మీకు ఒక చిన్న బ్రెయిన్ ఎక్సర్సైజ్ ఇస్తాను.
ఇక్కడ కనిపిస్తున్న ఫోటో ని ఒక 30 seconds పాటు అలాగే తదేకంగా చూడండి. ఆ తరువాత కళ్ళు మూసుకుని మీరు ఏం చూశారో రంగులు మొదులుకుని ఆ ఫోటోలో ఉన్న రకరకాల వస్తువులు, ఇతర అంశాలను ఒకదాని తర్వాత ఒకటి గుర్తు చేసుకోవడానికి ప్రయత్నించండి.
షార్ట్ టర్మ్ మెమరీ శక్తివంతంగా కలిగి ఉన్న వారు కేవలం గరిష్టంగా 30 నుండి 40 శాతం డీటైల్ మాత్రమే గుర్తు తెచ్చుకోగలుగుతారు. మహా అయితే ఫలానా ఆరుగురు మనుషులు ఉన్నారు, నాలుగు చెట్లు ఉన్నాయి వంటి పెద్ద పెద్ద డీటెయిల్స్ చెప్పగలుగుతారు గానీ, చిన్న చిన్న సూక్ష్మమైన అంశాలను మళ్లీ చెప్పటం ఎవ్వరి వల్లా కాదు.
దీనికి ప్రధాన కారణం బ్రెయిన్ కళ్ల ముందు కనిపించే ప్రతీ దాన్నీ 100 శాతం రిజిస్టర్ చేసుకోవాలంటే దానికి విపరీతమైన శక్తి కావాలి. మనం తీసుకునే ఆహారంలో 20 శాతం వరకూ కేలరీలు కేవలం బ్రెయిన్‌కి అవసరపడుతూ ఉంటాయి. మిగతా కేలరీలన్నీ కాళ్లు, చేతుల కదలికలు, బరువులు ఎత్తడం వంటి వత్తిడికి సంబంధించిన పనులకు అవసరపడతాయి.
అందుకే తనకు అందుబాటులో ఉన్న తక్కువ మొత్తంలో కేలరీలతో పని నెట్టుకు రావడానికి బ్రెయిన్ మన ఫోన్ లో బ్యాటరీ సేవింగ్ మోడ్ ఎలాగైతే ఉంటుందో అలా ఎనర్జీ సేవింగ్ మోడ్‌లో పనిచేస్తుంది.
అంటే మనం ఫోన్ స్క్రీన్ మీద గానీ, బయట మన కళ్లెదురు గానీ ఒక సీన్ చూసిన వెంటనే అందులో మనల్ని ఆకర్షించే డ్రెస్ గానీ, వ్యక్తి గానీ, నవ్వు గానీ, ఫ్లవర్ గానీ ఇలా మన ఎమోషన్ని ఎక్కువ ట్రిగ్గర్ చేసే అంశాలకు మాత్రమే ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వబడి ఆ డీటైల్ వరకూ రిజిస్టర్ అవుతుంది. మిగతా 95 శాతం డీటైల్ కేవలం ఔట్‌లైన్‌గా రిజిస్టర్ అవుతుంది తప్పించి, ఎవరైనా గుచ్చిగుచ్చి అడిగితే మనం చెప్పలేం.
మీకు సులభంగా అర్థమయ్యే మరో ఉదాహరణ చెబుతాను. ఓ వ్యక్తి రోడ్డు మీద వెళ్తుంటే ఏదో కారు వచ్చి అతన్ని గుద్దింది అనుకోండి. ఆ టైంలో మీరు అక్కడుంటే, జరిగిన ఇన్సిడెంట్, ఆ వ్యక్తికి ఏర్పడిన గాయాలు వరకూ గుర్తుంటాయి కానీ, పోలీసులు వచ్చి వెహికిల్ నెంబర్ చెప్పండి అని మిమ్మల్ని అడిగితే “సరిగ్గా చూడలేదు” అని సమాధానమిస్తారు. వాస్తవానికి మీ కళ్లు చాలా స్పష్టంగా ఆ వెహికిల్ నెంబర్ని పలుమార్లు అక్కడ ఉన్నంత సేపూ చూసి ఉంటుంది. కానీ జరిగింది ఏమిటంటే, అది ఇంపార్టెంట్ అని మీరు భావించకపోవడం వల్ల దాన్ని మీ మైండ్‌లో రిజిస్టర్ చేసుకోలేకపోయారు అంతే!
మరో వ్యక్తికి ఇలాంటి విషయాల పట్ల బాగా అనుభవం ఉంటే, అతను ఇలా ఏదైనా యాక్సిడెంట్ జరిగినప్పుడు మొట్టమొదట వెహికల్ నెంబర్ తన మైండ్‌లో రిజిస్టర్ చేసుకుంటాడు. అతని మైండ్‌లో మిగతా డీటైల్స్ ఏమీ సరిగా రిజిస్టర్ అవకపోవచ్చు.
కేవలం మన అటెన్షన్ ద్వారా మాత్రమే మనం ఏ విషయాన్నయినా మన మైండ్‌లో సక్రమంగా రిజిస్టర్ చేసుకోగలుగుతాం. మనం 100 శాతం అటెన్షన్ పెట్టినప్పుడు మన బ్రెయిన్లో ఆ విషయానికి సంబంధించిన న్యూరాన్లకి మధ్య కమ్యూనికేషన్ జరిగి అది ఓ మెమరీగా అలా గుర్తుండిపోతుంది. మనం అటెన్షన్ పెట్టని విషయాలు ఎన్నిసార్లు చూసినా, చదివినా గుర్తుండవు.
- Sridhar Nallamothu