కోటలా తయారు చేసుకున్న ఇగోని.. ఆ పేర్చుకున్న ఇటుకలను బద్ధలు కొట్టి అన్నింటినీ త్యజిస్తే కలిగే స్థితి.
ఇది నా అభిప్రాయం.. ఇది ఆలోచన.. ఇది నా ప్రొఫెషన్… నాకింత పేరు ఉంది… నాకింత ప్రాపర్టీస్ ఉన్నాయి.. నన్నే గాయపరుస్తారా.. నా నాలెడ్జే కరెక్ట్.. ఇలా ప్రతీ దానితోనూ “నేను” అనేది ముడిపడి ఉంటుంది. ఇది నాది.. అది నాది అని నిన్ను నువ్వు మిగతా ప్రపంచం నుండి సపరేట్ చేసుకోవడం మొదలుపెట్టినప్పటి నుండి “నీది” అనుకున్న దాన్ని కాపాడుకోవడానికే జీవితాంతం యుద్ధం చేయాల్సి వస్తుంది. నీ అభిప్రాయాన్ని ఎవరైనా ఖండిస్తే బాధేస్తుంది.. నీ కులాన్ని, నీ ప్రాంతాన్ని, నీ నాలెడ్జ్‌ని, నీ ఫేవరెట్ హీరోనీ.. ఇలా ప్రతీ దాని విషయంలో మిగతా సమాజంతో పోరాడాల్సి వస్తుంది. దీంతో నీ శక్తి అంతా దానికే హరించుకుపోతుంది.
ఇగో చుట్టూ పేర్చుకున్న ఇటుకలను బద్ధలు కొట్టడానికి చాలా తెగువ కావాలి. పోగేసుకున్న పేరు, అహం, గుర్తింపు, భౌతిక విషయాల పట్ల ఆసక్తి కోల్పోవడానికి మొండి ధైర్యం కావాలి. బ్రతికుండగా చనిపోయిన స్థితి అది. ఎందుకు జనాలకు చావంటే భయమంటే నా వాళ్లు అనుకున్న వాళ్లని వదిలి వెళ్లాలనీ, ఈ జీవితంలో పోగేసుకున్న ప్రతీదీ వదిలి వెళ్లాలన్న భయం కొద్దీనే! అలాంటిది చావు వరకూ వెయిట్ చేయాల్సిన పనిలేకుండా బ్రతికుండగానే మన ధర్మాలు, బాధ్యతలు నిర్వర్తిస్తూ ప్రతీ విషయంలో అన్ కండిషనల్ ప్రేమని కలిగి ఉంటూ.. అదే సమయంలో అంతే డిటాచ్మెంట్తో అన్నింటినీ వదిలేసుకోవడం అన్నది సమాధి స్థితి. భౌతికంగా బ్రతికే ఉండొచ్చు.. కానీ ఇగోని చంపేసి సమాధి స్థితిని పొందుతాం.
ఇదంతా సాధన చేసేటప్పుడు మళ్లీ పలు మాయలు కమ్ముకుంటాయి. సమాధి స్థితిని గురించి పైన చదివిన తర్వాత కొంతమందికి కలిగే కోరిక.. ఎప్పటికైనా ఆ స్థితికి చేరుకోవాలని! అలా ఒక దానికి చేరుకోవాలన్న కోరికను ఎవరు సృష్టిస్తున్నారు పరిశీలిస్తే అది కూడా ఇగోనే! సమాధి స్థితికి చేరుకున్నాం, చేరుకుంటాం, చేరుకోవాలి అనే భావన మనస్సులో కలిగిన వెంటనే దాని పట్ల ఓ వ్యామోహం చుట్టు ముడుతుంది. మిగతా వారికంటే నేను భిన్నమైన మానసిక స్థితిలో ఉన్నాను అనే గర్వం మొదలవుతుంది. అంటే అన్నింటినీ వదిలించుకోవాలన్న సత్యాన్ని తెలుసుకుని కూడా అలా వదిలించుకునే సమాధి స్థితి అనే దాన్ని మనకు మనం సపరేట్గా పొందే మరో స్వార్థాన్ని పొందుతాం అన్నమాట. అందుకే ఏదైనా తెలుసుకోవడం వరకే మనం పరిమితం కావాలి.. దాని చుట్టూ కోరిక ఏర్పడితే అది మాయగా మారుతుంది. కోరిక కన్నా సాధన ప్రధానం. సాధన చేసే కొద్దీ ఈ మాయలన్నీ పటాపంచలు అయిపోతాయి.
ఇన్ని సంవత్సరాల నుండి ఇంతగా మెడిటేషన్ చేస్తున్నాను అని ఎవరితోనైనా చెప్పాల్సి వచ్చినప్పుడు నాబోటి వాడిలో ఏమాత్రం గర్వం, గొప్పదనం, కళ్లల్లో మెరుపు లేని స్థితికి చేరుకున్నప్పుడు కోరికను, అహాన్ని జయించినట్లు! లేదంటే మాయ మళ్లీ మత్తులోకి లాగేసుకుంటుంది. నిన్ను నువ్వు గొప్పగా ప్రదర్శించుకోవడం మిగతా ప్రపంచానికి దూరమయ్యే మత్తు అది!! సమాధి స్థితికి అడుగు దూరంలోకి వెళ్లి మరీ కిలోమీటర్ల వెనక్కి మళ్లిపోవడం లాంటిది అది!
- Sridhar Nallamothu